సాక్షి, హైదరాబాద్: వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2020–21కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) దరఖాస్తు విడుదల చేయనుంది. దరఖాస్తులను ఎన్‌టీఏ.ఏసీ.ఇన్, ఎన్‌టీఏనీట్.ఎన్‌ఐసీ.ఇన్‌ల్లో పొందవచ్చు. దరఖాస్తులో ప్రత్యక్ష ఫొటోతోపాటు అదనపు పత్రాలూ జోడించాల్సి ఉంటుందని, ఆ మేరకు మార్పులు చేసే అవకాశాలున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఎయిమ్స్ ప్రవేశాలూ నీట్ ద్వారానే...
2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్‌మర్ మెడికల్ కాలేజీ ల్లోని ఎంబీబీఎస్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 532 మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 914 ఆయుష్ కాలేజీల్లోని 52,720 సీట్లకు, 313 బీడీఎస్ కాలేజీల్లోని 26,949 సీట్లకు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లకు, రెండు జిప్‌మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లకు నీట్ ద్వారానే భర్తీ జరుగుతుంది. అన్ని రాష్రాల కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు.
ఆ మేరకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటిస్తుంది. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను 100 శాతం నీట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్‌ఆర్‌ఐ, బీ కేటగిరీ సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. గతేడాది రాష్ట్రం నుంచి 48,996 మంది నీట్ రాయగా, 33,044 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
నేటి నుంచి ‘నీట్’ దరఖాస్తులు
Published Mon, Dec 2 2019 3:01 AM | Last Updated on Mon, Dec 2 2019 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment