Beldari workers
-
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
హత్యాచారం ఓ కట్టుకథ
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాలపై పెత్తనాన్ని ఆశించి భంగపడ్డ అధికారపక్ష నేత స్వార్థ అమాయక ప్రజలను అశాంతికి గురిచేసింది. విద్యార్థుల లేత మనసులను అల్లకల్లోలం చేసింది. పాఠశాలకు తాళం పడేలా చేసింది. చెన్నై పల్లవరంలో పునిద అన్నై తెరసా బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై వారం రోజుల క్రితం పాఠశాల తరగతి గదిలోనే లైంగికదాడి చేసి హత్య చేసినట్లుగా వచ్చిన వదంతులు సోమవారం ఉద్రిక్తతకు దారితీశాయి. వేలాది మంది పాఠశాలను చుట్టుముట్టి ఆందోళన చేపట్టగా జిల్లా కలెక్టర్ భాస్కరన్ పాఠశాలకు సెలవు ప్రకటించి విచారణకు ఆదేశించారు. పదోతరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థినిపై పాఠశాలలో నిర్మాణపు పనులు చేస్తున్న బేల్దారీ కార్మికులు కొందరు ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చారుు. అయితే ఈ పాఠశాలలో సంగీత అనే పేరుతో 14 మంది చదువుతున్నారు. అందరూ పాఠశాలకు హాజరవుతున్నారు. గత ఏడాది పదోతరగతి పూర్తి చేసిన సంగీత ప్రస్తుతం వేరే కాలేజీలో చదువుతోంది. ఆ యువతి కూడా క్షేమంగా ఉన్నట్లు విచారణలో తేలింది. పాఠశాల అనుబంధ హాస్టల్లో వందమంది విద్యార్థినులు ఉండగా, 96 మంది పాఠశాలలోనూ, నలుగురు సెలవుపైన వెళ్లినట్లు గుర్తించారు. ఒక విద్యార్థినిపై ఇంతటి ఆఘాయిత్యం జరిగినపుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. అలాంటిదేమీ అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠశాలలో హత్యాచారం జరిగినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదు. సోమవారం నాటి ఆందోళన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణను కొనసాగిస్తుండగా, పోలీసులు మాత్రం వదంతులు రేపిన వ్యక్తిని గుర్తించినట్లు చెబుతున్నారు. పల్లవరం ప్రాంతానికి చెందిన అధికార పక్ష నేత ఒకరు సదరు పాఠశాలలో అడ్మిషన్లకు కొందరికి సిఫార్సు చేశాడని, అయితే ఇందుకు పాఠశాల వారు నిరాకరించారని చెబుతున్నారు. ఇందుకు కక్ష కట్టిన సదరు నేత పాఠశాలను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ హత్యాచారం వదంతిని సృష్టించాడని చెబుతున్నారు. అధికార పక్షానికి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యం చెప్పేందుకు సైతం ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. పోలీస్ విచారణలో వాస్తవాలు వెలుగు చూసినా అందుకు తగిన ఆధారాలు చూపలేక పోతున్నారు. ఒక వైపు పోలీస్, మరోవైపు విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగుతుండగా పరిస్థితి సద్దుమణిగే వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆగ్రహం: ఒక పాఠశాలలో రేగిన వివాదాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూమున్ననిలకు ముడిపెట్టడం సరికాదని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సెంబాకం వేద సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు రాజకీయ నాయకులు తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తుండగా ఏమీ లేదని పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటని ఆయన మండిపడ్డారు. పాఠశాల నిర్వహణపై వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాన్ని పారదోలాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ పల్లవరంలో కంటోన్మెంటు భూములను కొందరు అక్రమించి అనుమతుల్లేకుండా విద్యాసంస్థలను నెలకొల్పారంటూ అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ రాణా సయ్యద్ యూసుఫ్ మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంట్‌థామస్ మౌంట్, పల్లవరం కంటోన్మెంటు పోర్టు 1774 ఏర్పాటు కాగా, ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికశాతం ఆక్రమణలకు లోనైందన్నారు. ఇటీవల మరో 20 ఎకరాలు అన్యాక్రాంతం కాగా అక్కడి సైనికాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆక్రమణ ప్రదేశాల్లో అక్రమంగా అనేక ప్రైవేటు పాఠశాలలు వెలిసి శాంతి, భద్రతల సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ ఈ పిటిషన్‌లోని అంశాలను విన్నారు. రెండు వారాల్లోగా పిటిషన్‌దారుని ఆరోపణలపై బదులివ్వాలని 11 మంది అధికారులను ఆదేశించారు. -
నిన్న నిర్మాణం నేడు విషాదం
ఇంజనీర్ల ఆదేశాలు, బేల్దారీ కార్మికుల ఉరుకులు పరుగులతో రూపుదిద్దుకున్న చెన్నై మౌళివాకంలోని అపార్ట్మెంటు నేడు శ్మశానంలా మారిపోయింది. ఈ నెల 28న అపార్ట్మెంటు కుప్పకూలి 61 మందిని పొట్టన పెట్టుకుంది. శిథిలాల తొలగింపు పూర్తికాగా విషాదం మాత్రం మిగిలింది. * 61 మందిని బలిగొన్న అపార్ట్మెంటు * ముగిసిన శిథిలాల తొలగింపు పదిరోజుల్లో మరో * అపార్ట్మెంటు కూల్చివేత చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సొంతింటి కలను దుర్మార్గమైన రీతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న బిల్డర్ ఆశలు ఆయన కట్టిన అపార్ట్మెంటులాగానే కుప్పకూలిపోయాయి. ఆయనతోపాటూ మరో ఐదుగురిని కటకటాలపాలు చేశాయి. కూలీ నాలీ చేసుకుని కడుపు నింపుకుందామని వచ్చి న 61 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయూరు. గాయపడిన వారిని కలుపుకుంటే బిల్డర్ దురాశ 88 కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్ర, తమిళనాడు, ఒడిశాలకు చెందిన 88 మంది శిథిలాల్లో చిక్కుకుని సహాయం కోసం తపించారు. అగ్నిమాపక శాఖ, పోలీస్‌శాఖ, జాతీయ విపత్తుల నివారణ బృందం ఆరురోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి సహాయక చర్యలు పూర్తిచేశారు. ఏడు జాగిలాలు సహాయక బృందాలు భారీ స్థాయిలో సహకరించాయి. ఏ మాత్రం తొందరపాటు పడినా శిథిలాలు పైన పడి బతికి ఉన్నవారు సైతం ప్రాణాలు కోల్పోయేవారు. అయితే పనిలో వేగంతోపాటూ జాగ్రత్తలు పాటించడంతో ఒడి శాకు చెందిన ఒక యువకుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మొదటి నాలుగురోజుల వరకు మృతదేహాలు, గాయపడిన వారు బయటపడగా, చివరి రెండు రోజుల్లో ఒక్కరూ ప్రాణాలతో చిక్కలేదు. బంధువులు గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు చితికి పోయాయి. ప్రమాదం జరిగిన మౌళివాక్కం, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్, మృతదేహాలను ఉంచిన రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి గత ఆరురోజులుగా బాధితుల బంధువుల రోదనలతో నిండిపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారు కావడంతో బంధువులు ఏమీ చేయలేని స్థితిలో తల్లడిల్లిపోయారు. మార్చురీ వద్ద విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఏపీ బాధితులకు సహకరించారు. పదిరోజుల్లో మరో అపార్టుమెంటు కూల్చివేత ప్రమాదం జరిగిన ప్రాంగణంలోనే ఉన్న మరో 11 అంతస్తుల అపార్టుమెంటును ప్రభుత్వమే కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఈ అపార్టుమెంటు నివాసానికి పనికిరాదని ప్రకటిస్తూ ఇప్పటికే సీఎండీఏ అధికారులు సీల్ వేసి లోనికి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ రేకులు కట్టేశారు. అత్యాధునిక పద్ధతిలో అపార్టుమెంటు కింద బాంబులు అమర్చడం ద్వారా కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే 11 అంతస్తుల భవనం కూలడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు కిలో మీటరు దూరం వరకు భారీ ఎత్తున మట్టి అలుముకునే అవకాశం ఉంది. ఇరుగుపొరుగు భవనాలపై శిథిలాలు పడుతాయి. ఈ కారణంగా పరిసరాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి కూల్చాలని భావిస్తున్నారు. శుక్రవారంతో సహాయక చర్యలు పూర్తికావడంతో కూల్చే భవనంపై అధికారులు దృష్టి సారించా రు. నగర పోలీస్ కమిషనర్ జార్జ్, లాండ్ రెవెన్యూ కమిషనర్ వేర్వేరుగా ప్రమాద స్థలిని, కూల్చాల్సిన అపార్టుమెంటును పరిశీలించారు. ప్రమాద స్థలిలో పార్కు: అపార్టుమెంట్లు నిర్మిం చిన ప్రాంతం ఒకప్పుడు నీటిగుంట కావడం వల్లనే ప్రమాదం జరగడానికి ఒక ప్రధాన కారణమని నిర్ధారించారు. అందువల్ల ఈ ప్రాంగణంలో ఎప్పటికీ నివాస గృహాలు, మరే కట్టడాలు నిర్మించకుండా పార్కు నిర్మించాలని చెన్నై కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిసింది.