సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందా మరింతగా రాజుకుంటోంది. ప్రైవేటు కాలేజీలు ఇతరరాష్ట్రాల విద్యా ర్థుల సాయంతో ఇక్కడ సీట్లను బ్లాక్ చేసి, తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముకుంటు న్న వ్యవహారంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. బ్లాక్ దందా వెనుక కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నా రన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడిన మెడికల్ కాలేజీల్లో కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులవని సమాచారం. అంతేకాదు ఇక్కడ సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇస్తన్న వివరణలు, అధికారుల హడావుడిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం సహకారం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి.
34 అనుమానాస్పద దరఖాస్తుల్లో..
పీజీ వైద్య సీట్లకు ఇప్పటివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా.. సుమారు 34 మంది దరఖాస్తులు అనుమానాస్పదం గా ఉన్నట్టు కాళోజీ యూనివర్సిటీ గుర్తించింది. ఈ 34 మంది కూడా మంచి ర్యాంకులు సాధించనవారే కావడం, వారి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశమున్నా.. ఇక్కడ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడాన్ని సందేహించింది. వారందరికీ లేఖ రాసి వివరణ అడిగింది. వీరిలో 18 మంది రాష్ట్ర కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మిగతా 16 మందిలో.. తొమ్మిది మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, మరో ఏడుగురు తాము దరఖాస్తే చేయలేదని చెప్పారు. దీనిపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఏడుగురు అభ్యర్థులకు తెలియకుండానే.. వేరే ఎవరో పీజీ మెడికల్ సీటుకు దరఖాస్తు చేసినా గుర్తించే పరిస్థితి లేదంటే ఏమనుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సదరు ర్యాంకర్లు, తాము కలిసి చేసిన అక్రమాలు బయటికి రాకుండా కాలేజీల యాజమాన్యాలు నాటకం ఆడుతున్నాయా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
లొసుగును అడ్డుపెట్టుకుని..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 2,300 వరకు పీజీ మెడికల్ సీట్లున్నాయి. ఇందులో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్లు 1,400. ఇందులో 50శాతం అంటే.. 700 సీట్లను కన్వీనర్ కోటా కింద నేరుగా భర్తీ చేస్తారు. మిగతా 50శాతం (700) సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో మూడు కేటగిరీలుగా (బీ కేటగిరీలో 25 శాతం, ఎన్నారై కోటాలో 15 శాతం, ఇనిస్టిట్యూషనల్ కోటాలో 10 శాతం) ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ఏదైనా కేటగిరీలో సీట్లు నిండకపోయినా, ప్రవేశాలు జరిగాక ఖాళీ అయినా.. సదరు కాలేజీలు వాటిని ఎన్నారై కోటా కింద భర్తీ చేసుకోవచ్చు. అందువల్ల బీ కేటగిరీ సీట్లను ‘బ్లాక్’ చేసి, ఎన్నారై కేటగిరీగా మార్చుకునేలా కాలేజీలు పన్నాగం పన్నాయి. ఆ సీట్లను భారీ రేటుకు అమ్ముకునేలా ప్లాన్ వేశాయి.
గవర్నర్ జోక్యంతో హడావుడి
పీజీ వైద్య సీట్ల బ్లాకింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవడం, కీలక ప్రజాప్రతినిధుల కళాశాలల్లోనూ ఈ వ్యవహారం జరిగిందన్న ప్రచారంతో.. ఈ దందాపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) కూడా ఈ బ్లాక్ దందాపై ఆరా తీసింది. మరోవైపు ఈ అంశాన్ని సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దందా వ్యవహారాన్ని ఎలాగోలా కప్పిపెట్టాలని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ విద్యార్థులకు బెదిరింపులు?
వైద్య విద్య పీజీ సీటు బ్లాకింగ్ కోసం కొందరు విద్యార్థులను ప్రలోభపెట్టి, చేర్పించుకున్న కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఏజెన్సీలు.. ఇప్పుడా విద్యార్థులను భయపెడుతున్నట్టు సమాచారం. ఏమీ తెలియదని చెప్పాలని, ఎవరు దరఖాస్తు చేశారో కూడా తెలియదని చెప్పాలని వారిని బెదిరిస్తున్నట్టు తెలిసింది. తద్వారా బ్లాక్ దందా అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
వీటికి బదులేవి
► రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు, కాళోజీ యూనివర్సిటీ అధికారులు చెప్తున్న దానికి, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
► ప్రస్తుతం మేనేజ్‌మెంట్ సీట్ల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎన్ని సీట్లు మిగులుతాయో, ఎందరు మానేస్తారో, ఎన్నిసీట్లు ఎన్నారై కేటగిరీగా మారుతాయో తెలియదని.. అలాంటిది సీట్ల బ్లాకింగ్ జరగలేదని ఇప్పుడే ఎలా చెప్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయి.
► అధికారులు ఒకవైపు కేవలం అనుమానం అంటున్నారని.. మరోవైపు విచారణ అంటూ హడావుడి చేయడం ఏమిటని విద్యార్థులు పేర్కొంటున్నారు.
► ఏడుగురు నకిలీ అభ్యర్థులు ఇతరుల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశారని చెప్తున్నారని.. టెన్త్ సర్టిఫికెట్ నుంచి ఆధార్ దాకా అన్ని సర్టిఫికెట్లు, ఫొటోలు,
సంతకాలు అన్నీ ఎలా తేగలరని ప్రశ్నిస్తున్నారు.
► సొంత రాష్ట్రాల్లోనే కన్వీనర్ కోటా సీటు దొరికే స్థాయిలో ర్యాంకు వచ్చినవారు.. ఇక్కడ మేనేజ్‌మెంట్ కోటాలో దరఖాస్తు చేసినప్పుడు.. ఆయా విద్యార్థుల రాష్ట్రాల్లో వెంటనే ఎందుకు విచారణ చేయలేదని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment