‘నీలం’ పరిహారం ఇచ్చేశారట!
సాక్షి నెట్‌వర్క్ : భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు గురువారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల నుంచి అనుకోని రీతిలో ప్రతిఘటన ఎదురైంది. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం గొల్లప్రోలు, కాకినాడ రూరల్, రాజోలు ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. తొలుత ఆయన గొల్లప్రోలులో మాట్లాడుతూ జిల్లాలో ‘నీలం తుపానుతో నష్టపోయిన మీకు రూ.143 కోట్లలో ఇప్పటికే 93 కోట్లు ఇచ్చేశాం. మరో 50 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
వారం, పది రోజుల్లో ఇచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తాం’ అని తనదైన శైలిలో చెప్పుకుంటూపోతున్నారు. ఇంతలో పలువురు రైతులు ఒక్కసారిగా చేతులు పెకైత్తి తమలో ఏ ఒక్కరికీ ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదని బిగ్గరగా చెప్పారు. నీలం తుపాను వచ్చి ఏడాది గడచిపోయినా పరిహారం ఇవ్వకపోగా ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని, మీరేమో పరిహారం ఇచ్చేశామంటున్నారు, ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల ఆక్రోశంతో అవాక్కయిన సీఎం కొద్దిసేపటికి తేరుకుని సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో జాప్యం జరిగిందని, వారం పది రోజుల్లో ఆ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మీరంతా వస్తున్నారు. పోతున్నారే కాని, ఇంతవరకు బియ్యం కూడా ఇవ్వలే’దని పలువురు మహిళలు సీఎంను నిలదీశారు. ‘ఆదేశాలు ఇచ్చాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ అందుతుం’దని ఆయన వారికి నచ్చజెప్పారు.
ఇందిరమ్మది సమైక్య గళం: సీఎం
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం పాత జైల్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో స్వర్గీయ ఇందిరాగాంధీ చెప్పిన మాటలనే తాను గత 90 రోజులుగా మాట్లాడుతున్నానని సీఎం చెప్పారు. ఇందిరాగాంధీ అసలు సిసలైన సమైక్యవాదన్నారు.
సీఎం ‘పశ్చిమ’ పర్యటన రద్దు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో గురువారం పర్యటించాల్సిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. జిల్లాలోని నరసాపురం, తాడేపల్లిగూడెంలో సీఎం పర్యటించాల్సి ఉంది. సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్‌లో నర్సాపురంలోని పెదమైనవానిలంకకు చేరుకున్నారు. వాతావరణం సరిగా లేదని, వెళ్లిపోతే మంచిదని పైలట్ చెప్పడంతో వెంటనే హెలికాప్టర్ ఎక్కి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. దీంతో సీఎం పర్యటన కోసం చేసిన ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. ఉదయం నుంచి సీఎం కోసం పడిగాపులు పడిన జిల్లా అధికారులు, సిబ్బంది సాయంత్రం ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు.
ఫొటో ఎగ్జిబిషన్‌కే సీఎం పరిమితం
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయ లాంజ్‌లో వరద నష్టాలపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. పంట నష్టంపై అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష కూడా నిర్వహించలేదు. నష్టాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పూర్తిస్థాయిలో నివేదికలు పంపండి, చూద్దాం అంటూ ముఖ్యమంత్రి కృష్ణా వరద సాయంపై స్పందించారు. సీఎం విమానాశ్రయంలో ఉన్న సమయంలో బెంగళూరు నుంచి విమానంలో వచ్చిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రితో కొద్దిసేపు చర్చలు జరిపారు.