ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్‌ | Notification for ownership quota in MBBS and BDS admissions | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్‌

Published Thu, Aug 15 2024 5:47 AM | Last Updated on Thu, Aug 15 2024 5:47 AM

Notification for ownership quota in MBBS and BDS admissions

ఈనెల 21 వరకూ దరఖాస్తులకు అవకాశం 

ఆలస్య రుసుముతో 21 నుంచి 23 వరకూ వీలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల యాజమాన్య కోటా.. గత ఏడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఎంబీబీఎస్‌.. స్వీమ్స్‌లో ఎంబీబీఎస్‌ సీట్ల ఎన్‌ఆర్‌ఐ కోటాలో ప్రవేశాల కోసం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. నీట్‌ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 

ఇందుకు ఈనెల 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు విధించారు. అలాగే, శుక్రవారం (16వ తేదీ) సా.7 గంటల నుంచి ఆదివారం (18వ తేదీ) రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉండదని.. ఈ సమయంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని వర్సిటీ వెల్లడించింది. ఈ వ్యవధిలో కన్వీనర్‌ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సర్వర్లు మెయింటెనెన్స్‌లో ఉండడంవల్ల ఈ అంతరాయం ఉంటుందని సమాచారం. 

యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు సమయంలో విద్యార్థులు రూ.10,620ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.30,620ల ఆలస్య రుసుముతో 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ సా.6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నియమ నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168.. సాంకేతిక సమస్యలపై 9000780707 నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిజి్రస్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు.   

దళారుల మాటలు నమ్మొద్దు.. 
నీట్‌ యూజీ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా నియమ నిబంధనలకు లోబడి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని.. తల్లిదండ్రులు, విద్యార్థులు  దళారుల మాయమాటలు నమ్మొద్దని రాధికారెడ్డి సూచించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ 225.. ఎన్‌ఆర్‌ఐ కోటా 95 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. 

ఈ సీట్లను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచితంగా అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి0ది. అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కి ఎంబీబీఎస్‌ సీట్లను అమ్మకానికి పెట్టారు. మరోవైపు..  స్విమ్స్‌లో 23, ఎన్‌ఆర్‌ఐ–ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లో 1,078 బీ–కేటగిరి, 472 ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. దంత వైద్య కళాశాలల్లో 489 బీ–కేటగిరి, 211 ఎన్‌ఆర్‌ఐ బీడీఎస్‌ సీట్లున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement