Telangana state students
-
‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ !
భద్రాచలం : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ పాలన పరంగా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా మండలాలను జిల్లా నుంచే పర్యవేక్షిస్తున్నారు. అయితే భద్రాచలం ఆర్టీసీ అధికారులు మాత్రం అప్పుడే ఆ మండలాలతో తెలంగాణకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే బస్‌పాసులు ఇస్తామని ప్రకటించారు. బస్‌పాస్ తీసుకునేందుకు డిపోకు వచ్చిన ముంపు మండలాల విద్యార్థులు ఈ ప్రకటన చూసి ఆందోళన చెందుతున్నారు. ముంపు మండలాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే కలిసిపోయినట్లు స్థానిక ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీని రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేయకపోయినప్పటకీ సదరు అధికారులు అత్యుత్సాహం చూపించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు వివిధ సాంకేతిక విద్య, నర్సింగ్ కళాశాలలు భద్రాచలంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్ పరిధిలో గల ఏడు మండలాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వస్తున్నారు. వీరంతా ఆర్టీసీ రాయితీ ద్వారా కల్పించే బస్‌పాసులు తీసుకొని కళాశాలలకు వచ్చిపోతుంటారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వీరి చదువులకు ఆటంకంగా మారనుంది. ఇతర రాయితీ కార్డులకూ నో చాన్స్.. విద్యార్థుల బస్‌పాస్‌లతో పాటు ఆర్టీసీ ద్వారా వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీ కార్డుల ద్వారా ఆంధ్రరాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా ఇకపై ఉండకపోవచ్చు. వీటిని కూడా అనుమతించ వద్దని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ, ఈ ప్రాంత ప్రజానీకం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి వీటిని అనుమతిస్తున్నారు. ఆందోళన బాటలో విద్యార్థులు.. ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వకపోవటం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ అధికారుల వ్యవహారంపై శుక్రవారం నుంచి ఆందోళన బాట పట్టేందుకు ఆయా సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ముంపు మండలాలను వేరు చేయటం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : డీఎం ఉన్నతాధికారుల ఆదేశం మేరకే ముంపు మండలాల విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వటం లేదని భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వర బాబు తెలిపారు. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. అయితే వివిధ రకాల రాయితీ కార్డులను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు కారం నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వతీరు వల్లే ముంపు మండలాల్లోని ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే చుట్టుపక్కల మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరు కళాశాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ముంపు మండలాల విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్సు పాసులు ఇవ్వకపోతే వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు చర్యల వల్ల సుమారు 1800 మంది విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే నిలిపివేసి ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్,సతీష్, రమేష్, అనీల్, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్ర విద్యార్థులకు మిగులు సీట్లు!
* ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలపై అధికారులకు సీఎం ఆదేశం * సీట్ల భర్తీపై నివేదిక సమర్పించండి * ఫీజు భారం వివరాలివ్వండి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయగా మిగిలే సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మిగులు సీట్ల భర్తీ విషయంలో సాధ్యాసాధ్యాలతో సత్వరమే ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విభజన నేపథ్యంలో ప్రస్తుత ప్రవేశాల విధానం ఎలా ఉందని, దానివల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటుందా? అనే అంశాలపై ఆరా తీశారు. ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులతో ముందుగా కన్వీన ర్ కోటా భర్తీ చేయండి. తరువాత మేనేజ్మెంట్ కోటా భర్తీ చేయండి. ఆ తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం ఉందా? ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇస్తున్న నేపథ్యంలో... కన్వీనర్ కోటాలో మిగిలే సీట్లు వారికి ఇస్తే ఎలా ఉంటుంది? అది సాధ్యం అవుతుందా? అని సీఎం ప్రశ్నించారు. ఇందులో తొందరపాటు నిర్ణయాలు వద్దని, మేనేజ్‌మెంట్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు రాకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాత ప్రవేశాల విధానమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశంపై చ ర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ప్రస్తుత ప్రవేశాలు పూర్తయ్యాక ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే విభజించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ భారం తెలంగాణపై ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు కావాలని ఆదేశించారు. ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పదేళ్లపాటు పాత ప్రవేశాల విధానమేనని చట్టంలో ఉన్నందున రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎంసెట్ పరిస్థితి ఏంటి? నిర్వహణ విధానం ఎలా ఉండాలి? పాత విధానంలో ప్రవేశాలు చేపట్టడం సాధ్యమేనా? ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? రాష్ట్రస్థాయి వర్సిటీల పరిస్థితి ఏంటి? ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందించడం కుదురుతుందా? తెలంగాణ విద్యార్థుల కోసం ఏం చేయవచ్చనే వివరాలను మంత్రి అడిగినట్లు తెలిసింది.