‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ ! | Bus pass give only for Telangana state students | Sakshi
Sakshi News home page

‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ !

Published Fri, Jun 20 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ !

‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ !

భద్రాచలం : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ పాలన పరంగా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా మండలాలను జిల్లా నుంచే పర్యవేక్షిస్తున్నారు. అయితే భద్రాచలం ఆర్టీసీ అధికారులు మాత్రం అప్పుడే ఆ మండలాలతో తెలంగాణకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే బస్‌పాసులు ఇస్తామని ప్రకటించారు. బస్‌పాస్ తీసుకునేందుకు డిపోకు వచ్చిన ముంపు మండలాల విద్యార్థులు ఈ ప్రకటన చూసి ఆందోళన చెందుతున్నారు.
 
ముంపు మండలాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే కలిసిపోయినట్లు స్థానిక ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీని రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేయకపోయినప్పటకీ సదరు అధికారులు అత్యుత్సాహం చూపించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు వివిధ సాంకేతిక విద్య, నర్సింగ్ కళాశాలలు భద్రాచలంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్ పరిధిలో గల ఏడు మండలాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వస్తున్నారు.   వీరంతా ఆర్టీసీ రాయితీ ద్వారా కల్పించే బస్‌పాసులు తీసుకొని కళాశాలలకు వచ్చిపోతుంటారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వీరి చదువులకు ఆటంకంగా మారనుంది.
 
ఇతర రాయితీ కార్డులకూ నో చాన్స్..
విద్యార్థుల బస్‌పాస్‌లతో పాటు ఆర్టీసీ ద్వారా వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీ కార్డుల ద్వారా ఆంధ్రరాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా ఇకపై ఉండకపోవచ్చు. వీటిని కూడా అనుమతించ వద్దని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ, ఈ ప్రాంత ప్రజానీకం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి వీటిని అనుమతిస్తున్నారు.
 
ఆందోళన  బాటలో విద్యార్థులు..
ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వకపోవటం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ అధికారుల వ్యవహారంపై శుక్రవారం నుంచి ఆందోళన బాట పట్టేందుకు ఆయా సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ముంపు మండలాలను వేరు చేయటం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
 
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : డీఎం
ఉన్నతాధికారుల ఆదేశం మేరకే ముంపు మండలాల విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వటం లేదని భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వర బాబు తెలిపారు. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. అయితే వివిధ రకాల రాయితీ కార్డులను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.
 
 ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్‌లో  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షులు కారం నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వతీరు వల్లే ముంపు మండలాల్లోని ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే చుట్టుపక్కల మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరు కళాశాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు.
 
ప్రస్తుతం ముంపు మండలాల విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్సు పాసులు ఇవ్వకపోతే వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు చర్యల వల్ల సుమారు 1800 మంది విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే నిలిపివేసి ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో చరణ్,సతీష్, రమేష్, అనీల్, చలపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement