సెంటు భూమీ వదిలేది లేదు..
టీఆర్‌ఎస్ నాయకులకు రాష్ట్ర హోంమంత్రి నాయిని హామీ
భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన జిల్లాలోని ముంపు మండలాల్లో సెంటు భూమి కూడా వదులుకునేది లేదని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భద్రాచలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. నాయకులు రాజేంద్రవర్దన్, కొండముక్కల సాయిబాబా, జిల్లా మహిళా నాయకురాలు చల్లపూడి సంధ్యాలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు హైదరాబాద్ వెళ్లి హోంమంత్రిని బుధవారం కలిశారు. ముంపు మండలాల పరిస్థితిని వివరించారు. ఏడు మండలాలు సీమాంధ్రకు బదలాయించటం వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై తమ ప్రాంతంలో ఆందోళన నెలకొందని వివరించారు.
స్పందించిన నాయిని ముంపు మండలాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిమంత్రి మోడీని కలుస్తామని చెప్పారని.. హైదరాబాద్ వెళ్లిన నాయకులు తెలిపారు. గోదావరి జలాలు వినియోగానికి తెలంగాణ రాష్ట్రం తరఫున తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో పర్యటించాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు త్వరలోనే వస్తానని హామీ ఇచ్చారన్నారు. హోంమంత్రిని ఘనంగా సన్మానించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ప్రసాదాలను అందజేశామన్నారు.