supporting Activities
-
భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ చర్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం అర్థరాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతొ జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 384 ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దించింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బుద్ద భవన్ దగ్గర ఇ.వి.డి.ఎం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి తెల్లవారుజామున నాలుగు గంటలకు నీట మునిగిన ప్రాంతాలకు చేరుకొని సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షానికి రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్ఎప్ బృందాలతో కలిసి స్వయంగా తొలిగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో నియమించారు. అత్యవసర పరిస్థుతుల్లో డయల్ 100, జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111 లకు ఫోన్ చేయాలని బల్దియా విజ్జప్తి చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి మొత్తం 252 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 132 స్టాటిక్ బృందాలు ఉన్నాయి. మొత్తం 252 మొబైల్ బృందాలలో ఇన్స్టాంట్ రిపేర్ టీమ్‌లు 79, మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు 120, మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు 38, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు 15 ఏర్పాటు చేశారు. టాటాఏస్, ఓమ్నీ వ్యాన్, నలుగురు లేబర్లు ,ట్రీ కట్టర్, పంప్, గొడ్డళ్లు, క్రోబార్స్ తో 120 మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు సిద్దంగా ఉన్నాయి. మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు(38): ప్రతి ఇంజనీరింగ్ డివిజన్‌కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు (15) : సెంట్రల్ కంట్రోల్ రూంలో 15 ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రతి బృందంలో డి.సి.ఎం వ్యాన్, ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. నగరంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 132 ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. నలుగురు కార్మికులతో కూడిన ఒక్కో బృందం నాలాల్లో నీటి ప్రవాహాన్ని నిలువరించే ప్లాస్టిక్ కవర్లను తొలగించే పనిని చేపడతారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడానికి 255 పంపులను సిద్దంగా ఉంచారు. -
వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
సాక్షి, అమరావతి : ఎగువ నుంచి కృష్ణా నదికి వస్తున్న వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ముప్పు నివారణ కోసం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రెండు జిల్లాల్లో విధులు నిర్వహించడానికి 140 మంది పైర్ సిబ్బంది, 180 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలను నియమించినట్లు స్పష్టం చేశారు. నీట మునిగిన 10 మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు 10 మంది చొప్పున విడిపోయి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికర్ల, కొల్లిపర, కొల్లూరు, గుంటూరు జిల్లా తుల్లూరు, సీతానగరం మండలాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెండు జిల్లాలు కలిపి మొత్తం 56 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 14,413 ఆహార పొట్లాలు, 42వేల మంచినీటి ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే రోగాల బారిన పడకుండా తగిన వైద్యం అందించడానికి రెండు జిల్లాల్లో 54 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు జిల్లాలు కలిపి 32 మండలాలకుగాను 87 గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఉదయం 9గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.21 లక్షల క్యూసెక్కుల అవుట్‌ప్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
మేఘాలయలో తేలని కార్మికుల జాడ
షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా జిల్లాలో ఓ అక్రమ బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మి కుల జాడ ఇంకా తెలియరావడం లేదు. అధికారులు శక్తిమంతమైన మోటార్ల సాయంతో ఇప్పటికే కోటి లీటర్ల నీటిని తోడేసినప్పటికీ 370 అడుగుల లోతున్న ఈ గనిలో నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న గనుల నుంచి నీళ్లు వస్తుంటా యన్న అనుమానంతో వాటి నుంచి మరో 2 కోట్ల లీటర్ల నీటిని తోడేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. గతేడాది డిసెంబర్ 13న పక్కనే ఉన్న లైటన్‌నదిలోని నీరు గనిలోకి ఒక్కసారిగా పోటెత్తడంతో 15 మంది లోపల చిక్కుకు పోయారు. తాజాగా సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సహాయక చర్యలు సాగుతున్నాయి. మరోవైపు కార్మికుల జాడను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), గ్రా విటీ అండ్ మాగ్నటిక్ గ్రూప్‌కు చెందిన నిపు ణులు ఆదివారం గని వద్దకు చేరుకున్నారు. వీరికి అదనంగా చెన్నైకు చెందిన నీటిలో ప్రయానించే రిమోట్ కంట్రోల్ వాహనంతో పాటు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై సీఎస్ఐఆర్ నిపుణుడు దేవాశిష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 20 నుంచి గనిలో నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు అంతుపట్టడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్ సహా వేర్వేరు విభాగాలకు చెందిన 200 మంది నిపుణులు, సిబ్బంది కార్మికుల జాడ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
ఇంకా ముంపులోనే
భద్రాచలం : ఉగ్ర గోదారి శాంతించింది. 56 అడుగులు దాటి ప్రవహించటంతో తీవ్ర భయాందోళనకు గురైన పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి 49.7 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ఏజెన్సీలోని పలు గ్రామాలు మాత్రం ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 25 గ్రామాలకు చెందిన 623 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా 31 చోట్ల రహదారులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది గ్రామాలకు మంగళవారం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో చీకుపల్లి అవతల ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గినా, దిగువన ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాపై తీవ్ర ప్రభావం చూపింది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి, వడ్డిగూడెం, కూనవరం మండలంలోని ఉదయ భాస్కర్ కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో ఆయా గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే దారిలో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం డివిజన్లో ఏడు మండలాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు ప్రకటించారు. డివిజన్లోని 9 గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టగా, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల్వంచ డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన 16 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టగా రెండు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు. భద్రాచలాన్ని వీడని వరద... భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పట్టణంలోని అశోక్ నగర్ కొత్తకాలనీని వరద వీడలేదు. వరద తగ్గిన తరువాత ఇక్కడ ఇంకా ఎక్కువగా నీరు చేరటం గమనార్హం. సమీపాన ఉన్న అయ్యప్ప కాలనీలోని ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది. స్లూయీస్‌ల నుంచి వరద నీరు కాలనీలోకి వస్తుండగా, దానిని ఆ స్థాయిలో బయటకు తరలించకపోవటంతోనే సమస్య జఠిలంగా మారింది. ఈ విషయంలో అధికారుల వైఖరిపై కలెక్టర్ ఇలంబరితి కూడా సీరియస్‌గానే ఉన్నారు. పంట నష్టం అంచనాలకు సిద్ధం... వరద తగ్గుముఖం పడుతుండటంతో పంటలు ఏ మేరకు నష్టపోయాయో సర్వే చేపట్టాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు వ్యవసాయశాఖాధికారులు సిద్ధమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 25 వేల ఎకరాలకు పైగానే పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వరద పూర్తిగా తొలగితే తప్ప వాస్తవ నష్టాన్ని లెక్క కట్టవచ్చని ఓ వ్యవసాయశాఖాధికారి తెలిపారు. సహాయక చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి... వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోమవారం అంతా భద్రాచలంలోనే ఉన్న కలెక్టర్ మంగళవారం కూడా వచ్చి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నటు ్ల‘సాక్షి’తో చెప్పారు. ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లోనూ తామే సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు కోతకు గురైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. -
నిన్న నిర్మాణం నేడు విషాదం
ఇంజనీర్ల ఆదేశాలు, బేల్దారీ కార్మికుల ఉరుకులు పరుగులతో రూపుదిద్దుకున్న చెన్నై మౌళివాకంలోని అపార్ట్మెంటు నేడు శ్మశానంలా మారిపోయింది. ఈ నెల 28న అపార్ట్మెంటు కుప్పకూలి 61 మందిని పొట్టన పెట్టుకుంది. శిథిలాల తొలగింపు పూర్తికాగా విషాదం మాత్రం మిగిలింది. * 61 మందిని బలిగొన్న అపార్ట్మెంటు * ముగిసిన శిథిలాల తొలగింపు పదిరోజుల్లో మరో * అపార్ట్మెంటు కూల్చివేత చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సొంతింటి కలను దుర్మార్గమైన రీతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న బిల్డర్ ఆశలు ఆయన కట్టిన అపార్ట్మెంటులాగానే కుప్పకూలిపోయాయి. ఆయనతోపాటూ మరో ఐదుగురిని కటకటాలపాలు చేశాయి. కూలీ నాలీ చేసుకుని కడుపు నింపుకుందామని వచ్చి న 61 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయూరు. గాయపడిన వారిని కలుపుకుంటే బిల్డర్ దురాశ 88 కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్ర, తమిళనాడు, ఒడిశాలకు చెందిన 88 మంది శిథిలాల్లో చిక్కుకుని సహాయం కోసం తపించారు. అగ్నిమాపక శాఖ, పోలీస్‌శాఖ, జాతీయ విపత్తుల నివారణ బృందం ఆరురోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి సహాయక చర్యలు పూర్తిచేశారు. ఏడు జాగిలాలు సహాయక బృందాలు భారీ స్థాయిలో సహకరించాయి. ఏ మాత్రం తొందరపాటు పడినా శిథిలాలు పైన పడి బతికి ఉన్నవారు సైతం ప్రాణాలు కోల్పోయేవారు. అయితే పనిలో వేగంతోపాటూ జాగ్రత్తలు పాటించడంతో ఒడి శాకు చెందిన ఒక యువకుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మొదటి నాలుగురోజుల వరకు మృతదేహాలు, గాయపడిన వారు బయటపడగా, చివరి రెండు రోజుల్లో ఒక్కరూ ప్రాణాలతో చిక్కలేదు. బంధువులు గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు చితికి పోయాయి. ప్రమాదం జరిగిన మౌళివాక్కం, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్, మృతదేహాలను ఉంచిన రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి గత ఆరురోజులుగా బాధితుల బంధువుల రోదనలతో నిండిపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారు కావడంతో బంధువులు ఏమీ చేయలేని స్థితిలో తల్లడిల్లిపోయారు. మార్చురీ వద్ద విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఏపీ బాధితులకు సహకరించారు. పదిరోజుల్లో మరో అపార్టుమెంటు కూల్చివేత ప్రమాదం జరిగిన ప్రాంగణంలోనే ఉన్న మరో 11 అంతస్తుల అపార్టుమెంటును ప్రభుత్వమే కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఈ అపార్టుమెంటు నివాసానికి పనికిరాదని ప్రకటిస్తూ ఇప్పటికే సీఎండీఏ అధికారులు సీల్ వేసి లోనికి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ రేకులు కట్టేశారు. అత్యాధునిక పద్ధతిలో అపార్టుమెంటు కింద బాంబులు అమర్చడం ద్వారా కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే 11 అంతస్తుల భవనం కూలడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు కిలో మీటరు దూరం వరకు భారీ ఎత్తున మట్టి అలుముకునే అవకాశం ఉంది. ఇరుగుపొరుగు భవనాలపై శిథిలాలు పడుతాయి. ఈ కారణంగా పరిసరాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి కూల్చాలని భావిస్తున్నారు. శుక్రవారంతో సహాయక చర్యలు పూర్తికావడంతో కూల్చే భవనంపై అధికారులు దృష్టి సారించా రు. నగర పోలీస్ కమిషనర్ జార్జ్, లాండ్ రెవెన్యూ కమిషనర్ వేర్వేరుగా ప్రమాద స్థలిని, కూల్చాల్సిన అపార్టుమెంటును పరిశీలించారు. ప్రమాద స్థలిలో పార్కు: అపార్టుమెంట్లు నిర్మిం చిన ప్రాంతం ఒకప్పుడు నీటిగుంట కావడం వల్లనే ప్రమాదం జరగడానికి ఒక ప్రధాన కారణమని నిర్ధారించారు. అందువల్ల ఈ ప్రాంగణంలో ఎప్పటికీ నివాస గృహాలు, మరే కట్టడాలు నిర్మించకుండా పార్కు నిర్మించాలని చెన్నై కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిసింది. -
మేల్కొనకుంటే ముప్పే...
గోదావరి వరదలతో అపార నష్టం స్లూయిస్ల లీకులతోనే భద్రాద్రిలోకి వరద నీరు కరకట్టల నిర్మాణంలో తీవ్ర జాప్యం ముంపు మండలాలకే అధికంగా వరద తాకిడి ఆంధ్రలో విలీనంతో అంతా గందరగోళం వరదలపై నేడు సమీక్ష సమావేశం భద్రాచలం :గోదావరి పరివాహక ప్రజలు వచ్చే మూడు నెలల పాటు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి. వరద సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సైతం కత్తిమీద సాము వంటిదే. ప్రతి ఏటా గోదావరి వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తున్నప్పటికీ విపత్తులతో ఈ ప్రాంతవాసులకు తీవ్ర నష్టమే వాటిల్లుతోంది. ముందస్తు ప్రణాళికలను క్షేత్ర స్థాయిలో అమలు చేయటంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంలా మారుతోంది. వరద ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ భూ సేకరణ సమస్యలతో ఈ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. అలాగే వరదల సమయంలో రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలి చిపోయే ప్రమాదం ఉండడంతో ఆయా మండలాల్లో నిత్యావసర సరుకుల కొరత లేకుండా బఫర్ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ ఏడాది వరదలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మంగళవారం జిల్లా కేంద్రంలో సమీక్షిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. స్లూయీస్‌ల లీకులతో భద్రాద్రికి ముప్పు... గోదావరి నదికి మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద వచ్చిందంటే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరుతుంది. పట్టణం చుట్టూ కరకట్టలు ఉన్నప్పటికీ స్లూయీస్‌ల లీకేజీ వల్లే ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. వర్షపు నీటితో పాటు డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు నీటిని బయటకు పంపేందుకు కరకట్టలకు ఏర్పాటు చేసినా.. స్లూయీస్‌లను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. కేవలం వరదల సమయంలోనే హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోవటం లేదనే విమర్శ ఉంది. భారీ వర్షం పడితే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఆ సమయంలోనే స్లూయీస్‌ల లీకేజీల ద్వారా గోదావరి నీరు కూడా పట్టణంలోకి వస్తోంది. దీంతో రామాలయ పరిసర ప్రాంతాలు, అశోక్‌నగర్ కొత్తకాలనీ, సుభాష్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునుగుతాయి. ఏటా ఇలానే జరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలే కీలకం... విపత్తుల సమయంలో చేపట్టే సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం పొంగినప్పుడు బాధితులకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ తల దాచుకునే వారికి తగిన సహాయం అందటం లేదనే విమర్శ ఉంది. గత ఏడాది భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సరైన సౌకర్యాలు కల్పించకపోగా, కనీసం భోజనం కూడా పెట్టలేదని బాధితులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. పరామర్శకు వచ్చిన అప్పటి కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్‌ను నిలదీశారు. అలాగే భద్రాచలం మండలంలోని గన్నవరం గ్రామాన్ని ఏ ఒక్క అధికారి సందర్శించలేదని, వాజేడు వంటి మండలాలకు సెక్టోరియల్ అధికారలు సకాలంలో చేరుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముంపు మండలాల పరిస్థితి ఏమిటో.. గోదావరి పరివాహక ప్రాంతంలోని 14 మండలాలకు వరద ముంపు ఉంటుందని అధికారులు గుర్తించారు. భద్రాచలం డివిజన్లోని ఎనిమిది మండలాలతో పాటు పాల్వంచ డివిజన్లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరదల సమయంలో నీరు పోటెత్తి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతాయి. వరద ఉధృతి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తే తిరిగి నీటి మట్టం తగ్గేంత వరకూ భద్రాచలం నుంచి వాజేడు, వీఆర్‌పురం రహదాలను వరద నీరు ముంచెత్తుతుంది. అయితే ఈ 14 మండలాల్లో ప్రస్తుతం ఏడు మండలాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. కాగా, వరదలొస్తే ఈ మండలాల్లో సహాయక చర్యలు ఎవరు చేపట్టాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ మండలాలపై తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అజమాయిషీ లేని పరిస్థితుల్లో తమను ఎవరు ఆదుకుంటారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలవల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస, మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలవల్ల తలెత్తిన విపత్కర పరిస్థితులపై శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల వారికి ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా చిన్ననీటి వనరుల మరమ్మతులు, చెరువు గట్లను పటిష్టం చేయడం ద్వారా నీరు వృథాకాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని మంత్రుల ద్వారా ఇప్పించాలని కలెక్టర్లను కోరారు. అధికార యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నందున తాను వరద ప్రాంతాల్లో ఎప్పుడు పర్యటించేది ఆదివారం నిర్ణయిస్తామన్నారు. కచ్చితంగా అంచనాలు రూపొందించండి వర్షాలు, వరదలవల్ల కలిగిన నష్టాల అంచనాలను కచ్చితంగా రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టంతోపాటు రహదారులు, చెరువులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాల నివేదికలు రూపొందించాలని సూచించారు. బాధితులందరికీ పరిహారం అందేలా చూడాలన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మహీధర్‌రెడ్డి, పార్థసారథి, కొండ్రు మురళి, విపత్తు నిర్వహణ కమిషనర్ టి.రాధ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం సంచాలకుడు సుధాకర్‌రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పకడ్బందీగా సహాయక కార్యక్రమాలు: సీఎస్ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల వారిని అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, బాధితులకు ఆహారం, నీటి ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు.