100 డెంటల్ సీట్లు మిగిలాయ్
పెద్దగా ఆసక్తి చూపనిమెడికల్ విద్యార్థులు
ప్రభుత్వ కాలేజీల్లో పది, ప్రైవేటు కాలేజీల్లో 90 సీట్లు భర్తీకాని వైనం
‘నీట్’ పరీక్షతో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌కు పెరిగిన అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా డెంటల్ సీట్లు మాత్రం పూర్తిగా భర్తీ కాలేదు. ఇంకా 100 సీట్లు మిగిలే ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారు లు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు 2 కౌన్సెలింగ్‌లు, ప్రభుత్వం 5 కౌన్సెలింగ్‌లు నిర్వహించినా డెంటల్ సీట్లు భారీగా మిగిలాయి. ఎంబీబీఎస్‌లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి కనబర్చారు. ప్రభుత్వం లో కాకుంటే ప్రైవేటు బీ కేటగిరీ, అందులో సీటు రాకుంటే ఎన్‌ఆర్‌ఐ కోటాలో రూ.కోట్లు చెల్లించి ఎంబీబీఎస్ సీటు పొందేందుకే ప్రయత్నించారు.
‘నీట్’తో ఇతర రాష్ట్రాల్లో అవకాశం..
రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రభుత్వ డెంటల్ కాలేజీ హైదరాబాద్‌లో ఉంది. అందులో 100 డెంటల్ సీట్లున్నాయి. వీటిలో తెలంగాణకు 36 సీట్లు కేటాయిం చగా, ఆ సీట్లలో 10 మిగిలిపోయాయి. 10 ప్రైవేటు డెంటల్ మెడికల్ కాలేజీల్లో మొత్తం వెయ్యి సీట్లున్నా యి. వాటిల్లోనూ 90 సీట్లు మిగిలిపోయాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ‘నీట్’ ప్రవేశ పరీక్ష నిర్వహించినందున తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ రాకుంటే ఇతర రాష్ట్రాల్లో డొనేషన్లు చెల్లించి సీట్లు పొందడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
15 తర్వాత ఆయుష్ సీట్లకు కౌన్సెలింగ్..
రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి సీట్లకు ఈ నెల 15 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్‌లైన్లో నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామన్నారు.