భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం
సోమవారం వాన కాస్త తెరిపినిచ్చినా తగ్గని ముంపు ప్రభావం
ఖమ్మంలో సర్వం మున్నేరార్పణం.. కట్టుబట్టలతో మిగిలిన జనం
వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ చాలా చోట్ల వరద విధ్వంసం
వరద తాకిడికి కూలిపోయిన ఇళ్లు.. తడిసిపోయిన సామగ్రి, నిత్యావసరాలు
వందల గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు.. నీట మునిగిన పంటలు
జనావాసాల్లో నిలిచిన నీటిని తొలగిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
ఖమ్మం జిల్లాలో బాధితులకు డ్రోన్లతో ఆహార పొట్లాల పంపిణీ
క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రులు
వర్షాలతో దెబ్బతిన్న జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం
ముందస్తు సమాచారం లేకనే వరదల్లో చిక్కుకున్నామంటున్న బాధితులు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వానలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. వందల గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏకబిగిన కురిసిన వానలతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, నిత్యావసరాలు పాడైపోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరదలు ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఖమ్మం జిల్లాలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4వేల మందిని వాటిలోకి తరలించారు.
ఖమ్మం సర్వం మున్నేరార్పణం
భారీ వరదలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. వరద తాకిడితో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఖమ్మం నగరంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండల పరిధిలో ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఇతర ఎల్రక్టానిక్ సామాగ్రి తడిసి దెబ్బతిన్నాయి. ఖమ్మంలోని మోతీనగర్‌లో ఓ కుటుంబం దాచుకున్న బంగారం, డబ్బులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద 250కిపైగా లారీలు నీట మునిగిపోయాయి. ఒక్కో లారీ మరమ్మతుకు రూ.లక్షకుపైగా ఖర్చవుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని ఆకేరు వాగు పొంగి తిరుమలాయపాలెం మండలాన్ని ముంచెత్తింది. పాలేరు వరదతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, దంసలాపురం కాలనీ.. ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. మున్నేరు వరద తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకొని అన్నీ శుభ్రం చేసుకుంటున్నారు.
యంత్రాంగం విఫలమవడంతోనే..
మున్నేరు వరద విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా జూలై 26 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచింది. ఆ సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఈసారి అదే తరహాలో మున్నేరుకు భారీ వరద వస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.
జల విలయంలోనే మహబూబాబాద్!
భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అందులోనూ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విధ్వంసం జరిగింది. నెల్లికుదురు మండలం రావిరాల మొదలుకొని వందలాది గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాల చుట్టూ ఇంకా వరద కొనసాగుతుండటంతో జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ప్రజలు ఇళ్లలో తడిసిపోయిన సామగ్రిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేరుకొని తొగరాయ్రి, కూచిపూడి గ్రామాలు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అంతర గంగ వరదతో కకావికలమైన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు సోమవారం కూడా తేరుకోలేదు. ఆ రెండు గ్రామాలు 70శాతానికిపైగా మునగడంతో.. ప్రజలు నిత్యవసర వస్తువులతోపాటు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. తొగýర్రాయి, కూచిపూడి, గణపవరంలలో వెయ్యికి పైగా వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయినట్టు రైతులు వాపోతున్నారు. కోదాడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మిగిలింది కట్టుబట్టలే!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు పక్కన ఉన్న మోహనరావు ఇల్లు. ఇంటి ముందు ఎయిర్ కంప్రెషర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షాలతో చెరువు కట్ట తెగడంతో నీరంతా ఒక్కసారిగా ముంచెత్తింది. మోహన్‌రావు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇల్లు దెబ్బతిన్నది, సామగ్రి అంతా కొట్టుకుపోయింది. తమకు కట్టుబట్టలే మిగిలాయని మోహనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఇల్లు చూసినా ఇదే దుస్థితి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బీభత్సానికి అన్ని ఇళ్లలో బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రి అంతా తడిసి పాడైపోయాయి. ‘‘తినడానికి తిండి గింజలు లేకుండా పోయి బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని నిరుపేద కుటుంబాలను చేరదీయాలి’’ అని గ్రామానికి చెందిన రాస యాకన్న ఆవేదన కోరుతున్నాడు. తడిసిపోయిన బియ్యాన్ని బయటపడేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫారంలో ఒక్క కోడీ మిగల్లేదు..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బెజ్జం సమ్మయ్య, ఎస్కే అమీర్ కలిసి కోళ్లఫారం నడుపుతున్నారు. ఆదివారం భారీ వర్షంతో ఫారంలోకి వరద ముంచెత్తింది. ఒక్కటీ మిగలకుండా రెండున్నర వేల కోళ్లు మృతి చెందాయి. ‘‘ఒక్కో కోడి కేజీన్నర బరువుదాకా పెరిగింది. నాలుగైదు రోజుల్లో కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. అలాంటిది నోటిదాకా వచ్చిన కూడును వరద లాగేసింది..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పొలాల నిండా.. కంకర, ఇసుక
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి రోడ్డుకు సమీపంలోని వరిచేన్లలో వేసిన కంకర, ఇసుక మేటలివి. ఇటీవల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభించారు. దానికోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా వరదకు కొట్టుకొచ్చి పొలాల్లో చేరింది. తిరిగి పొలాన్ని బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment