సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం : హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేసేలా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులు తెలంగాణలోనే స్థానికేతరులుగా మారే అవకాశముందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపీ నాథ్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంటర్, ఎంబీబీఎస్ కోర్సులు ఇతర రాష్ట్రాల్లో చదివే తెలంగాణ విద్యార్థులు సొంత రాష్ట్రంలోనే నాన్ లోకల్‌గా మారే ప్రమాదముందని చెప్పారు.
పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున పార్లమెంటు చట్టం ప్రకారం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘లోకల్’అంశంపై పాత పద్ధతిని కొనసాగించిందన్నారు. కానీ తెలంగాణలో ఏర్పడిన కొత్త మెడికల్ కాలేజీల్లో వందశాతం సీట్లు స్థానికులకే దక్కేలా నిబంధనలు మార్చి న్యాయం చేశామని చెప్పారు. ఉమ్మడి రాజధాని అంశంలో పదేళ్ల గడువు ముగిసినా, ప్రస్తుత ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేశాల్లో 95 శాతం సీట్లు స్థానికులకే ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావొస్తున్నా స్థానికతపై సరైన విధానం లేదని, జీఓ 30ని వెంటనే సవరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. స్థానికత అంశంపై మెడికల్ కాలేజీలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగకుండా సలహాలు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నీట్‌కు ముందు 9వ తరగతి నుంచి నాలుగేళ్లు కచి్చతంగా తెలంగాణలో చదివితేనే స్థానికత వర్తిస్తుందనే నిబంధన తెచి్చందన్నారు. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల తరహాలో స్థానికత విధానాన్ని అమలు చేసినా సరిపోతుందని చెప్పారు.
స్వచ్ఛదనం.. పచ్చదనానికి నిధులేవి..?
ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం–పచ్చదనం’కార్యక్రమానికి నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నిధుల లేమితో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎనిమిది నెలలుగా పంచాయతీలకు నయా పైసా రాలేదని, కేంద్రం ఇచి్చన రూ.2,100 కోట్ల నిధులను ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment