పది జిల్లాలను ముంచేసిన అకాల వర్షాలు
అకాల వర్షాలు పది జిల్లాలను అతలాకుతలం చేశాయి. హైదరాబాద్, రంగారెడ్డి సహా తెలంగాణ, రాయలసీమ జిల్లాలలపై ఎక్కువ ప్రభావం కనపడుతోంది. మరో రెండు రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపరితల ద్రోణి, అల్పపీడన ద్రోణి రెండూ ఉండటంతో దీని ప్రభావం వల్లే వర్షాలు ఇంత తీవ్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే వడగళ్ల వాన కొన్నిచోట్ల పడుతుండగా, మరికొన్ని చోట్ల మంగళ, బుధ వారాల్లోనూ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఈ అకాల వర్షాలతో రైతన్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఎంతో కొంత చేతికందకపోతుందానన్న గంపెడాశలూ గంగ పాలయ్యాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన అపార నష్టాన్ని మిగిల్చింది. వరుణుడి ప్రకోపానికి పంటలన్నీ సర్వం నాశనమయ్యాయి. చేతికొచ్చిన వరి నీటమునిగింది. కల్లాల్లో ఆర బోసిన ధాన్యం తడిసిముద్దైంది. కోతదశలో ఉన్న మామిడి నేల రాలిపోయింది. మిరప, పత్తి, మొక్కజొన్న సహా అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అకాల కష్టంతో అన్నదాత ముఖాల్లో నిర్వేదం కనిపిస్తోంది.
- మెదక్: 36 మిల్లీ మీటర్ల వర్షపాతం 5,246 హెక్టార్లలో వరి, 6,414, హెక్టార్లలో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం.
- నష్టం విలువ రూ. కోటి 40 లక్షలగా అంచనా
- నల్లగొండ: 18 మిల్లీ మీటర్ల వర్షపాతం
10 వేల ఎకరాల్లో వరిపంట నష్టం.
ఐకేపీ, మార్కెట్ యార్డ్లో6 వేల క్వింటాళ్ల ధాన్యం తడిచినట్టు ప్రాథమిక అంచనా..
- నిజామాబాద్: అకాల వర్షాలతో భారీ నష్టం, నేలకొరిగిన వరి. ఆర్మూరులో తడిసిన పసుపు, మిగతా ప్రాంతాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం, ఆందోళనలో రైతులు
- కరీంనగర్: 22 వేల986 హెక్టార్ల పంటలకు నష్టం.
రూ. 40 కోట్ల ఆస్తి నష్టం.
- ఆదిలాబాద్: మొక్కజొన్న, నువ్వులు, పసుపు పంటలకు నష్టం ఆందోళనలో రైతులు
- రంగారెడ్డి: అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు అపార నష్టం
- అనంతపురం: రూ. 12 కోట్లు నష్టంగా ప్రాథమిక అంచనా 18 మండలాల్లో 35 గ్రామాల్లో అకాల వర్షాల ప్రభావం,నలుగురు మృతి.
ఉరవకొండలో జలమయమైన పలు కాలనీలు. చేనేత మగ్గాల్లోకి ప్రవేశించిన నీరు, ఆందోళనలో చేనేత కార్మికులు.
- నెల్లూరు: జిల్లాలో అకాల వర్షాలకు కలువాయి, చేజెర్ల, ఆత్మకూరు మండలాల్లో వరికి తీవ్ర నష్టం.
- కర్నూలు: అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం. 1350 హెక్టార్ల మేర నష్టపోయిన పంటలు, 16.5 మిల్లీ మీటర్ల వర్షపాతం. నంద్యాల నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వానతో 1200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి పంట వడగళ్ల వానతో నేలకొరిగింది. నియోజకవర్గంలోని పాణ్యం, బండి ఆత్మకూరు, నంద్యాల మండలాల పరిధిలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఏడీఏ అధికారి సుధాకర్ నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
- ఖమ్మం: మూడు సెంటీమీటర్ల వర్షపాతం. భారీగా దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న, పత్తి, మామిడి పంటలు. భద్రాచలం డివిజన్ లో నాలుగు మండలాల్లో కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం
- గుంటూరు: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సత్తెనపల్లి మండలంలో 200 ఎకరాల అరటిపంటకు పూర్తిగా నష్టం వాటిల్లింద. అంతే కాకుండా మంగళవారం కురిసిన వర్షానికి పాకాలపాడు వద్ద వాగుకు గండిపడి రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో అకాల వర్షలతో ఐదుగురు మరణించినట్టు సమాచారం. మృతులకు రూ.5 లక్షల పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.