వర్షాలు, వరదలకు.. అన్నదాతలకు అపారనష్టం
రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలకు అన్నదాతలకు అపారనష్టం వాటిల్లుతోంది. వేలాది రూపాయిలు అప్పుచేసి సాగుచేసిన రైతులు పంట చేతికి వచ్చే సమయంలో సర్వం కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. వరి, మొక్కజొన్న, చెరకు, అనప, బెండ పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ, రామచంద్రాపురం ప్రాంతాల్లో 35 వేల హెక్టార్ల వరిపంట పూర్తిగా నీటమునిగింది. రంగంపేట, పిఠాపురం ప్రాంతాల్లో వేలాది ఎకరాల పత్తి, కూరగాయలు, ఉల్లి పంటలు నాశనమయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యలు, చేపల సాగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో వరి, కూరగాయల పంటలు నీటమునిగాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 30వేల హెక్టార్లలో పత్తికి అపారనష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలోనూ లక్షఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. మిర్చి, వరి, మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరుచేరడంతో చేనేత మగ్గాలు దెబ్బతిన్నాయి.
రాయలసీమలోనూ వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్యార్డులో 60 వేల క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. నందికొట్కూరు ప్రాంతంలో పంటలు నీటమునిగాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. తెలంగాణలో వరంగల్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. వరి, పత్తి, జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.