14 నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ | NEET UG counseling from 14th | Sakshi
Sakshi News home page

14 నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌

Published Sat, Aug 3 2024 4:51 AM | Last Updated on Sat, Aug 3 2024 4:51 AM

NEET UG counseling from 14th

తొలుత ఆల్‌ ఇండియా కోటా 

తర్వాత రాష్ట్ర కౌన్సెలింగ్‌ ప్రారంభం 

రాష్ట్రంలో 6,209 ఎంబీబీఎస్‌ సీట్లు 

గతేడాది ఎయిమ్స్‌ ఢిల్లీలో జనరల్‌ కేటగిరీలో 56వ ర్యాంకు వరకు సీట్లు 

ఎయిమ్స్‌ – మంగళగిరిలో 1,606 ర్యాంకుతో క్లోజ్‌ 

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్‌ తాత్కాలిక షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ నిర్వహణకు డాక్టర్‌వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నీట్‌ యూజీ–2024లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలతో సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

తొలుత అఖిల భారత కోటా.. 
నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలుత అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌ వంటి జాతీయ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌కు చెందిన ఎంసీసీ ఏఐక్యూ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులయినా ఏఐక్యూలో సీట్లు పొందొచ్చు.   

రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ ఇలా.. 
తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌ ముగిశాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలలతోపాటు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఏఐక్యూలో, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తారు. 

రాష్ట్రంలో అన్ని రకాల కళాశాలల్లో 6,209 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, పద్మావతి వైద్య కళాశాలల్లోని 460 ఎంబీబీఎస్‌ సీట్లను ఏఐక్యూలో భర్తీ చేస్తారు. కన్వినర్, బీ, సీ కేటగిరీలకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ చేపడతారు. రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నీట్‌ ఆల్‌ ఇండియా ర్యాంకు ఆధారంగా మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. ఆ మెరిట్‌ జాబితా ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు.  

అంతా ఆన్‌లైన్‌లోనే 
ఇక ఏఐక్యూ, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ అంతా కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం, రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ల కేటాయింపు, కావాల్సిన కళాశాలల ఆప్షన్‌ల నమోదు, సీట్లు కేటాయింపు ఇలా కౌన్సెలింగ్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌  http:// drysruhs.edu.in/ index.html  లో ప్రకటిస్తుంది.  


నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు
» నీట్‌ యూజీ– 2024 ర్యాంక్‌ కార్డ్‌  
»  పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) 
» 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
» ఇంటర్మీడియెట్‌ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు 
» ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (ఇంటర్‌/10+2)  
»  కుల ధ్రువీకరణ  
»  ఆధార్‌ కార్డు 
»  దివ్యాంగ ధ్రువీకరణ పత్రం  
» విద్యార్థి తాజా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు 

అర్హులు 43,788 మంది 
నీట్‌ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితా విడుదల 
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీజీహెచ్‌ఎస్‌) నుంచి అందిన నీట్‌ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు పేర్కొంది. 

715 స్కోర్‌ సాధించి జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్‌తో కె.సందీప్‌ చౌదరి తొలి స్థానంలో నిలవగా.. అదే స్కోర్‌తో గట్టు భానుతేజ సాయి(50), పి.పవన్‌కుమార్‌ రెడ్డి (81), వి.ముఖేష్‌ చౌదరి(150) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా రాష్ట్రం నుంచి 61 మంది 700, ఆపైన స్కోర్‌ సాధించారు. 2,349 మంది 600, ఆపైన స్కోర్‌ చేశారు. ఈ జాబితాను మెరిట్‌ లిస్ట్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement