ఆర్కపల్లిలో బెల్టుషాపులకు డోర్ డెలీవరీ చేస్తున్న ఆటో
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రం లోని వైన్ షాపు యజమానులు మండల గ్రామాలు, గిరిజన తండాలలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులకు ట్రాలీ ఆటో ద్వారా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నందుకు వైన్‌షాపు యజమాన్యం బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం బాటిళ్లపై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలను తీసుకుంటున్నారు. వీరికి ఎక్సైజ్, సివిల్ పోలీసుల అండదండలు పుష్క లంగా ఉన్న ట్టు పలువురు గుసగుసలాడుతున్నారు. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లుపడుతుంది.
మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న శ్రీ బాలాజీ వైన్స్ యజమాన్యం షాపులో నుంచి రోజూ ట్రాలీ ఆటోలో మద్యం తీసుకుని మండల గ్రామాల్లోకి వెళ్లి అక్రమంగా వ్యాపారం చేస్తున్న బెల్టుషాపుల యజమానులకు క్వార్టర్ ఎమ్మార్పీ ధర కంటే రూ. 5 అధిక ధరలకు విక్రయిస్తారు. సదరు బెల్టుషాపుల యజమానులు ఒక్కో క్వార్టర్‌ను రూ. 10నుంచి రూ. 15ల అదనంగా విక్రయిస్తారు. దీంతో మందుబాబులు ఒక్కో క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ15 నుంచి రూ. 20లు అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదికన ఒక్కో ఫుల్‌బాటిల్‌పై మద్యం ప్రియులకు రూ. 100 వరకు చేతి సమురు వదులుతోంది.
ఫిర్యాదులకు జంకుతున్న వినియోగదారులు
అధిక ధరలకు మద్యం అమ్మకాలపై అనేకమార్లు వినియోగదారులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్ నెంబర్లు బెల్టుషాపుల యజమానులకు ఇవ్వడంతో గ్రామాల్లో తగాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదు చేయడానికి మద్యం ప్రియులు వెనకాడుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయంటూ ఎస్సై గిరీష్‌కుమార్ మండలంలోని నాగిళ్ల, ఇర్విన్, బ్రాహ్మణపల్లి, నర్సాయిపల్లి, కొల్కులపల్లి, తదితర గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం స్వాధీనపరుచుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గత నెలరోజులుగా దాడుల పరంపర కొనసాగించిన ఎస్సై గిరీష్‌కుమార్ వారం రోజులుగా మిన్నకుండడంలో అంతర్యమేమిటోనని మండల ప్రజలు, మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో దాడులు నిలిపివేసినట్లు సమాచారం.
యథేచ్ఛగా డోర్ డెలివరీ..
దీంతో వైన్‌షాపు యజమాన్యం డోర్ డెలీవరీకి తెరలేపడంతో గ్రామాల్లో అక్రమ బెల్టుషాపుల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయం ఆమనగల్లు ఎక్సైజ్ అధికారులకు తెలియదని అనుకంటే పప్పులో కాలేసినట్లే సుమా...మరి ఈ తతంగమంతా వారి కన్నుసన్నల్లోనే జరుగుతుండడంతో వారు జోక్యం చేసుకోవడం లేదు. జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు నడిచేది. మాడ్గుల మండలం రంగారెడ్డి జిల్లాలో కలిసిన తర్వాత బెల్టు షాపులకు మద్యం రవాణా, అధిక ధరలకు మద్యం విక్రయాలను పూర్తిగా కట్టడి చేశామని గొప్పలు చెప్పడం గమనార్హం.
బెల్టుషాపులకు అనుమతి లేదు
గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకు అనుమతిలేదు. అలాగే వైన్‌షాపు నుంచి మద్యం డోర్ డెలీవరీ చేయకూడదు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ, వాటికి మద్యం రవాణా చేయడం పూర్తిగా అక్రమం. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, ఎక్సైజ్ సీఐ,ఆమనగల్లు
Comments
Please login to add a commentAdd a comment