మెడికల్‌ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావుడా? | Candidates are angry about the procedure followed by the state govt in medical PG admissions | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావుడా?

Published Sun, Oct 6 2024 5:06 AM | Last Updated on Sun, Oct 6 2024 5:06 AM

Candidates are angry about the procedure followed by the state govt in medical PG admissions

ఇప్పటికీ విడుదల కాని ఆల్‌ ఇండియా కోటా షెడ్యూల్‌ 

అయినా రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగింపు 

ఆలస్య రుసుము పేరిట భారీగా పెనాల్టీ 

ఇదేమి విధానమంటూ మండిపడుతున్న అభ్యర్థులు  

సాక్షి, అమరావతి: ఈ సంవత్సరం మెడికల్‌ పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా రాకుండానే రాష్ట్రంలో హడావుడిగా రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగించేశారని,, పైగా, ఆలస్య రుసుము పేరిట భారీగా భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మెడికల్‌ పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల చేశారు. ముందుగా ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రావాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కోటాలో ప్రవేశాలు ప్రారంభించాలి. 

అయితే, ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు ఇంకా షెడ్యూల్‌ రాలేదు. మరోపక్క ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపును సవాల్‌ చేస్తూ సరీ్వస్‌ ఎంబీబీఎస్‌ వైద్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా ఆరోగ్య విశ్వవిద్యాలయం గత నెల 27న రాష్ట్ర కోటాలో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. శుక్రవారంతో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు కూడా ముగిసింది. ఆలస్య రుసుముతో శనివారం నుంచి సోమవారం వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పైగా, ఆలస్య రుసుము కూడా సాధారణ ఫీజుకంటే  నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తోంది. 

ఏపీలో ఎంబీబీఎస్‌ చదివిన ఓసీ, బీసీ వైద్యులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము రూ.7,080 ఉంటే.. ఆలస్య రుసుము రూ. 27,080గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.5,900 సాధారణ రుసుము ఉంటే ఆలస్య రుసుము రూ.25,900 చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలోనే ఇలా ఆలస్య రుసుముల పేరిట భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ఆల్‌ ఇండియా కోటా షెడ్యూల్‌ రాకపోవడంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇంకా అడ్మిషన్లు ప్రారంంభించలేదని, ఏపీలో మాత్రం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియనే ముగిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్వినర్‌ కోటా అడ్మిషన్లను హడావుడిగా ముగిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై రిజి్రస్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డిని వివరణ కోరగా.. ఏటా కొందరు అభ్యర్థులు దరఖాస్తుల గడువు ముగిశాక కోర్టులకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకుంటున్నారని, దాని ప్రభావం కౌన్సెలింగ్‌పై పడుతోందని చెప్పారు. అందువల్లే ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వెరిఫికేషన్‌ చేసి పెట్టుకుంటామని, ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌  మొదలయ్యాకే రాష్ట్ర కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement