* ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలపై అధికారులకు సీఎం ఆదేశం
* సీట్ల భర్తీపై నివేదిక సమర్పించండి
* ఫీజు భారం వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయగా మిగిలే సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మిగులు సీట్ల భర్తీ విషయంలో సాధ్యాసాధ్యాలతో సత్వరమే ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విభజన నేపథ్యంలో ప్రస్తుత ప్రవేశాల విధానం ఎలా ఉందని, దానివల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటుందా? అనే అంశాలపై ఆరా తీశారు.
ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులతో ముందుగా కన్వీన ర్ కోటా భర్తీ చేయండి. తరువాత మేనేజ్‌మెంట్ కోటా భర్తీ చేయండి. ఆ తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం ఉందా? ఇప్పటివరకు మేనేజ్‌మెంట్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇస్తున్న నేపథ్యంలో... కన్వీనర్ కోటాలో మిగిలే సీట్లు వారికి ఇస్తే ఎలా ఉంటుంది? అది సాధ్యం అవుతుందా? అని సీఎం ప్రశ్నించారు. ఇందులో తొందరపాటు నిర్ణయాలు వద్దని, మేనేజ్‌మెంట్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు రాకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాత ప్రవేశాల విధానమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశంపై చ ర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ప్రస్తుత ప్రవేశాలు పూర్తయ్యాక ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే విభజించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం తెలంగాణపై ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు కావాలని ఆదేశించారు. ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పదేళ్లపాటు పాత ప్రవేశాల విధానమేనని చట్టంలో ఉన్నందున రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎంసెట్ పరిస్థితి ఏంటి? నిర్వహణ విధానం ఎలా ఉండాలి? పాత విధానంలో ప్రవేశాలు చేపట్టడం సాధ్యమేనా? ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? రాష్ట్రస్థాయి వర్సిటీల పరిస్థితి ఏంటి? ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందించడం కుదురుతుందా? తెలంగాణ విద్యార్థుల కోసం ఏం చేయవచ్చనే వివరాలను మంత్రి అడిగినట్లు తెలిసింది.
ఇతర రాష్ట్ర విద్యార్థులకు మిగులు సీట్లు!
Published Wed, Jun 11 2014 1:36 AM | Last Updated on Wed, Aug 15 2018 8:04 PM
Advertisement
Advertisement