‘ముంపు’లో మాయ..! | drought in quality works in caved areas | Sakshi
Sakshi News home page

‘ముంపు’లో మాయ..!

Published Mon, Aug 11 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

drought in quality works in caved areas

భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఇంజనీరింగ్ శాఖల పరిధిలో అయితే పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. భద్రాచలం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

 పనుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఓ కాంట్రాక్టర్ ఇక్కడి అధికారులు చేస్తున్న నిర్వాకంపై సమగ్ర సమాచారంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ముంపులో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. 2013 జనవరి నుంచి 2014 మే వరకు భద్రాచలం ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో జరిగిన పనుల బాగోతంపై ఓ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.

 ప్రధానంగా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు సదరు కాంట్రాక్టర్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటంతో దీనిపై మిగతా కాంట్రాక్టర్‌లు తర్జన భర్జన పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రస్తుతం భద్రాచలం ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలోని జరిగిన పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాతే బిల్లులు చెల్లించాలని ఆర్‌అండ్‌బీ సీఈ పీఐవో అధికారులకు సూచించారు. దీంతో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది.

ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా ఆ శాఖ ఎస్‌ఈ చింతూరు సబ్ డివిజన్‌లోని పనులను పరిశీలించి వెళ్లారు. ఈ నిర్వాకంతో చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లు రాని పరిస్థితి ఏర్పడిందని మిగతా కాంట్రాక్టర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాల్లో చేసిన పనులకు ఈ నెలాఖరు నాటికి బిల్లులు రాకపోతే అవి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతున్నందున ఇబ్బందులు తప్పవని పనులు సవ్యంగా చేసిన కొంతమంది కాంట్రాక్టర్‌లు ఆందోళన చెందుతున్నారు. కాగా, విచారణ పూర్తి అయితే ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఇక్కడి ఉద్యోగుల్లో నెలకొంది. విజిలెన్స్ అధికారులు విచారణకు వస్తున్నారని తెలియటంతో అసంపూర్తిగా వదిలేసిన పనులను సదరు కాంట్రాక్టర్‌లు హడావిడిగా పూర్తి చేస్తున్నారు.

అసలే నాణ్యత లేకుండా పనులు జరిగాయని ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్ అధికారుల కళ్లు గప్పేందుకు చేసిన పైపై పూతలు ఎన్ని రోజులు ఉంటాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఇదే రీతిన కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు విచారణ తరువాత దిగువ శ్రేణి ఉద్యోగులకు అలవెన్స్‌లలో కొతపెట్టారు. కానీ ఈ సారి పనులు చేయకుండానే ఎంబీ రికార్డులు చేసిన ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

 మిగతా శాఖల్లోనూ ఇదే తీరు..
 ఈ నెలాఖరు నాటికి ముంపు మండలాల్లోని పనులన్నీ పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఒక వేళ పనులు మిగిలినట్లైతే వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే బిల్లులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో కాంట్రాక్టర్‌లు హడావిడిగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దీంతో ఆ పనుల్లో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఎటువంటి తనిఖీలు ఉండటం లేదు.

దీంతో కింద స్థాయిలోని పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్‌లతో మిలాఖత్ అయి పనులను ‘మమ’ అనిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రత్యేక ప్రాజెక్టు కింద చేపడుతున్న రహదారుల నిర్మాణాల్లోనూ కూలీలకు బదులుగా పొక్లైన్‌లతోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. ముంపులో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement