కవి వడిచర్ల సత్యం దంపతులను సన్మానిస్తున్న సాహితీవేత్తలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్‌బుక్ వారు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంజిలప్పకు సన్మానం...
బొంరాస్‌పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment