నిన్న నిర్మాణం నేడు విషాదం | Flaws Led to Chennai Building Collapse, Say Experts | Sakshi
Sakshi News home page

నిన్న నిర్మాణం నేడు విషాదం

Published Sat, Jul 5 2014 2:26 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

నిన్న నిర్మాణం నేడు విషాదం - Sakshi

నిన్న నిర్మాణం నేడు విషాదం

ఇంజనీర్ల ఆదేశాలు, బేల్దారీ కార్మికుల ఉరుకులు పరుగులతో రూపుదిద్దుకున్న చెన్నై మౌళివాకంలోని అపార్ట్‌మెంటు నేడు శ్మశానంలా మారిపోయింది. ఈ నెల 28న  అపార్ట్‌మెంటు కుప్పకూలి 61 మందిని పొట్టన పెట్టుకుంది. శిథిలాల తొలగింపు పూర్తికాగా  విషాదం మాత్రం మిగిలింది.
 
* 61 మందిని బలిగొన్న అపార్ట్‌మెంటు
* ముగిసిన శిథిలాల తొలగింపు పదిరోజుల్లో మరో
* అపార్ట్‌మెంటు కూల్చివేత
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సొంతింటి కలను దుర్మార్గమైన రీతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న బిల్డర్ ఆశలు ఆయన కట్టిన అపార్ట్‌మెంటులాగానే కుప్పకూలిపోయాయి. ఆయనతోపాటూ మరో ఐదుగురిని కటకటాలపాలు చేశాయి. కూలీ నాలీ చేసుకుని కడుపు నింపుకుందామని వచ్చి న 61 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయూరు. గాయపడిన వారిని కలుపుకుంటే బిల్డర్ దురాశ 88 కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్ర, తమిళనాడు, ఒడిశాలకు చెందిన 88 మంది శిథిలాల్లో చిక్కుకుని సహాయం కోసం తపించారు.

అగ్నిమాపక శాఖ, పోలీస్‌శాఖ, జాతీయ విపత్తుల నివారణ బృందం ఆరురోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి సహాయక చర్యలు పూర్తిచేశారు. ఏడు జాగిలాలు సహాయక బృందాలు భారీ స్థాయిలో సహకరించాయి. ఏ మాత్రం తొందరపాటు పడినా శిథిలాలు పైన పడి బతికి ఉన్నవారు సైతం ప్రాణాలు కోల్పోయేవారు. అయితే పనిలో వేగంతోపాటూ జాగ్రత్తలు పాటించడంతో ఒడి శాకు చెందిన ఒక యువకుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

మొదటి నాలుగురోజుల వరకు మృతదేహాలు, గాయపడిన వారు బయటపడగా, చివరి రెండు రోజుల్లో ఒక్కరూ ప్రాణాలతో చిక్కలేదు. బంధువులు గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు చితికి పోయాయి. ప్రమాదం జరిగిన మౌళివాక్కం, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్, మృతదేహాలను ఉంచిన రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి గత ఆరురోజులుగా బాధితుల బంధువుల రోదనలతో నిండిపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారు కావడంతో బంధువులు ఏమీ చేయలేని స్థితిలో తల్లడిల్లిపోయారు. మార్చురీ వద్ద విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఏపీ బాధితులకు సహకరించారు.
 
పదిరోజుల్లో మరో అపార్టుమెంటు కూల్చివేత
ప్రమాదం జరిగిన ప్రాంగణంలోనే ఉన్న మరో 11 అంతస్తుల అపార్టుమెంటును ప్రభుత్వమే కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఈ అపార్టుమెంటు నివాసానికి పనికిరాదని ప్రకటిస్తూ ఇప్పటికే సీఎండీఏ అధికారులు సీల్ వేసి లోనికి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ రేకులు కట్టేశారు. అత్యాధునిక పద్ధతిలో అపార్టుమెంటు కింద బాంబులు అమర్చడం ద్వారా కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే 11 అంతస్తుల భవనం కూలడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు కిలో మీటరు దూరం వరకు భారీ ఎత్తున మట్టి అలుముకునే అవకాశం ఉంది.

ఇరుగుపొరుగు భవనాలపై శిథిలాలు పడుతాయి. ఈ కారణంగా పరిసరాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి కూల్చాలని భావిస్తున్నారు. శుక్రవారంతో సహాయక చర్యలు పూర్తికావడంతో కూల్చే భవనంపై అధికారులు దృష్టి సారించా రు. నగర పోలీస్ కమిషనర్ జార్జ్, లాండ్ రెవెన్యూ కమిషనర్ వేర్వేరుగా ప్రమాద స్థలిని, కూల్చాల్సిన అపార్టుమెంటును పరిశీలించారు.
 
ప్రమాద స్థలిలో పార్కు: అపార్టుమెంట్లు నిర్మిం చిన ప్రాంతం ఒకప్పుడు నీటిగుంట కావడం వల్లనే ప్రమాదం జరగడానికి ఒక ప్రధాన కారణమని నిర్ధారించారు. అందువల్ల ఈ ప్రాంగణంలో ఎప్పటికీ నివాస గృహాలు,    మరే కట్టడాలు నిర్మించకుండా పార్కు నిర్మించాలని చెన్నై కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement