Medical Admissions
-
మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావుడా?
సాక్షి, అమరావతి: ఈ సంవత్సరం మెడికల్ పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రాకుండానే రాష్ట్రంలో హడావుడిగా రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగించేశారని,, పైగా, ఆలస్య రుసుము పేరిట భారీగా భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల చేశారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ రావాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కోటాలో ప్రవేశాలు ప్రారంభించాలి. అయితే, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు ఇంకా షెడ్యూల్ రాలేదు. మరోపక్క ఇన్‌సర్వీస్ కోటా కుదింపును సవాల్ చేస్తూ సరీ్వస్ ఎంబీబీఎస్ వైద్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా ఆరోగ్య విశ్వవిద్యాలయం గత నెల 27న రాష్ట్ర కోటాలో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారంతో ఆన్లైన్ దరఖాస్తులకు గడువు కూడా ముగిసింది. ఆలస్య రుసుముతో శనివారం నుంచి సోమవారం వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పైగా, ఆలస్య రుసుము కూడా సాధారణ ఫీజుకంటే నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తోంది. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఓసీ, బీసీ వైద్యులకు ఆన్లైన్ దరఖాస్తు రుసుము రూ.7,080 ఉంటే.. ఆలస్య రుసుము రూ. 27,080గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.5,900 సాధారణ రుసుము ఉంటే ఆలస్య రుసుము రూ.25,900 చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలోనే ఇలా ఆలస్య రుసుముల పేరిట భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ రాకపోవడంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇంకా అడ్మిషన్లు ప్రారంంభించలేదని, ఏపీలో మాత్రం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియనే ముగిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్వినర్ కోటా అడ్మిషన్లను హడావుడిగా ముగిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డిని వివరణ కోరగా.. ఏటా కొందరు అభ్యర్థులు దరఖాస్తుల గడువు ముగిశాక కోర్టులకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకుంటున్నారని, దాని ప్రభావం కౌన్సెలింగ్‌పై పడుతోందని చెప్పారు. అందువల్లే ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటామని, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ మొదలయ్యాకే రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. -
జీవో 33పై పోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్న జీవో 33పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయ పోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర విద్యార్థుల స్థానికత కోసం ప్రభుత్వం కొత్తగా సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో అత్యున్నత కమిటీ వేసి వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసానిచ్చారు. జీవో 33 వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై గురువా రం హరీశ్‌రావును ఆయన నివాసంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వివరించారు. జీవో 33 నిబంధనల మేరకు తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికేతరులుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఏపీలో చదవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానికేతరులుగా మారుతున్నారన్నారు. తమ పిల్లలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు హరీశ్‌రావును కోరారు.పంచాయతీలపై ఉన్నమాట అంటే ఉలుకెందుకు..?కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తా ము ఆధారాలు, గణాంకాలతో చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడు తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ అబ ద్ధాలు చెబుతోందంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు నయాపైసా చెల్లించలేదంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ.2100 కోట్లను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించారని పేర్కొన్నారు. రెండు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు, ఎనిమిది నెలలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదని, ఈ వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘స్థానికత’ ఉత్తర్వులతో తెలంగాణ విద్యార్థులకు నష్టం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేసేలా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులు తెలంగాణలోనే స్థానికేతరులుగా మారే అవకాశముందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపీ నాథ్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంటర్, ఎంబీబీఎస్ కోర్సులు ఇతర రాష్ట్రాల్లో చదివే తెలంగాణ విద్యార్థులు సొంత రాష్ట్రంలోనే నాన్ లోకల్‌గా మారే ప్రమాదముందని చెప్పారు.పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున పార్లమెంటు చట్టం ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం ‘లోకల్’అంశంపై పాత పద్ధతిని కొనసాగించిందన్నారు. కానీ తెలంగాణలో ఏర్పడిన కొత్త మెడికల్ కాలేజీల్లో వందశాతం సీట్లు స్థానికులకే దక్కేలా నిబంధనలు మార్చి న్యాయం చేశామని చెప్పారు. ఉమ్మడి రాజధాని అంశంలో పదేళ్ల గడువు ముగిసినా, ప్రస్తుత ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేశాల్లో 95 శాతం సీట్లు స్థానికులకే ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావొస్తున్నా స్థానికతపై సరైన విధానం లేదని, జీఓ 30ని వెంటనే సవరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. స్థానికత అంశంపై మెడికల్ కాలేజీలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగకుండా సలహాలు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నీట్‌కు ముందు 9వ తరగతి నుంచి నాలుగేళ్లు కచి్చతంగా తెలంగాణలో చదివితేనే స్థానికత వర్తిస్తుందనే నిబంధన తెచి్చందన్నారు. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల తరహాలో స్థానికత విధానాన్ని అమలు చేసినా సరిపోతుందని చెప్పారు. స్వచ్ఛదనం.. పచ్చదనానికి నిధులేవి..? ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం–పచ్చదనం’కార్యక్రమానికి నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నిధుల లేమితో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎనిమిది నెలలుగా పంచాయతీలకు నయా పైసా రాలేదని, కేంద్రం ఇచి్చన రూ.2,100 కోట్ల నిధులను ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని చెప్పారు. -
మెడికల్ సీట్ల కేటాయింపు వివాదంపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు వివాదంపై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి. ఈ మేరకు జూలై 3న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. అన్ రిజర్వుడులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీపడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్ రిజర్వుడు అనేది ఉండదు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో నంబర్ 72 చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయడంతో పాటు కౌన్సెలింగ్‌లో పాత విధానాన్నే అనుసరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వర్సిటీ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రా వు వాదనలు వినిపించారు. పునర్వ్యవస్థీకరణ చట్టానికి, రాజ్యాంగానికి ప్రభుత్వ నిర్ణ యం వ్యతిరేకం కాదని చెప్పారు. విభజనకు ముందు ఉన్న కాలేజీల్లో ఏపీ విద్యార్థుల కు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. కొత్త కాలేజీల్లోని సీట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
మెడికల్ సీట్లు మిగులుతున్నాయ్
వైద్య విద్య చదవాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో నీట్ పరీక్ష రాసేవారూ పెరుగుతున్నారు. మరోవైపు కాలేజీలు, సీట్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ వంటి పీజీ కోర్సుల్లో చేరాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయా సీట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. కానీ మెడికల్ సీట్లు మిగులుతుండటం విస్మయం కలిగిస్తోంది. సాక్షి, హైదరాబాద్: దేశంలో గత మూడేళ్లలో మొత్తం 860 ఎంబీబీఎస్, 12,758 పీజీ మెడికల్ సీట్లు మిగిలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే గత ఎనిమిదేళ్లలో 36,585 బీడీఎస్ సీట్లు కూడా మిగిలినట్లు తెలిపింది. 2016–23 మధ్యకాలంలో మొత్తం 1,89,420 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 36,585 మిగలడమంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2017–23 మధ్య 38,487 ఎండీఎస్ సీట్లు ఉంటే వాటిల్లో 5 వేలకుపైగా ఖాళీగా ఉండిపోయాయి. తెలంగాణలోనూ గతేడాది 200కుపైగా పీజీ మెడికల్ సీట్లు మిగిలిపోగా, దాదాపు 30 వరకు ఎండీఎస్ సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెప్పాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేయాలని కోరుకుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో లక్షలు కుమ్మరించి చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్ క్లినికల్ పీజీ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు. అంతేకాదు సాధారణ ఫీజు చెల్లిస్తే చాలని, డొనేషన్ వద్దని, తమ కాలేజీల్లో చేరాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోరుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ఉపాధి లేని కోర్సులతో సీట్ల మిగులు 2020–21 విద్యా సంవత్సరంలో 83,275 యూజీ, 55,495 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా, 2021–22లో 91,927 యూజీ, 60,202 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లలో కొన్ని మిగలడానికి ప్రధాన కారణం ఎన్ఆర్ఐ కోటా ఫీజులు భారీగా ఉండటమేనని చెబుతున్నారు. కొన్ని బీ కేటగిరీ సీట్లకూ భారీగానే ఫీజులు వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులకు వైద్యరంగంలో ప్రైవేట్ కాలేజీ ఫీజులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. తెలంగాణలో మాత్రం గతేడాది ఒక్క ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు కూడా మిగలలేదు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మిగులుతున్నాయి. ఇక పీజీ మెడికల్ సీట్ల విషయానికి వస్తే, నాన్ క్లినికల్ కోర్సుల్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ప్రధానంగా మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ క్లినికల్ కోర్సుల మాదిరి నాన్ క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సులు చేసినవాళ్లు ఖాళీగా ఉంటున్నారు. రూ.40–50 వేలకే... ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నాన్ క్లినికల్ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపడంలేదు. ఒకప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ.లక్షకు పైగా జీతాలు తీసుకున్నవారు, ఇప్పుడు రూ.40–50 వేలకే పనిచేయాల్సిన దుస్థితి. కొన్నిసార్లు ఆ మేరకైనా అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్ చేయడానికి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్ మెడికల్ కోర్సులే ఉపయోగపడతాయి. దీంతో నాన్ క్లినికల్ సీట్లను తగ్గించి క్లినికల్ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్ విద్యార్థులు కోరుతున్నారు. ఇక డెంటల్ కోర్సుల్లో చేరకపోవడానికి ప్రధాన కారణం.. వృత్తిపరమైన వృద్ధి లేకపోవడం, జీతాలు తక్కువగా ఉండటమేనని అంటున్నారు. -
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వినర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)– 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటినుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ స్కోర్ 291 మార్కులు అభ్యర్థులు నీట్ పీజీలో కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత 50 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 291 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కనీస అర్హత 40 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 257 మార్కులు, దివ్యాంగుల కనీస అర్హత 45 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 274 మార్కులు సాధించి ఉండాలని వర్సిటీ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలు ♦ అభ్యర్థి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ♦ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి శాశ్వత నమోదు చేసుకొని ఉండాలి. ♦ కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ♦ ఎంబీబీఎస్ చదివినవారు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుండి వచ్చే నెల 11వ తేదీ లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. 11 ఆగస్టు 2023 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే అభ్యర్థులు సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ♦ సర్విస్‌లో ఉన్న అభ్యర్థుల విషయంలో 30 జూన్ 2023 నాటికి వారు అందించిన సేవలను పరిగణలోకి తీసుకుంటారు. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.5500 ♦ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5500 (బ్యాంక్ లావాదేవీల చార్జీలు అదనం), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5000 (బ్యాంకు లావాదేవీల చార్జీలు అదనం). రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ♦ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్మిట్ కార్డ్, నీట్ పీజీ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తదితరాలు సమర్పించాలి. ♦ ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే సాయం కోసం 9392685856, 7842542216 నంబర్లను సంప్రదించవచ్చు. -
మెడికల్ స్టూడెంట్స్ కు శుభవార్త
-
పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య ప్రవే శాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖా స్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖాస్తులను https://tspgmed. tsche.in దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం www. knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది. -
Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: తమ పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ రెండో రోజు దీక్ష సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. భారతీయ వైద్య వర్సిటీల్లో తమకు అవకాశం కల్పించేలా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్టు–1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్టులకు సవరణలు చేయాలని కోరారు. పొరుగు దేశం శ్రీలంకకు సాయం చేస్తున్న కేంద్రం దేశంలోని విద్యార్థులకు న్యాయం చేయదా అని ప్రశ్నించారు. నీట్ ర్యాంకు వచ్చినా భారత్‌లో ఫీజులు అధికం కాబట్టే తమ పిల్లలను ఉక్రెయిన్‌కు పంపాల్సి వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వమే వారి భవిష్యత్తును కూడా కాపాడాలని కోరారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
‘మెడికల్ పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ మంత్రుల ప్రమేయం ఉన్నందున సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆషామాషీ విచారణ చేస్తే నిగ్గు తేలదని, ఆలస్యం చేయకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు రేవంత్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాపై పేద, మధ్య తరగతి విద్యార్థులు వారం రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, వర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన వారిని మెరిట్ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేయించి, తర్వాత ఆ సీటును బ్లాక్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. స్వయంగా మంత్రులకు చెందిన కాలేజీలే దందా చేస్తుంటే సాధారణ పోలీసు విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసించగలమా? ఈ దందాపై కఠిన వైఖరి ప్రదర్శించాలి’అని రేవంత్ కోరారు. -
మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్.. దందాలో పెద్దలు?
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందా మరింతగా రాజుకుంటోంది. ప్రైవేటు కాలేజీలు ఇతరరాష్ట్రాల విద్యా ర్థుల సాయంతో ఇక్కడ సీట్లను బ్లాక్ చేసి, తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముకుంటు న్న వ్యవహారంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. బ్లాక్ దందా వెనుక కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నా రన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడిన మెడికల్ కాలేజీల్లో కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులవని సమాచారం. అంతేకాదు ఇక్కడ సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇస్తన్న వివరణలు, అధికారుల హడావుడిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం సహకారం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. 34 అనుమానాస్పద దరఖాస్తుల్లో.. పీజీ వైద్య సీట్లకు ఇప్పటివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా.. సుమారు 34 మంది దరఖాస్తులు అనుమానాస్పదం గా ఉన్నట్టు కాళోజీ యూనివర్సిటీ గుర్తించింది. ఈ 34 మంది కూడా మంచి ర్యాంకులు సాధించనవారే కావడం, వారి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశమున్నా.. ఇక్కడ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడాన్ని సందేహించింది. వారందరికీ లేఖ రాసి వివరణ అడిగింది. వీరిలో 18 మంది రాష్ట్ర కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మిగతా 16 మందిలో.. తొమ్మిది మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, మరో ఏడుగురు తాము దరఖాస్తే చేయలేదని చెప్పారు. దీనిపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఏడుగురు అభ్యర్థులకు తెలియకుండానే.. వేరే ఎవరో పీజీ మెడికల్ సీటుకు దరఖాస్తు చేసినా గుర్తించే పరిస్థితి లేదంటే ఏమనుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సదరు ర్యాంకర్లు, తాము కలిసి చేసిన అక్రమాలు బయటికి రాకుండా కాలేజీల యాజమాన్యాలు నాటకం ఆడుతున్నాయా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లొసుగును అడ్డుపెట్టుకుని.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 2,300 వరకు పీజీ మెడికల్ సీట్లున్నాయి. ఇందులో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్లు 1,400. ఇందులో 50శాతం అంటే.. 700 సీట్లను కన్వీనర్ కోటా కింద నేరుగా భర్తీ చేస్తారు. మిగతా 50శాతం (700) సీట్లు మేనేజ్మెంట్ కోటాలో మూడు కేటగిరీలుగా (బీ కేటగిరీలో 25 శాతం, ఎన్నారై కోటాలో 15 శాతం, ఇనిస్టిట్యూషనల్ కోటాలో 10 శాతం) ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ఏదైనా కేటగిరీలో సీట్లు నిండకపోయినా, ప్రవేశాలు జరిగాక ఖాళీ అయినా.. సదరు కాలేజీలు వాటిని ఎన్నారై కోటా కింద భర్తీ చేసుకోవచ్చు. అందువల్ల బీ కేటగిరీ సీట్లను ‘బ్లాక్’ చేసి, ఎన్నారై కేటగిరీగా మార్చుకునేలా కాలేజీలు పన్నాగం పన్నాయి. ఆ సీట్లను భారీ రేటుకు అమ్ముకునేలా ప్లాన్ వేశాయి. గవర్నర్ జోక్యంతో హడావుడి పీజీ వైద్య సీట్ల బ్లాకింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవడం, కీలక ప్రజాప్రతినిధుల కళాశాలల్లోనూ ఈ వ్యవహారం జరిగిందన్న ప్రచారంతో.. ఈ దందాపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కూడా ఈ బ్లాక్ దందాపై ఆరా తీసింది. మరోవైపు ఈ అంశాన్ని సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దందా వ్యవహారాన్ని ఎలాగోలా కప్పిపెట్టాలని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విద్యార్థులకు బెదిరింపులు? వైద్య విద్య పీజీ సీటు బ్లాకింగ్ కోసం కొందరు విద్యార్థులను ప్రలోభపెట్టి, చేర్పించుకున్న కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఏజెన్సీలు.. ఇప్పుడా విద్యార్థులను భయపెడుతున్నట్టు సమాచారం. ఏమీ తెలియదని చెప్పాలని, ఎవరు దరఖాస్తు చేశారో కూడా తెలియదని చెప్పాలని వారిని బెదిరిస్తున్నట్టు తెలిసింది. తద్వారా బ్లాక్ దందా అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వీటికి బదులేవి ► రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు, కాళోజీ యూనివర్సిటీ అధికారులు చెప్తున్న దానికి, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ► ప్రస్తుతం మేనేజ్మెంట్ సీట్ల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎన్ని సీట్లు మిగులుతాయో, ఎందరు మానేస్తారో, ఎన్నిసీట్లు ఎన్నారై కేటగిరీగా మారుతాయో తెలియదని.. అలాంటిది సీట్ల బ్లాకింగ్ జరగలేదని ఇప్పుడే ఎలా చెప్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయి. ► అధికారులు ఒకవైపు కేవలం అనుమానం అంటున్నారని.. మరోవైపు విచారణ అంటూ హడావుడి చేయడం ఏమిటని విద్యార్థులు పేర్కొంటున్నారు. ► ఏడుగురు నకిలీ అభ్యర్థులు ఇతరుల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశారని చెప్తున్నారని.. టెన్త్ సర్టిఫికెట్ నుంచి ఆధార్ దాకా అన్ని సర్టిఫికెట్లు, ఫొటోలు, సంతకాలు అన్నీ ఎలా తేగలరని ప్రశ్నిస్తున్నారు. ► సొంత రాష్ట్రాల్లోనే కన్వీనర్ కోటా సీటు దొరికే స్థాయిలో ర్యాంకు వచ్చినవారు.. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో దరఖాస్తు చేసినప్పుడు.. ఆయా విద్యార్థుల రాష్ట్రాల్లో వెంటనే ఎందుకు విచారణ చేయలేదని నిలదీస్తున్నారు. -
విద్యార్థులకు తెలియకుండానే.. దరఖాస్తులు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎక్కడా సీట్ల బ్లాకింగ్ జరగలేదని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఏడు సీట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల అభ్యర్థుల టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్, నీట్ అర్హతకార్డు వంటివన్నీ ఇతరులెవరో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసినట్టుగా భావిస్తున్నా మని తెలిపారు. అయితే తమను తప్పుదారి పట్టించేందుకు అభ్యర్థులే ఈ నాటకం ఆడుతున్నారా? లేక ప్రైవేట్ ఏజెన్సీలేమైనా అక్రమాలకు పాల్పడ్డాయా అన్నదానిపై విచారణ జరుగుతోందన్నారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కాంపై శుక్రవారం వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత రాష్ట్రంలోని మంచి కాలేజీలో చేరి, ఇక్కడా చేరినట్టు అనుమానం రావడంతో.. మార్చి 16న కొందరు అభ్యర్థులకు లేఖలు రాశామని.. సీట్లు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించామని తెలిపారు. వివిధ విడతల కౌన్సెలింగ్ అనంతరం 37 సీట్లలో ఉన్నతర్యాంకు వారు దరఖాస్తు చేశారని.. వారిలో ముగ్గురికి సొంత రాష్ట్రాల్లో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో తిరస్కరించామని వివరించారు. మిగతా 34 సీట్లకుగాను 14 మంది ఇక్కడ చేరారన్నారు. మరో ఏడుగురికి సంబంధించి అభ్యర్థులు కాకుండా ఇతరులు దరఖాస్తు చేసినట్టు గుర్తించామని తెలిపారు. వారు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందినవారని వెల్లడించారు. సాధారణంగా మాప్ అప్ విడత తర్వాత మిగిలిన సీట్లను మేనేజ్మెంట్లకు ఇవ్వాలని, కానీ మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ తర్వాతా సీట్లు మిగిలితేనే ఎన్నారై కోటా కింద మార్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఉంటుందన్నారు. గవర్నర్‌కు నివేదిస్తాం..: సీట్ల బ్లాకింగ్‌కు సంబంధించిన ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌కు సమగ్ర నివేదిక ఇస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు సీటు వదులుకుంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు జరిమానా విధించే వారమని, దాన్ని రూ.20 లక్షలకు పెంచామని చెప్పారు. 2017 నుంచి నీట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నందున మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2019లో ఇలాగే ముగ్గురు విద్యార్థులపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశామని.. బ్లాకింగ్ జరగలేదని ఎన్ఎంసీ తేల్చిందని చెప్పారు. అన్నిరాష్ట్రాల పీజీ సీట్లలో ఎవరెవరు చేరారో వెబ్సైట్లలో పెట్టడం లేదా కామన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. -
మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో స్పెషలైజేషన్ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్’ దందా నడుస్తోంది. ప్రైవే టు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గం పట్టాయి. ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్మెంట్ కోటా సీటు అలాట్ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం.. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును అడ్డగోలు ‘రేటు’కు అమ్ముకుని భారీగా వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. దీనివల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లొసుగును వాడుకుని.. మెడికల్ కాలేజీల్లో దందాలకు చెక్ పెట్టేందుకు దేశంలో ‘నీట్’ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పి స్తున్నారు. అయినా నిబంధనల్లో ఉన్న లొసుగులను వాడు కుని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మెడికల్ పీజీ సీట్లను అమ్ముకుంటున్నాయి. ఇందుకోసం పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ‘నీట్’ పరీక్ష వల్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీపడొచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మేనేజ్మెంట్ సీట్ల కోసం తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నీట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలను విడుదల చేసింది. అయితే ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించినవారే. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖ రాసింది. అందులో కొందరు తదుపరి దశల కౌన్సెలింగ్ తప్పుకోగా, ఏడుగురు విద్యార్థులైతే మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తే చేసుకోలేదని వర్సిటీకి తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలున్నట్టు గుర్తించిన కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్.. లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి సోమవారం ఫిర్యాదు చేశారు. సీట్ల భర్తీ ఇలా.. ప్రైవేట్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లలో సగం కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తుంది. వాటికి అతితక్కువ ఫీజు ఉంటుంది. మిగతా సగం మేనేజ్మెంట్ కోటా సీట్లలో తిరిగి మూడు (1, 2, 3) కేటగిరీలు ఉంటాయి. ఇందులో కేటగిరీ–1 సీట్లు సగం (మొత్తం సీట్లలో 25శాతం) ఉంటాయి. వార్షిక ఫీజు రూ.24 లక్షలు ఉండే ఈ సీట్లను కూడా ప్రభుత్వ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇక కేటగిరీ–2 సీట్లు 30శాతం (మొత్తం సీట్లలో 15శాతం), కేటగిరీ–3 సీట్లు 20శాతం (మొత్తం సీట్లలో 10శాతం) ఉంటాయి. కేటగిరీ–2 సీట్లలో ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ విద్యార్థులకు.. కేటగిరీ–3 సీట్లను మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తమకు ఇష్టమొచ్చినవారికి కేటాయించుకోవచ్చు. ఈ రెండింటికీ అధికారికంగా రూ.72 లక్షలు ఫీజు ఉన్నా.. రూ.రెండు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. కేటగిరీ–1 సీట్లలో చేరిన ఏ విద్యార్థి అయినా తమ అడ్మిషన్‌ను వదులుకుంటే, కాలేజీలు ఆ సీటును కేటగిరీ–2 (ఎన్నారై కోటా) కింద భర్తీ చేసుకోవచ్చు. అంతమేర భారీగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు. దీనినే ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీటు వచ్చేందుకు సరిపడా మెరిట్ ఉన్నా.. ఇతర రాష్ట్రాల ర్యాంకర్లు రావడంతో మనవాళ్లకు సీట్లు దక్కడం లేదు. ఇతర రాష్ట్రాలవారు వచ్చి వదిలేసి వెళ్లిపోతుండటం.. ఆ సీట్లను మేనేజ్మెంట్లు అమ్మేసుకుంటుండటంతో.. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ దందాతో పలుకాలేజీలు రూ.100 కోట్ల దాకా అక్రమంగా వెనకేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రాజకీయంగా పలుకుబడి కలిగినవారు కావడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బ్లాక్ చేసేది ఎలాగంటే..? సాధారణంగా ఎక్కువ ర్యాంకు ఉన్నవారికి కౌన్సెలింగ్‌లో మొదట సీట్లు కేటాయిస్తారు. దీనితో టాప్ ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మెడికల్ కాలేజీలు డబ్బులతో గాలం వేస్తున్నాయి. తమ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ–1) సీటుకు దరఖాస్తు చేసుకుని, అలాట్మెంట్ అయ్యాక వదిలి వెళ్లిపోయేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఆ సీటు ఎన్నారై కోటా (కేటగిరీ–2) కిందికి మారుతుంది. దానిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ► ఇక్కడ దరఖాస్తు చేయిస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో చాలా వరకు వారి రాష్ట్రాల్లోని మెడికల్ కోర్సుల్లో చేరినవారే ఉంటున్నారు. అయితే అక్కడి కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకుని.. మన రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సీటు వచ్చాక క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తమకు భారీగా లాభం వస్తుండటంతో మేనేజ్మెంట్లు వారికి ఐదారు లక్షలదాకా ముట్టజెపుతున్నట్టు సమాచారం. ► ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ అయ్యాక సీటును వదులుకుంటే.. హెల్త్ వర్సిటీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును కూడా కాలేజీల యాజమాన్యాలే వారి పేరిట కట్టేస్తున్నట్టు తెలిసింది. ► మన రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లలో కొందరు ఇప్పటికే జాతీయ స్థాయి కాలేజీల్లో చేరినా.. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులు చేసినట్టు తెలిసింది. ఇదంతా కేవలం పీజీ సీటును బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. -
‘నీట్’లాగే నర్సింగ్‌కూ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్లకు ‘నీట్’ ఎలాగో నర్సింగ్ ప్రవేశాలకూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్) రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న జాతీయ నర్సింగ్ కౌన్సిల్ స్థానంలో కొత్తగా ‘నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్ (ఎన్‌ఎన్‌ఎంసీ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 6నాటికి దేశవ్యాప్తంగా అభిప్రాయాలు కోరింది. నర్సింగ్ విద్య, వృత్తిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్దేందుకు బిల్లులో అనేక అంశాలను చేర్చారు. ప్రస్తుత నర్సింగ్ వ్యవస్థను సమూలంగా మార్చాలన్నదే దీని ఉద్దేశమని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇకపై నర్సింగ్ కోర్సు చేయాలంటే.. ఇప్పటివరకు బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలంటే ఇంటర్ బైపీసీ అర్హతగా ఉంది. ఓపెన్ కేటగిరీలో 45%, రిజర్వేషన్ కేటగిరీలో 40% మార్కులు సాధించిన వారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకోవాలి. మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే బీఎస్సీ నర్సింగ్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఏడాదిపాటు ఎక్కడో ఒకచోట పనిచేసిన అనుభవం ఉండాలి. అలాంటివారికి వారి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 2014కు ముందు ఎంఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు ఎంట్రన్స్ నిర్వహించేవారు. తదనంతరం దాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం దేశంలో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరడానికి మార్కులే అర్హత. నర్సింగ్ కోర్సు పూర్తయ్యాక రాష్ట్రాల్లోని నర్సింగ్ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నర్సులుగా చేరేవారు. ఇకపై నర్సింగ్ వృత్తి చేపట్టడం అంత సులువు కాదు. నర్సింగ్ విద్యలో నాణ్యతను పెంచడానికి కొత్తగా జాతీయస్థాయిలో నీట్ తరహా ఎంట్రన్స్ పెడతారు. దానిని ‘యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్’గా పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించినవారు జాతీయ, రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక నర్సింగ్ కోర్సు పూర్తయినవారికి మళ్లీ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాసైన వారే నర్సింగ్ వృత్తి చేపట్టడానికి లేదా ఎంఎస్సీ కోర్సులో చేరడానికి అర్హులు. ముసాయిదాలోని మరికొన్ని అంశాలు నర్సింగ్ కోర్సు సిలబస్ ఆలిండియా స్థాయిలో ఆంగ్లంలో ఒకటే ఉంటుంది. కాలేజీల్లో నర్సింగ్ విద్యా ప్రమాణాలను పెంచాలి. నైపుణ్యం, విజ్ఞానం, ప్రవర్తన, విలువలు, నైతికత, హెల్త్‌కేర్, పరిశోధన వంటివి నేర్పించాలి. పోటీతత్వం పెంచాలి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నర్సింగ్ విద్యాసంస్థలను తీర్చిదిద్దేలా మార్గదర్శకాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, మంచి ఫ్యాకల్టీని కల్పించడం ద్వారా నాణ్యతను పెంచాలి. అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ ఫ్యాకల్టీకి శిక్షణనివ్వాలి. కమిషన్ అమల్లోకి వచ్చిన తరువాత మూడేళ్లలోపునే జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. బిల్లు పాసైన ఐదేళ్లలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అమలుచేస్తారు. జాతీయస్థాయి రిజిస్ట్రేషన్ నర్సింగ్ కోర్సు ఏ రాష్ట్రంలో చదివినవారు ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ప్రస్తుత నిబంధన. కానీ కొత్త కమిషన్‌లో కీలకమార్పు చేశారు. నేషనల్ పోర్టల్‌లో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. కాలేజీల్లో తనిఖీలు కఠినంగా ఉంటాయి. థర్డ్ పార్టీకి తనిఖీల బాధ్యత అప్పగిస్తారు. తనిఖీ వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఏఎన్ఎంలు ఇకపై ‘నర్స్ అసోసియేట్’గా కొత్త హోదా పొందుతారు. లేడీ హెల్త్ వర్కర్స్, మేల్ హెల్త్ వర్కర్లను కూడా నర్స్ అసోసియేట్‌గానే పిలుస్తారు. నాలుగు మండళ్ల ఏర్పాటు ఎన్‌ఎన్‌ఎంసీ పరిధిలో కొత్తగా నర్సింగ్–మిడ్ వైఫరీ యూజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్– మిడ్వైఫరీ పీజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అసెస్మెంట్–రేటింగ్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఎన్‌ఎంసీకి చైర్పర్సన్, నర్సింగ్ అడ్వైజరీలు, సభ్యులు ఉంటారు. వీరిలో ఎయిమ్స్ వంటి సంస్థలు, ఆసుపత్రుల్లో పనిచేసే సూపరింటెండెంట్లు ఉంటారు. 12 మంది నిపుణుల్లో నర్సులు ఉంటారు. మిడ్వైఫరీ నుంచి, ఎన్జీవో నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఒకరు మెడికల్ లా తెలిసినవారు సభ్యులుగా ఉంటారు. సెర్చ్, సెలక్షన్ కమిటీలో ఆఫీస్ బేరర్లను నియమిస్తారు. చైర్మన్, సభ్యులు నాలుగేళ్లకోసారి మారతారు. చైర్మన్, సభ్యులు ఆస్తులు ముందే ప్రకటించాలి. నాణ్యత పెరుగుతుంది ప్రస్తుత నర్సింగ్ కౌన్సిల్ స్థానే నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్‌ను తీసుకురావడం వల్ల నర్సింగ్ విద్యలో సమూల మార్పు లొస్తాయి. జాతీయస్థాయి పరీక్ష, ఎగ్జిట్ ఎగ్జామ్ల వల్ల నర్సింగ్ వృత్తి, విద్యలో ప్రమాణాలు, నాణ్యత పెరుగుతాయి. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతాయి. – లక్ష్మణ్ రుడావత్, ప్రధాన కార్యదర్శి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ -
నేటి నుంచి ‘నీట్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2020–21కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దరఖాస్తు విడుదల చేయనుంది. దరఖాస్తులను ఎన్టీఏ.ఏసీ.ఇన్, ఎన్‌టీఏనీట్.ఎన్ఐసీ.ఇన్‌ల్లో పొందవచ్చు. దరఖాస్తులో ప్రత్యక్ష ఫొటోతోపాటు అదనపు పత్రాలూ జోడించాల్సి ఉంటుందని, ఆ మేరకు మార్పులు చేసే అవకాశాలున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎయిమ్స్ ప్రవేశాలూ నీట్ ద్వారానే... 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కాలేజీ ల్లోని ఎంబీబీఎస్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 532 మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 914 ఆయుష్ కాలేజీల్లోని 52,720 సీట్లకు, 313 బీడీఎస్ కాలేజీల్లోని 26,949 సీట్లకు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లకు, రెండు జిప్మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లకు నీట్ ద్వారానే భర్తీ జరుగుతుంది. అన్ని రాష్రాల కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటిస్తుంది. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను 100 శాతం నీట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ, బీ కేటగిరీ సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. గతేడాది రాష్ట్రం నుంచి 48,996 మంది నీట్ రాయగా, 33,044 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. -
మెడికల్ సీట్ల పేరుతో మోసం
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి ర్యాంక్‌లు వచ్చేలా చూడాల్సిన లెక్చరరే మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇప్పిస్తానంటూ రూ. లక్షల్లో దండుకుని తీసుకొని మోసగించడంతో రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడికి సహకరిస్తున్న నిర్మల్‌కు చెందిన యాగ శ్రావణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9.45 లక్షల నగదు, వెంటో వోక్స్‌వాగన్‌కారును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కృష్ణా జిల్లా, విసన్నపేట మండలం, పుతిరాల గ్రామానికి చెందిన అరిగే వెంకట్రామయ్య ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అనంతరం నారాయణ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. కొన్ని నెలల క్రితం తానే ఎల్బీనగర్లో ఏవీఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నీట్ స్టూడెంట్స్ పేరుతో ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. అందరూ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూస్తామని, ఒకవేళ రాకున్నా మేనేజ్మెంట్ కోటాలో బీ లేదా సీ కేటగిరిలో సీట్లు ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. ఇలా పలువురు విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. తల్లిదండ్రులకు కూడా హామీ ఇవ్వడంతో నమ్మి చాలా మంది డబ్బులు చెల్లించారు. అయితే అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాని విద్యార్థులు మేనేజ్మెంట్ సీట్ల విషయాన్ని ప్రస్తావిస్తే రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అతడి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఎల్బీనగర్కు చెందిన గదగోజు పరమేశ్ తన నుంచి రూ.17 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని సీట్లు ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం వెంకట్రామయ్య, అతని ఇనిస్టిట్యూట్‌లోని రిసెప్షనిస్ట్‌గా పనిచేసే శ్రావణి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎల్బీనగర్లో సోమవారం అరెస్టు చేశారు. నరేశ్, వంశీ, సత్యనారాయణల అనే మరి కొందరి నుంచి రూ. 1.40 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు తేలింది. తదుపరి విచారణ కోసం నిందితులను ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. -
ఎటూ తేలని ఈబీసీ కోటా?
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) వర్తించే 10 శాతం కోటాపై రాష్ట్రంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే పార్లమెంటు చట్టం చేస్తూ తెచ్చిన ఈ రిజర్వేషన్ల మేరకు ఈ ఏడాది నుంచే విద్యా, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య సీట్ల భర్తీ జరుగుతోంది. జాతీయ పూల్ సీట్లకు కౌన్సెలింగ్ మొదలైంది. అలాగే రాష్ట్రకోటాకు సంబంధించిన సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో.. గతంలో ఎలా కౌన్సెలింగ్ జరిగిందో అలాగే పూర్తిచేసేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగానే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకిచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి 2019 మార్చి 8న ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే.. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ఇచ్చామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈబీసీ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు రాలేదని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.అప్పలనాయుడు చెప్పారు. వచ్చే నెల 3 నుంచి రాష్ట్ర కోటా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ఈబీసీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఉత్తర్వులు జారీ చేసి, అమలు చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇన్ సర్వీసు కోటా చిచ్చు
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య పీజీ సీట్ల అడ్మిషన్లలో కొత్త విధానం వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేవారికి పీజీ అడ్మిషన్లలో ఉండే ప్రాధాన్యతను తగ్గించడంపై వైద్య సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే రెగ్యులర్ వైద్యులకు కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత కల్పించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి గతంలో ఉన్న ప్రాధాన్యతను రద్దు చేశారు. దీంతో వైద్య సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం ముఖ్యులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పీజీ కౌన్సెలింగ్‌లో గతంలో ఉన్న 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ కోటాను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇన్ సర్వీసు కోటాలో పీజీ సీట్లు పొందాలనుకునే వైద్యులకు నష్టం కలుగుతుందన్నారు. ‘ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యులు ఎంతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వం ప్రవే శపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వైద్య సేవలు అందిస్తూ పీజీలో చేరాలనే వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి పీజీ ఇన్ సర్వీసు కోటాను మార్కులతో ముడిపెట్టకుండా గతంలో మాదిరిగా అమలు చేయాలి. సర్వీసు కోటాలో 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ వాటాగా అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. రేపటి నుంచి దరఖాస్తులు.. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనుంది. మార్చి 23 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)తోపాటు రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ సీట్లలో అడ్మిషన్ పొందాలనుకునే వారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన అర్హతలు, అభ్యర్థుల మెరిట్ జాబితా, కాలేజీల వారీగా సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. -
పదేళ్లు నివాసముంటేనే లోకల్!
♦ కనీసం పేరెంట్స్ ఇక్కడున్నా పర్వాలేదు ♦ మెడికల్ అడ్మిషన్లపై ఆరోగ్య వర్సిటీ వెల్లడి ♦ స్థానికతపై నోటిఫికేషన్లో స్పష్టత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు నివాసం ఉంటేనే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులుగా పరిగణిస్తారు. సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణలో చదువుకోని పరిస్థితుల్లో.. కనీసం అభ్యర్థి తల్లిదండ్రులు పదేళ్లపాటు తెలంగాణలో నివాసం ఉన్నా స్థానికులుగానే పేర్కొంటారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో సీట్ల భర్తీపై 2024 వరకు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలనే నిబంధన నేపథ్యంలో వైద్య విద్య సీట్ల భర్తీలో స్థానికతపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం స్పష్టత ఇచ్చింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు.. స్థానికత, కులం వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంలోనే అభ్యర్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అలాగే అభ్యర్థులు తెలంగాణలో కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికతను గుర్తించేందుకు వర్సిటీ మరిన్ని వివరాలు కోరుతోంది. అభ్యర్థిగానీ, అభ్యర్థి తల్లిదండ్రులుగానీ పదేళ్లపాటు తెలంగాణలోనే నివసించినట్లుగా తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని పేర్కొంటోంది. తెలంగాణలో నివసించినట్లుగా ధ్రువీకరించే పత్రంలో సంవత్సరాల వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. అభ్యర్థులు కులాన్ని, స్థానికతను ధ్రువీకరించే సర్టిఫికెట్లతోపాటు తాము జత చేసే సర్టిఫికెట్ల వివరాలన్నీ సరైనవేనని పేర్కొంటూ రూ.100 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాలని తెలిపింది. సర్టిఫికెట్లలో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉంటే అభ్యర్థులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. -
‘నీట్ దరఖాస్తు’ తప్పుల తడక
సాక్షి, అమరావతి: మెడికల్ ప్రవేశాలకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్’ (నేషనల్ ఎలిజిబి లిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఆన్లైన్ దరఖాస్తు ఫారం తప్పుల తడకగా వచ్చింది. మే 7న ప్రవేశ పరీక్ష జరగనుండటంతో ఆన్‌ౖ లెన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్ని స్తున్న అభ్యర్థులు ఏం చేయాలో తెలియక గగ్గోలు పెడుతున్నారు. ఏపీ డీఎంఈకి తెలంగాణ మెయిల్ అడ్రస్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలు ఆయా రాష్ట్రాల మెడికల్ డైరెక్టరేట్‌ల్లో తెలుసు కోవచ్చని పేర్కొన్నారు. ఇందులో ఏపీ మెడికల్ డైరెక్టరేట్ కోఠి సుల్తాన్‌బజార్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈమెయిల్ చిరునా మా మాత్రం తెలంగాణ డీఎంఈది ఇచ్చారు. కానీ ఈ కార్యాలయాన్ని ఆరు నెలల క్రితమే విజయవాడలో ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి లక్షద్వీప్ వరకూ అన్ని రాష్ట్రాల మెడికల్ డైరెక్టరే ట్ల చిరునామాలు ఇచ్చారు. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కార్యాలయం వివరాలే ఇవ్వలేదు. రిజర్వేషన్ కేటగిరీలోనూ స్పష్టత లేదు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అనే విషయం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. కానీ జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి వీళ్లు ఓబీసీ కోటాలో దరఖాస్తు చేసుకో వాలా? జనరల్ కోటాలోనా అనేది స్పష్టత లేదు. దరఖాస్తు చేసుకునే సమయంలో అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కాలంలో పొందుపరచాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏ సమాచారం టిక్ చేయాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా జాతీయ కోటాలో లేని జమ్ము కశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంలోనూ సరైన స్పష్టత లేదని, ఈ వివరాల్లోకి వెళితే దేనిపై టిక్ చేయాలో అర్థం కావడం లేదని, అంతా గందరగోళంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. -
100 డెంటల్ సీట్లు మిగిలాయ్
పెద్దగా ఆసక్తి చూపనిమెడికల్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో పది, ప్రైవేటు కాలేజీల్లో 90 సీట్లు భర్తీకాని వైనం ‘నీట్’ పరీక్షతో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌కు పెరిగిన అవకాశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా డెంటల్ సీట్లు మాత్రం పూర్తిగా భర్తీ కాలేదు. ఇంకా 100 సీట్లు మిగిలే ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారు లు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు 2 కౌన్సెలింగ్‌లు, ప్రభుత్వం 5 కౌన్సెలింగ్‌లు నిర్వహించినా డెంటల్ సీట్లు భారీగా మిగిలాయి. ఎంబీబీఎస్‌లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి కనబర్చారు. ప్రభుత్వం లో కాకుంటే ప్రైవేటు బీ కేటగిరీ, అందులో సీటు రాకుంటే ఎన్ఆర్ఐ కోటాలో రూ.కోట్లు చెల్లించి ఎంబీబీఎస్ సీటు పొందేందుకే ప్రయత్నించారు. ‘నీట్’తో ఇతర రాష్ట్రాల్లో అవకాశం.. రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రభుత్వ డెంటల్ కాలేజీ హైదరాబాద్‌లో ఉంది. అందులో 100 డెంటల్ సీట్లున్నాయి. వీటిలో తెలంగాణకు 36 సీట్లు కేటాయిం చగా, ఆ సీట్లలో 10 మిగిలిపోయాయి. 10 ప్రైవేటు డెంటల్ మెడికల్ కాలేజీల్లో మొత్తం వెయ్యి సీట్లున్నా యి. వాటిల్లోనూ 90 సీట్లు మిగిలిపోయాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ‘నీట్’ ప్రవేశ పరీక్ష నిర్వహించినందున తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ రాకుంటే ఇతర రాష్ట్రాల్లో డొనేషన్లు చెల్లించి సీట్లు పొందడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. 15 తర్వాత ఆయుష్ సీట్లకు కౌన్సెలింగ్.. రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి సీట్లకు ఈ నెల 15 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామన్నారు. -
బీ కేటగిరీ సీట్లు మిగిలితే మరో కౌన్సెలింగ్
- మెడికల్ కాలేజీలు ఎన్నారై కోటాకు మార్చుకోవడానికి వీల్లేదు - హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తర్వుల జారీకి సర్కారు ఏర్పాట్లు - 28 లేదా 29న రెండో కౌన్సెలింగ్ - ప్రైవేటు బీ కేటగిరీ కౌన్సెలింగ్ తొలిరోజు స్పందన తక్కువే సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలిపోతే వాటికి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటివరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కౌన్సెలింగ్‌లో బీ కేటగిరీ సీట్లు మిగిలి పోయినా రెండో కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. వాటిని ఎన్నారై (సీ కేటగిరీ) కోటా కిందకు మార్చేసుకుని.. ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నాయి. అయితే అలా కేటగిరీ మార్చుకోవడం కుదరదన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి చెక్ పడనుంది. శుక్రవారం నుంచి మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం నాటికి కౌన్సెలింగ్ ముగియనుంది. ఇందులో సీట్లు మిగిలితే వాటిని ఎన్నారై కోటాలోకి మార్చకుండా.. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28 లేదా 29న ఈ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుందని పేర్కొంటున్నారు. మొదటి రోజు స్పందన అంతంతే! రాష్ట్రంలో 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 713 బీ కేటగిరీ సీట్లున్నాయి. వీటి భర్తీకి శుక్రవారం ఉస్మానియా వర్సిటీలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నీట్ ర్యాంకుల మెరిట్ జాబితా ఆధారంగా తొలి రోజున మొదటి 1,060 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో కేవలం 384 ఎంబీబీఎస్ సీట్లు, 7 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే మొదటి రోజు స్పందన తక్కువగా ఉందని కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో కొందరు ఏపీలో జరిగిన బీ కేటగిరీ కౌన్సెలింగ్‌లో పాల్గొని అక్కడి కాలేజీల్లో చేరడం, నీట్ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరడంతో.. తొలిరోజు స్పందన తక్కువగా ఉందంటున్నారు. శని వారం మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ జరగనున్నందున మిగతా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లన్నీ భర్తీ కావచ్చని చెబుతున్నారు. కాగా ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందినవారు ఈ నెల 27 నాటికి కాలేజీలో చేరాల్సి ఉంటుంది. అదే రోజున ఏడాది ఫీజుకు సంబంధించి గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నారై సీట్లకు కాలేజీల వారీగా భర్తీ ఎన్నారై సీట్ల భర్తీకి సంబంధించి కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీ పూర్తికాగానే వాటికి ఏదో ఒక రోజు కాలేజీ వారీగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటాయి. ఎన్నారై కోటా సీట్లను కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తున్నట్లు చెబుతున్నా.. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదు, కాలేజీలే ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకుంటాయి. మైనారిటీ కాలేజీలు బీ కేటగిరీ సీట్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీచేశాయి. గడువుపై 26న సుప్రీం తీర్పు మెడికల్ అడ్మిషన్ల గడువును నెల పాటు పెంచాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈ నెల 26న తీర్పు ఇచ్చే అవకాశం ఉం దని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
వైద్య అడ్మిషన్ల గడువు పెంచాలి!
► సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువును మరింత పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 నిర్వహించనున్న ప్రభుత్వం అదే నెల 20కల్లా ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే వైద్య ప్రవేశాల ప్రక్రియను దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి ఈ సమయం ఏమాత్రం సరిపోదు. ర్యాంకులు ప్రకటించాక సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ తదితర ప్రక్రియకు దాదాపు నెల సమయం పట్టనుంది. అందువల్ల అక్టోబర్ 20 వరకు ప్రవేశాల గడువు పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు.ఆ సమయం సరిపోతుందా లేదా అనే అంశంపై ఎంసీఐ తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ ఎంసీఐ కొంత గడువు పెంచితే ఆ సమయంలో రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ముగించవచ్చా? లేకుంటే ఇంకా అదనపు సమయం కోరాలా? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమయం సరిపోకపోతే గడువు పెంచాలంటూ ముందుగా ఎంసీఐకి విన్నవించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు భావిస్తున్నారు. అయితే ఎంసీఐ ఒప్పుకునే అవకాశాలుండవని... సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు. ‘సెప్టెంబర్ 30కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించాల్సి ఉంది. నీట్-1, 2 నిర్వహించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల ముగింపు గడువు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తేదీ ప్రకటించాక మనకు సమయం సరిపోతుందో లేదో చూడాలి. ఆ తర్వాతే దీనిపై ఎలా వ్యవహరించాలో పరిశీలిస్తాం’ అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. -
ఇతర రాష్ట్ర విద్యార్థులకు మిగులు సీట్లు!
* ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలపై అధికారులకు సీఎం ఆదేశం * సీట్ల భర్తీపై నివేదిక సమర్పించండి * ఫీజు భారం వివరాలివ్వండి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయగా మిగిలే సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మిగులు సీట్ల భర్తీ విషయంలో సాధ్యాసాధ్యాలతో సత్వరమే ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విభజన నేపథ్యంలో ప్రస్తుత ప్రవేశాల విధానం ఎలా ఉందని, దానివల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటుందా? అనే అంశాలపై ఆరా తీశారు. ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులతో ముందుగా కన్వీన ర్ కోటా భర్తీ చేయండి. తరువాత మేనేజ్మెంట్ కోటా భర్తీ చేయండి. ఆ తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం ఉందా? ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇస్తున్న నేపథ్యంలో... కన్వీనర్ కోటాలో మిగిలే సీట్లు వారికి ఇస్తే ఎలా ఉంటుంది? అది సాధ్యం అవుతుందా? అని సీఎం ప్రశ్నించారు. ఇందులో తొందరపాటు నిర్ణయాలు వద్దని, మేనేజ్‌మెంట్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు రాకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాత ప్రవేశాల విధానమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశంపై చ ర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ప్రస్తుత ప్రవేశాలు పూర్తయ్యాక ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే విభజించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ భారం తెలంగాణపై ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు కావాలని ఆదేశించారు. ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పదేళ్లపాటు పాత ప్రవేశాల విధానమేనని చట్టంలో ఉన్నందున రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎంసెట్ పరిస్థితి ఏంటి? నిర్వహణ విధానం ఎలా ఉండాలి? పాత విధానంలో ప్రవేశాలు చేపట్టడం సాధ్యమేనా? ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? రాష్ట్రస్థాయి వర్సిటీల పరిస్థితి ఏంటి? ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందించడం కుదురుతుందా? తెలంగాణ విద్యార్థుల కోసం ఏం చేయవచ్చనే వివరాలను మంత్రి అడిగినట్లు తెలిసింది.