
అలరించనున్న వ్యూహాత్మక క్షిపణి, యుద్ధ నిఘా వ్యవస్థ
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతోపాటు తొలిసారిగా యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’, వ్యూహాత్మక క్షిపణి ‘ప్రళయ్’ కనిపించనున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన 40 యుద్ధ విమానాలు, తీరరక్షక దళంలోని 3 డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక దళ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి.
పరేడ్ కమాండర్‌గా ఢిల్లీలోని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నీశ్, పరేడ్ సెకండ్ –ఇన్–కమాండ్‌గా ఢిల్లీ ప్రాంత చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ సుమిత్ మెహతా వ్యవహరిస్తారు. టి–90 భీష్మ ట్యాంకులు, బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, నాగ్ క్షిపణి వ్యవస్థ ఇందులో పాలుపంచుకుంటాయి.
పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. ఇందులో డీఆర్‌డీవోకు చెందిన పలు అంచల రక్షణ వ్యవస్థ ‘రక్షా కవచ్’కూడా ఉంటుందని రక్షణ శాఖ గురువారం వివరించింది. మొట్టమొదటిసారిగా త్రివిధ దళాల శకటం కూడా ఇందులో ఉంటుందన్నారు. ఈ వేడుకల ప్రధాన అతిథి ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో కాగా, ఆదేశం నుంచి కూడా ఒక బ్యాండ్ జట్టు పరేడ్‌లో కలిసి నడుస్తుందన్నారు. కార్గిల్ యుద్ధ వీరులైన ఇద్దరు పరమ వీర చక్ర గ్రహీతలు, ఒక అశోక చక్ర గ్రహీత కూడా పరేడ్‌లో భాగస్వాములవనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాలు కొనసాగి, దేశ వారసత్వం, అభివృద్ధి పయనాన్ని కళ్లకు కడుతుందని అధికారులు తెలిపారు.