భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయించిన ముంపు మండలాలు ప్రస్తుతం ఏ ప్రభుత్వం కింద ఉన్నాయనే దానిపై అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. సోమవారం భద్రాచలంలో చోటుచేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారామ్‌నాయక్ చేసిన ప్రారంభోత్సవాలు ఏ ప్రభుత్వం కిందకు వస్తాయో అధికారులు సైతం చెప్పలే ని పరిస్థితి. ఉన్నతాధికారుల్లోనే ఈ సందిగ్ధత ఉంటే ముంపు ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది.
భద్రాచలం మండలం ఎటపాక వద్ద రూ.3.80 కోట్లతో యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎంపీ సీతారాంనాయక్ చేతులు మీదగా ప్రారంభించేందుకు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో డి. దివ్య తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ముందుగా అంతా కొబ్బరికాయలు కొట్టారు. ఆ తరువాత ఎంపీ సీతారామ్‌నాయక్ శిలాఫలాకానికి తెరతీసి ప్రారంభించారు.
ప్రత్యేక హంగులు సంతరించుకున్న వైటీసీ సెంటర్‌పై అప్పటి వరకూ చర్చించుకున్న వారంతా, ఒక్క సారిగా శిలాఫలకంపై దృష్టి కేంద్రీకరించారు. వైటీసీ కేంద్రం ఏ ప్రభుత్వం పరిధిలోకి వస్తుందనేది ఆ శిలాఫలకంపై లేదు. కానీ దాన్ని నిశితంగా పరిశిలించిన వారికి ఒక గమ్మత్తై అంశం కనిపించింది. శిలాఫలకం పైన తెలంగాణ ప్రభుత్వం అని రాయించారు. కింద ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ పేర్లను రాశారు. కానీ పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనేది, కింద ఉన్న పీవో, జిల్లా కలెక్టర్ల పేర్లను కనిపించకుండా నల్లటిరంగుతో పూత వేశారు.
ముంపుగా ప్రకటించిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ తీసుకొచ్చింది. ఇది జూన్ 2 నుంచే అమల్లోకి వచ్చింది. కానీ అధికారుల్లో దీనిపై ఇంకా అయోమయం ఉందనడానికి ఈ శిలాఫలకంపై పూసిన పూతలే నిదర్శనమని పలువురు చర్చించుకున్నారు.
ఎందుకిలా చేశారని సందరు ఇంజనీరింగ్ అధికారులను సాక్షి ప్రశ్నిస్తే...ఎంపీ గారు ప్రారంభోత్సవానికి తొందర చేశారని సమాధానం ఇచ్చారు. భద్రాచలం జడ్పీటీసీ సభ్యుడైన జి. రవికుమార్ ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు. ఎటపాక ఎంపీటీసీ పరిస్థితి కూడా అదే. కానీ శిలాఫలకంపై వీరిద్దరి పేర్లను రాయించటం కూడా చర్చనీయాంశంగా మారింది.
30లోపు ముగించేయండి
సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వమే పాలన వ్యవహారాలను చూస్తుందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. దీనిలో భాగంగానే అప్పగింతలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ముంపు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గ్రామసభలను నిర్వహించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం ఇక్కడి అధికారులకు మరో లేఖ అందింది. ఈ నెల 30వ తేదీలోపు ఈ తతంగాన్ని పూర్తి చేయాలని అందులో ఉంది.
ఆ తరువాత ఫైనల్ గెజిట్ విడుదలవుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే సరిగ్గా ఐదు రోజుల్లో ఏడు మండలాలపై ఏపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో హక్కు సంక్రమిస్తుందన్న మాట. ఈలోగా చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు సర్వత్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారులు సైతం ప్రజానీకాన్ని గందరగోళానికి గురిచేస్తుండగం గమనార్హం.
ముంపు మండలాలపై కొరవడిన స్పష్టత
Published Tue, Aug 26 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement