సాక్షి, అమరావతి : ఎగువ నుంచి కృష్ణా నదికి వస్తున్న వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ముప్పు నివారణ కోసం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రెండు జిల్లాల్లో విధులు నిర్వహించడానికి 140 మంది పైర్ సిబ్బంది, 180 మంది ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను నియమించినట్లు స్పష్టం చేశారు. నీట మునిగిన 10 మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యులు 10 మంది చొప్పున విడిపోయి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికర్ల, కొల్లిపర, కొల్లూరు, గుంటూరు జిల్లా తుల్లూరు, సీతానగరం మండలాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రెండు జిల్లాలు కలిపి మొత్తం 56 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 14,413 ఆహార పొట్లాలు, 42వేల మంచినీటి ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే రోగాల బారిన పడకుండా తగిన వైద్యం అందించడానికి రెండు జిల్లాల్లో 54 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు జిల్లాలు కలిపి 32 మండలాలకుగాను 87 గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఉదయం 9గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.21 లక్షల క్యూసెక్కుల అవుట్‌ప్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment