హత్యాచారం ఓ కట్టుకథ
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాలపై పెత్తనాన్ని ఆశించి భంగపడ్డ అధికారపక్ష నేత స్వార్థ అమాయక ప్రజలను అశాంతికి గురిచేసింది. విద్యార్థుల లేత మనసులను అల్లకల్లోలం చేసింది. పాఠశాలకు తాళం పడేలా చేసింది. చెన్నై పల్లవరంలో పునిద అన్నై తెరసా బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై వారం రోజుల క్రితం పాఠశాల తరగతి గదిలోనే లైంగికదాడి చేసి హత్య చేసినట్లుగా వచ్చిన వదంతులు సోమవారం ఉద్రిక్తతకు దారితీశాయి.
వేలాది మంది పాఠశాలను చుట్టుముట్టి ఆందోళన చేపట్టగా జిల్లా కలెక్టర్ భాస్కరన్ పాఠశాలకు సెలవు ప్రకటించి విచారణకు ఆదేశించారు. పదోతరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థినిపై పాఠశాలలో నిర్మాణపు పనులు చేస్తున్న బేల్దారీ కార్మికులు కొందరు ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చారుు. అయితే ఈ పాఠశాలలో సంగీత అనే పేరుతో 14 మంది చదువుతున్నారు. అందరూ పాఠశాలకు హాజరవుతున్నారు.
గత ఏడాది పదోతరగతి పూర్తి చేసిన సంగీత ప్రస్తుతం వేరే కాలేజీలో చదువుతోంది. ఆ యువతి కూడా క్షేమంగా ఉన్నట్లు విచారణలో తేలింది. పాఠశాల అనుబంధ హాస్టల్లో వందమంది విద్యార్థినులు ఉండగా, 96 మంది పాఠశాలలోనూ, నలుగురు సెలవుపైన వెళ్లినట్లు గుర్తించారు. ఒక విద్యార్థినిపై ఇంతటి ఆఘాయిత్యం జరిగినపుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. అలాంటిదేమీ అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠశాలలో హత్యాచారం జరిగినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదు. సోమవారం నాటి ఆందోళన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణను కొనసాగిస్తుండగా, పోలీసులు మాత్రం వదంతులు రేపిన వ్యక్తిని గుర్తించినట్లు చెబుతున్నారు.
పల్లవరం ప్రాంతానికి చెందిన అధికార పక్ష నేత ఒకరు సదరు పాఠశాలలో అడ్మిషన్లకు కొందరికి సిఫార్సు చేశాడని, అయితే ఇందుకు పాఠశాల వారు నిరాకరించారని చెబుతున్నారు. ఇందుకు కక్ష కట్టిన సదరు నేత పాఠశాలను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ హత్యాచారం వదంతిని సృష్టించాడని చెబుతున్నారు. అధికార పక్షానికి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యం చెప్పేందుకు సైతం ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. పోలీస్ విచారణలో వాస్తవాలు వెలుగు చూసినా అందుకు తగిన ఆధారాలు చూపలేక పోతున్నారు. ఒక వైపు పోలీస్, మరోవైపు విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగుతుండగా పరిస్థితి సద్దుమణిగే వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఆగ్రహం: ఒక పాఠశాలలో రేగిన వివాదాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందూమున్ననిలకు ముడిపెట్టడం సరికాదని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సెంబాకం వేద సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు రాజకీయ నాయకులు తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తుండగా ఏమీ లేదని పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటని ఆయన మండిపడ్డారు. పాఠశాల నిర్వహణపై వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాన్ని పారదోలాలని ఆయన డిమాండ్ చేశారు.
హైకోర్టులో పిటిషన్
పల్లవరంలో కంటోన్మెంటు భూములను కొందరు అక్రమించి అనుమతుల్లేకుండా విద్యాసంస్థలను నెలకొల్పారంటూ అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ రాణా సయ్యద్ యూసుఫ్ మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంట్‌థామస్ మౌంట్, పల్లవరం కంటోన్మెంటు పోర్టు 1774 ఏర్పాటు కాగా, ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికశాతం ఆక్రమణలకు లోనైందన్నారు. ఇటీవల మరో 20 ఎకరాలు అన్యాక్రాంతం కాగా అక్కడి సైనికాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించుకున్నారు.
ఆక్రమణ ప్రదేశాల్లో అక్రమంగా అనేక ప్రైవేటు పాఠశాలలు వెలిసి శాంతి, భద్రతల సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ ఈ పిటిషన్‌లోని అంశాలను విన్నారు. రెండు వారాల్లోగా పిటిషన్‌దారుని ఆరోపణలపై బదులివ్వాలని 11 మంది అధికారులను ఆదేశించారు.