Ajmeera Sitaram Naik
-
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
ఎన్ని కోట్లు తీసుకుని పార్టీ మారారు?
ఇల్లెందు: కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, రేణుకాచౌదరి, రేవంత్‌రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారారో చెప్పాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ప్రశ్నించారు. సోమవారం ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు గిరిజన ఎమ్మెల్యేలను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ది కుటుంబపాలన అంటూ తరచూ విమర్శిస్తున్నారని, మరి మోతీలాల్ నుంచి రాహుల్ వరకు కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసన్నారు. బస్సుయాత్ర పేరుతో ఇల్లెందులో సభ నిర్వహించి చోటా మోటా నేతలంగా ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్ చేసి మాట్లాడడం సరైంది కాదన్నారు. ఇల్లెందు నియోజకవర్గం అనేక ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అందుకే కనకయ్య టీఆర్ఎస్లో చేరి ఈ ప్రాంత అభివృద్ధికి కారకుడయ్యాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఎవరూ డబ్బుకు అమ్ముడు పోలేదన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవిస్తారని, కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్న చరిత్ర ఉన్న వారు కూడా విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే డిశంబర్ నాటికి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఉత్తమ్‌కుమార్‌కు లేదన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తొలిసారి గెలిచిన తనపై కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు పేలారని, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, వనమా వెంకటేశ్వరరావు వంటి వారంతా గతంలో పార్టీలు మారలేదా అని నిలదీశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, టేకులపల్లి, కామేపల్లి జడ్పీటీసీ సభ్యులు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబుయాదవ్, మూల మధుకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, నాయకులు సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం, సయ్యద్ జానీపాషా, అక్కిరాజు గణేష్ పాల్గొన్నారు. -
ముంపు మండలాలపై కొరవడిన స్పష్టత
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయించిన ముంపు మండలాలు ప్రస్తుతం ఏ ప్రభుత్వం కింద ఉన్నాయనే దానిపై అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. సోమవారం భద్రాచలంలో చోటుచేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారామ్‌నాయక్ చేసిన ప్రారంభోత్సవాలు ఏ ప్రభుత్వం కిందకు వస్తాయో అధికారులు సైతం చెప్పలే ని పరిస్థితి. ఉన్నతాధికారుల్లోనే ఈ సందిగ్ధత ఉంటే ముంపు ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలం ఎటపాక వద్ద రూ.3.80 కోట్లతో యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎంపీ సీతారాంనాయక్ చేతులు మీదగా ప్రారంభించేందుకు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో డి. దివ్య తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ముందుగా అంతా కొబ్బరికాయలు కొట్టారు. ఆ తరువాత ఎంపీ సీతారామ్‌నాయక్ శిలాఫలాకానికి తెరతీసి ప్రారంభించారు. ప్రత్యేక హంగులు సంతరించుకున్న వైటీసీ సెంటర్‌పై అప్పటి వరకూ చర్చించుకున్న వారంతా, ఒక్క సారిగా శిలాఫలకంపై దృష్టి కేంద్రీకరించారు. వైటీసీ కేంద్రం ఏ ప్రభుత్వం పరిధిలోకి వస్తుందనేది ఆ శిలాఫలకంపై లేదు. కానీ దాన్ని నిశితంగా పరిశిలించిన వారికి ఒక గమ్మత్తై అంశం కనిపించింది. శిలాఫలకం పైన తెలంగాణ ప్రభుత్వం అని రాయించారు. కింద ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ పేర్లను రాశారు. కానీ పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనేది, కింద ఉన్న పీవో, జిల్లా కలెక్టర్ల పేర్లను కనిపించకుండా నల్లటిరంగుతో పూత వేశారు. ముంపుగా ప్రకటించిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ తీసుకొచ్చింది. ఇది జూన్ 2 నుంచే అమల్లోకి వచ్చింది. కానీ అధికారుల్లో దీనిపై ఇంకా అయోమయం ఉందనడానికి ఈ శిలాఫలకంపై పూసిన పూతలే నిదర్శనమని పలువురు చర్చించుకున్నారు. ఎందుకిలా చేశారని సందరు ఇంజనీరింగ్ అధికారులను సాక్షి ప్రశ్నిస్తే...ఎంపీ గారు ప్రారంభోత్సవానికి తొందర చేశారని సమాధానం ఇచ్చారు. భద్రాచలం జడ్పీటీసీ సభ్యుడైన జి. రవికుమార్ ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు. ఎటపాక ఎంపీటీసీ పరిస్థితి కూడా అదే. కానీ శిలాఫలకంపై వీరిద్దరి పేర్లను రాయించటం కూడా చర్చనీయాంశంగా మారింది. 30లోపు ముగించేయండి సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వమే పాలన వ్యవహారాలను చూస్తుందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. దీనిలో భాగంగానే అప్పగింతలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ముంపు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గ్రామసభలను నిర్వహించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం ఇక్కడి అధికారులకు మరో లేఖ అందింది. ఈ నెల 30వ తేదీలోపు ఈ తతంగాన్ని పూర్తి చేయాలని అందులో ఉంది. ఆ తరువాత ఫైనల్ గెజిట్ విడుదలవుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే సరిగ్గా ఐదు రోజుల్లో ఏడు మండలాలపై ఏపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో హక్కు సంక్రమిస్తుందన్న మాట. ఈలోగా చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు సర్వత్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారులు సైతం ప్రజానీకాన్ని గందరగోళానికి గురిచేస్తుండగం గమనార్హం.