ఖమ్మం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ప్రక్రియ అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 136 హ్యాబిటేషన్లను సీమాంధ్రలో కలిపారు. జిల్లాతో అనుబంధం ఉన్న ప్రజలను విడదీశారు. అక్కడ ఉన్న పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనెల 12వ తేదీన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. గత విద్యాసంవత్సరం పాఠశాలల ముగింపు రోజు ఒక రాష్ట్రంలో..పాఠశాలలు తెరిచేలోపు మరో రాష్ట్రంలో ముంపు ప్రాంత విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి.
ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు సీమాంధ్రలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరికి వేతనాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వం వేతనాలు ఇస్తుందే సరే ఎవరి అజమాయిషీలో పనిచేయాలనే సందిగ్ధత ఆ ప్రాంత ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో నెలకొంది. తాము ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తామో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందించే ఉచిత పుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, వారిపై పర్యవేక్షణ, బోధించే పాఠ్యాంశాలు, ఏ రాష్ట్ర సిలబస్ బోధించాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అసలు ఉపాధ్యాయులు సీమాంధ్రుకు వెళ్లేందుకు ఒప్పుకుంటారా?, ఒప్పుకుంటే వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలి? గత సంవత్సరం మేలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో ఇతర మండలాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవర్ లేక ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ పనిచేయాలి? వారికి వేతనాలు ఎవరు ఇవ్వాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపుపై చిక్కులు
జూన్ 2తేదీ తర్వాత ఏ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ ప్రభుత్వం ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలి. జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 230 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు సీమాంధ్రలో కలుస్తున్నాయి. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో పనిచేసే 569 మంది ఉపాధ్యాయులు, ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వాటిలో పనిచేసే సుమారు 110 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు సీమాంధ్రలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే జూన్ 2వ తేదీ నుండి వారి వేతనాలు సీమాంధ్ర ప్రభుత్వం ఖజనా నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఆయా పాఠశాలలు, కళాశాలల విభజన, వాటి కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
సీమాంధ్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేటట్టయితే..ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేస్తే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు ఏలా బిల్లులు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ట్రెజరీ బూర్గంపాడులో ఉంది. భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల ట్రెజరీ భద్రాచలంలో ఉంది. ఈ ట్రెజరీలు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ట్రెజరీలు ఉన్నప్పుడు ఏపీలో ఎలా వేతనాలు చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతాలు, ఉద్యోగుల సర్దుబాట్లు, పాఠశాలలు తదితర అంశాలన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయి..? అప్పటి వరకు వేతనాలు ఆగుతాయా? అనే ప్రశ్నలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విద్యార్థుల లోకల్ ఏరియాపై సందిగ్ధత
ఇప్పటి వరకు తెలంగాణలో చదివిన ముంపు ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పుడు సీమాంధ్రలో కలవడంతో వారి లోకల్ ఏరియా ఏ ప్రాంతానికి వస్తుందో.. అనే సందిగ్ధత నెలకొంది.
జూన్ 2 తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సముచిత స్థానం కల్పిస్తారో? లేదోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్కడి ప్రభుత్వం వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ సిలబస్ బోధించాలా? ఆంధ్ర ప్రభుత్వందా? అనే విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత లేదు.
జూన్ మొదటివారంలో చేపట్టే బడిబాట కార్యక్రమం కూడా ముంపు ప్రాంతాల్లో ఇంకా ప్రారంభంకాలేదు. ఇవన్నీ సమస్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయోనని ముంపు ప్రాంత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
‘ముంపు’ బడి
Published Wed, Jun 4 2014 1:16 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement