ఎల్.ఎన్.పేట : మండలంలోని జోగివలస గిరిజన ప్రాంతం లో ఏనుగులు తిష్ఠవేశాయి. పది పదిహేను రోజు లుగా వీటి సంచారంతో గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాణాపాయం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. జోగివలస, కొత్తజోగివలస, కారిగూడ, మెట్టుగూడ, గార్లపాడు, సరడాం సమీప ప్రాంతంలో ఏనుగులు చేరాయి.
కొత్తజోగివలసకు ఎగువన ఉన్న గుర్రాల మెట్టపైన నివాసం ఏర్పాటు చేసుకున్న ఏనుగులు చీకటి పడితే కొండదిగి గ్రామాలకు సమీపంలోకి వస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు సవర అనన్య, సవర యశో, సవర బాలరాజు, సవర దిలీప్‌కుమారు, సవర బాలయ్యలతో పాటు పలువురు చెబుతున్నారు. ఉదయానికే గుర్రాల మెట్టపైకి వెళ్లిపోతున్నాయని వివరించారు. నాలుగు ఏనుగులు గ్రామానికి సమీపంలో వచ్చి తిరుగుతున్నాయని, గ్రామంపై దాడి చేస్తాయోమోనని భయంగా ఉందని వాపోతున్నారు.
పంటలు ధ్వంసం
ఏనుగులు ఇప్పటికే వరిపంటలను నాశనం చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట పొలాల్లో తిరిగి తొక్కేయడం వల్ల వరి చేను బురదలో కలిసిపోయిందన్నారు. కళ్లాంలో వేసిన వరిచేను కుప్పలను కూడా లాగేసి విసిరేస్తున్నాయని చెప్పారు. జీడి, మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తున్నాయని, అరటి చెట్లను తొక్కేస్తున్నాయని రైతులు వాపోయారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించుకున్న కంది, పసుపు పంటలతో పాటు బొప్పాయి, అరటి చెట్లను ఏనుగులు ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. నిత్యం ఏనుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం స్పందించి పంటకు పరిహారం ఇవ్వాలని గిరిజన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తరమివేయాలి
సీతంపేట : ఆదివాసీలకు ఏళ్ల తరబడి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నాలుగు ఏనుగులను ఏజెన్సీ నుంచి తరమివేయాలని ఏపీ ఆదివాసీ చైతన్య సేవా సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సూర్యనారాయణ, విప్లవకుమర్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీతంపేట, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలన్నింటిని నాశనం చేస్తున్నాయన్నారు. పంట నష్టపోయిన వారికి పూర్తిగా పరిహారం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరిమివేసే ఏర్పాట్లు చేయాలని, పంటకు పరిహారం అందించాలని వారు కోరారు.
గిరిజన ప్రాంతంలో ఏనుగుల తిష్ఠ
Published Sat, Nov 15 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement