పనిచేయకుంటే ఇంటికే!
• ఆరుగురిపై సస్పెన్షన్ వేటు
• పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన
• ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్
మిడ్జిల్ : ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయకుంటే ఇంటికి పంపిస్తానని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని వల్లబ్‌రావుపల్లిలో పర్యటించారు. ముందుగా ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులు కనీసం వారి తల్లిదండ్రుల పేర్లు కూడా రాయలేకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏడు మంది ఉపాధ్యాయులుండగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న రాజలక్ష్మి, సతీష్‌కుమార్, శ్వేత, భానుప్రకాశ్, విదాతుల్లాఖాన్‌లను సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ సమయంలో కార్యకర్త అందుబాటులో లేక పోగా సక్రమంగా పౌష్టికాహారం సరఫరా చేయడంలేదని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తరచూ కేంద్రాలను సందర్శించాలని సూపర్‌వైజర్‌కు ఆదేశించారు. గ్రామంలో చిన్నారులు లేకపోతే రెండు సెంటర్లు ఎందుకని ప్రశ్నించారు.
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో పాల్గొన్నారు. రాచాలపల్లికి చెందిన దాదాపు 20 మంది వృద్ధులు రెండు సంవత్సరాల నుంచి కార్యాలయాల చూట్టు తిరిగినా పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా వెంటనే పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ నాయక్‌ను పిలిచి ఇదేంటని ప్రశ్నించారు. మీ వల్ల నిరుపేదలు ఒక్కొక్కరు రూ.24 వేలు నష్టపోయారని, దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
సరైన సమాధానం చెప్పని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అనంతరం రేవల్లి కార్యదర్శి పరుశరాములుకు బాధ్యలు అప్పగించి విచారణ చేయాలని గ్రామ వీఆర్‌ఓకు ఆదేశించారు. ఈ సందర్భంగానే కస్తూర్బా విద్యాలయ సిబ్బంది పనితీరుపై అదే గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా విచారణ చేయిస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ పాండునాయక్, తదితరులు ఉన్నారు.