సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలవల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస, మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలవల్ల తలెత్తిన విపత్కర పరిస్థితులపై శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల వారికి ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా చిన్ననీటి వనరుల మరమ్మతులు, చెరువు గట్లను పటిష్టం చేయడం ద్వారా నీరు వృథాకాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని మంత్రుల ద్వారా ఇప్పించాలని కలెక్టర్లను కోరారు. అధికార యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నందున తాను వరద ప్రాంతాల్లో ఎప్పుడు పర్యటించేది ఆదివారం నిర్ణయిస్తామన్నారు.
కచ్చితంగా అంచనాలు రూపొందించండి
వర్షాలు, వరదలవల్ల కలిగిన నష్టాల అంచనాలను కచ్చితంగా రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టంతోపాటు రహదారులు, చెరువులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాల నివేదికలు రూపొందించాలని సూచించారు. బాధితులందరికీ పరిహారం అందేలా చూడాలన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మహీధర్‌రెడ్డి, పార్థసారథి, కొండ్రు మురళి, విపత్తు నిర్వహణ కమిషనర్ టి.రాధ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం సంచాలకుడు సుధాకర్‌రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
పకడ్బందీగా సహాయక కార్యక్రమాలు: సీఎస్
వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల వారిని అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, బాధితులకు ఆహారం, నీటి ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
Published Sun, Oct 27 2013 1:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement