సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్‌సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది.
నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్‌సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు.
వెయ్యి మందిలో ఒక్కరిలోనే...
డెంగీ ఎన్‌సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్‌తో బ్రెయిన్‌లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు.
వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్‌గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్‌సెఫలైటిస్‌తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment