ఇంకా ముంపులోనే
భద్రాచలం : ఉగ్ర గోదారి శాంతించింది. 56 అడుగులు దాటి ప్రవహించటంతో తీవ్ర భయాందోళనకు గురైన పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి 49.7 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ఏజెన్సీలోని పలు గ్రామాలు మాత్రం ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 25 గ్రామాలకు చెందిన 623 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.
వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా 31 చోట్ల రహదారులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది గ్రామాలకు మంగళవారం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో చీకుపల్లి అవతల ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గినా, దిగువన ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాపై తీవ్ర ప్రభావం చూపింది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి, వడ్డిగూడెం, కూనవరం మండలంలోని ఉదయ భాస్కర్ కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో ఆయా గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు.
చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే దారిలో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం డివిజన్‌లో ఏడు మండలాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు ప్రకటించారు. డివిజన్‌లోని 9 గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టగా, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల్వంచ డివిజన్‌లోని ఆరు మండలాలకు చెందిన 16 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టగా రెండు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు.
భద్రాచలాన్ని వీడని వరద...
భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పట్టణంలోని అశోక్ నగర్ కొత్తకాలనీని వరద వీడలేదు. వరద తగ్గిన తరువాత ఇక్కడ ఇంకా ఎక్కువగా నీరు చేరటం గమనార్హం. సమీపాన ఉన్న అయ్యప్ప కాలనీలోని ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది. స్లూయీస్‌ల నుంచి వరద నీరు కాలనీలోకి వస్తుండగా, దానిని ఆ స్థాయిలో బయటకు తరలించకపోవటంతోనే సమస్య జఠిలంగా మారింది. ఈ విషయంలో అధికారుల వైఖరిపై కలెక్టర్ ఇలంబరితి కూడా సీరియస్‌గానే ఉన్నారు.
పంట నష్టం అంచనాలకు సిద్ధం...
వరద తగ్గుముఖం పడుతుండటంతో పంటలు ఏ మేరకు నష్టపోయాయో సర్వే చేపట్టాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు వ్యవసాయశాఖాధికారులు సిద్ధమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 25 వేల ఎకరాలకు పైగానే పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వరద పూర్తిగా తొలగితే తప్ప వాస్తవ నష్టాన్ని లెక్క కట్టవచ్చని ఓ వ్యవసాయశాఖాధికారి తెలిపారు.
సహాయక చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోమవారం అంతా భద్రాచలంలోనే ఉన్న కలెక్టర్ మంగళవారం కూడా వచ్చి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నటు ్ల‘సాక్షి’తో చెప్పారు. ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లోనూ తామే సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు కోతకు గురైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.