మాజీమంత్రి హరీశ్‌రావు
తెలంగాణ విద్యార్థులకు నష్టం చేస్తే ఊరుకోం
హరీశ్‌ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్న జీవో 33పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయ పోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర విద్యార్థుల స్థానికత కోసం ప్రభుత్వం కొత్తగా సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో అత్యున్నత కమిటీ వేసి వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసానిచ్చారు. జీవో 33 వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై గురువా రం హరీశ్‌రావును ఆయన నివాసంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వివరించారు. జీవో 33 నిబంధనల మేరకు తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికేతరులుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఏపీలో చదవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానికేతరులుగా మారుతున్నారన్నారు. తమ పిల్లలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు హరీశ్‌రావును కోరారు.
పంచాయతీలపై ఉన్నమాట అంటే ఉలుకెందుకు..?
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తా ము ఆధారాలు, గణాంకాలతో చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడు తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ అబ ద్ధాలు చెబుతోందంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు నయాపైసా చెల్లించలేదంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ.2100 కోట్లను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించారని పేర్కొన్నారు. రెండు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు, ఎనిమిది నెలలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదని, ఈ వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment