ఖమ్మం రూరల్ మండలంలో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలోని ఇంట్లో దుర్వాసనతో ముక్కు మూసుకుని సామాన్లు సర్దుకుంటున్న భూక్యా మంగమ్మ, ఆమె కూతురు శిల్ప
సర్వం కోల్పోయాం.. రూ.10 వేల సాయంతో ఉపశమనం ఎంత?
సహాయక శిబిరాల్లోని వరద బాధితుల ఆవేదన
పొద్దున్నే పనులకు వెళ్లిపోవడం, సాయంత్రానికి ఇల్లు చేరి కుటుంబమంతా సంతోషంగా గడపడం.. నిత్యం జరిగేది ఇదే. కానీ ఒక్క రాత్రితో అంతా కకావికలమైపోయింది. మున్నేరు వర దతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, అన్నీ వదిలేసి పరుగులు పెట్టాల్సి వచ్చింది.. వరద తగ్గాక వచ్చి చూస్తే.. బియ్యం, ఉప్పు, పప్పు ఏదీ లేదు.. టీవీ, ఫ్రిడ్జ్, బైక్, ఇతర సామగ్రి ఏదీ మిగల్లేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంట్లో ఏమీ మిగల్లేదు.. పునరావాస కేంద్రాల్లో పెట్టింది తినడం, కన్నీటితో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటమే మిగిలింది. ప్రభుత్వమేమో ‘లెక్క’ తేల్చి సాయం చేస్తామంటూ సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే వరద ముంచి మూడు రోజులైంది. సర్వే తేలేసరికి మరో 2,3 రోజులూ అవుతుంది. పైగా ప్రభుత్వం ఇస్తామంటున్నది రూ.10 వేలు. నిండా మునిగిపోయిన తమకు ఈ సాయంతో ఏమాత్రం ఉపశమనం ఉంటుందని బాధితులు నిలదీస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో సర్వం కోల్పోయిన మున్నేటి ముంపు బాధితులు తీవ్ర ఆందోళనలో పడిపోతున్నారు. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. వరదల్లో మునిగిన ఇళ్లలో ఏమీ మిగల్లేదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముంపు వివరాల లెక్క తేల్చేందుకు సర్వే చేపటింది. అది ముగిశాక బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరదలతో ఇప్పటికే మూడు రోజులు గడిచిందని, సర్వే పూర్తయి, డబ్బులు వచ్చేవరకు మరికొన్ని రోజులు పడుతుందని.. అప్పటివరకు ఎలా బతకాలని వాపోతున్నారు. వినాయక చవితి పండుగకు పస్తులు ఉండేల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేతో నిమిత్తం లేకుండా ఇంటింటికి తక్షణ ఆర్థిక సాయం చేస్తే కొంతైనా ఉపశమనం ఉంటుందని అంటున్నారు. సర్వే చేసి ఇస్తామన్న రూ.10 వేలు ఏమాత్రం సరిపోవని.. కనీసం రూ.50 వేలు అందించాలని కోరుతున్నారు.
ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులు
సర్వేతో సాయం జాప్యం..
వరదలతో మున్నేటి పరీవాహకంలో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలో సామగ్రి మొత్తం కొట్టుకుపోయింది. తడిసి పాడైపోయింది. ఈ క్రమంలో ముంపు వివరాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 14 డివిజన్లతోపాటు ఖమ్మం రూరల్ మండలంలో 250 మంది సిబ్బంది నియమించి.. ఒక్కొక్కరికి 60 నుంచి 70 ఇళ్ల వివరాలు సేకరించే బాధ్యతను అప్పగించింది. వారు ఇంటి యజమాని పేరు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. అయితే సిబ్బంది తక్కువగా ఉండటంతో సర్వే ఆలస్యం అవుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఎటు చూసినా చెత్తాచెదారం.. దుర్గంధం
మున్నేటికి రెండువైపులా 9 కిలోమీటర్ల మేర ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో మున్నేరు ముంపు దుర్గంధమయం చేసింది. ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో.. బురద, చెత్తాచెదారం, కట్టెలు, వ్యర్థాలు కొట్టుకువచ్చి కాలనీలు, ఇళ్లలో చేరాయి. 8 వేలకుపైగా ఇళ్లలో బురద చేరింది. వరద కాస్త తగ్గుముఖం పట్టాక ముంపు ప్రాంతంలోని ఏ కాలనీలో, ఏ ఇంట్లో చూసినా.. బురద, చెత్తాచెదారంతో దుర్వాసన వస్తోంది.
వరదలో కొట్టుకొచ్చిన పాములు, తేళ్లు, కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు కుళ్లిపోయి మరింత దుర్గంధం వస్తోంది. వరదకు కొట్టుకొచ్చిన పెద్ద దుంగలు, విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు, రేకులు వంటివాటితో రోడ్లు, వీధులన్నీ నిండిపోయి.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది.
నెమ్మదిగా పనులు.. నీళ్లు సరిపోక అవస్థలు
మున్నేరు ముంపు ప్రాంతాల్లో బురద, చెత్తను జేసీబీలు, ట్రాక్టర్లతో తొలగిస్తూ.. కాలనీల్లో రోడ్లను శుభ్రం చేసేందుకు ట్యాంకర్లు, ఫైరింజన్లను వినియోగిస్తున్నారు. బాధితులకు నీళ్లు అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి 980 మంది పారిశుధ్య కార్మీకులను కూడా రంగంలోకి దింపారు. కానీ పారిశుధ్య పనుల వేగం సరిపోవడం లేదు. ఇళ్లు, సామగ్రిని శుభ్రం చేసుకోవాలనుకున్నా.. ట్యాంకర్ల నీళ్లు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే ట్యాంకర్లు తిరుగుతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే ఆరోగ్య సమస్యలు మొదలు!
మున్నేరు లోతట్టు ప్రాంతాలైన.. ఖమ్మం నగరంలోని 14 డివిజన్లలో ఉన్న 40 కాలనీలు, ఖమ్మంరూరల్ మండలంలోని 20 కాలనీల్లో చెత్తాచెదారం మరింత ఎక్కువగా నిండిపోయింది. మురుగు ప్రవహిస్తుండటం, ఇళ్లలో బురద, తడి ఆరకపోవడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముంపు ప్రాంతాల్లో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. చాలా మంది బాధితులు ఎలర్జీ, చర్మ సంబంధిత ఇబ్బందులు, జ్వరాలతో వస్తున్నార ని వైద్య సిబ్బంది చెప్తున్నారు. సీజనల్ జ్వరాలు, జలుబుకు తోడు ఎక్కువ సమయం కలుషిత నీటిలో గడపడం వల్ల ఎలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఆస్పత్రికి వస్తున్నారని ఇక్కడి ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ నర్సు మలిదు కృష్ణవేణి వెల్లడించారు.
ప్రాణాలు తప్ప ఏమీ మిగల్లేదు
ఖమ్మం రూరల్ మండలంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కాలనీలోని ఓ ఇంట్లో భూక్యా హుస్సేన్ ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. హమాలీ పనిచేస్తూ జీవిస్తున్నారు. గత ఏడాది మున్నేరు వరదల సమయంలో కూతురి పెళ్లి కోసం దాచిపెట్టిన రూ.2లక్షల నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈసారి వరదల్లో పూర్తిగా నష్టపోయారు. ప్రాణాలు తప్ప ఏమీ మిగలలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాయం పెంచితేనే ఆదుకున్నట్టు..
ఇంట్లో సమస్తం మున్నేటి పాలయ్యాయి. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులకు వెళ్లి జీవించేవాళ్లం. ఇప్పుడు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వచ్చాం. ఇంటికి వెళ్లి చూస్తే సామాగ్రి ఏదీ కూడా పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం తక్షణ సాయం రూ.10 వేలు ఇస్తా మని చెప్పింది. ఆ డబ్బు తిండికి అవసరమైన సరుకులు, పాత్రలు కొనేందుకు కూడా సరిపోవు. రూ.10 వేలు ఇచ్చినా మా కుటుంబం పునరావాస కేంద్రంలోనే ఉండి పొట్ట నింపుకోవాల్సిందే. సాయం పెంచి అందిస్తేనే ఆదుకున్నట్టు అవుతుంది.
– బానోతుక్షి్మ, లాల్‌సింగ్ వెంకటేశ్వరనగర్, ఖమ్మం
ఆర్థిక సాయం త్వరగా ఇవ్వాలి
వరదతో ఇంట్లో ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల సాయం దేనికి సరిపోదు. వరదతో బెడ్లు, బట్టలు, బియ్యం, సరుకులు అన్నీ కొట్టుకుపోయాయి. ఇంటికి వెళ్లిన తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వం ఆర్థిక సాయం త్వరగా అందజేయాలి. బురదతో నిండిపోయిన ఇళ్లను శుభ్రం చేయించాలి.
– మిడిగొడ్డి రాజయ్య, ఆండాళ్లు గోళ్లబజార్, ఖమ్మం
ఇంత విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు: సర్వే సిబ్బంది
మున్నేటి ముంపులో సర్వం కోల్పోయిన వారి వివరాలను సేకరించేందుకు వచ్చిన సిబ్బంది కూడా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. ఖమ్మంరూరల్, వేంసూరు మండలాల్లో ఏఎస్‌ఓలుగా పనిచేస్తున్న వసంత, మరో ఉద్యోగికి సర్వే డ్యూటీ వేశారు. ముంపు ప్రాంతానికి వచ్చినవారు.. తాము 13 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
వరద తగ్గినా.. బాధలు తగ్గలేదు
సూర్యాపేట జిల్లాలో ఇంకా కోలుకోని నాలుగు గ్రామాలు
కోదాడ రూరల్/అనంతగిరి (కోదాడ): భారీ వర్షాలతో నీట మునిగిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడి, అనంతగిరి మండలంలోని కిష్టాపురం, గోండ్రియా గ్రామాలు ఇంకా కోలుకోలేదు. నాలుగు గ్రామాల్లోనూ ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు అన్నీ తడిసి పాడైపోయాయి. వరదల కారణంగా ఇళ్లలో బురద చేరింది. తినడానికి సరైన తిండి లేదని, దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
మరోవైపు గడ్డివాములు కొట్టుకుపోవడం, బురద నీటిలో తడిసి పాడైపోవడంతో.. పశువులకు మేత లేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. తొగర్రాయిలో శివాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలు ఇంకా బురదలోనే ఉన్నాయి. గోండ్రియాల గ్రామంలోని తిరపతమ్మతల్లి, గంగమ్మతల్లి ఆలయం, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, పునాదుల్లోని పిల్లర్లు తేలిపోయేలా కోతకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment