wine shop owner
-
సూసైడ్ నోట్: నా చావుకు వారే కారణం..!
సాక్షి, నర్సంపేట రూరల్ : ఎక్సైజ్ పోలీసులు, వైన్స్ యజమాని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జేబులో సూసైడ్ నోట్ లభించడంతో మృతదేహంతో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన ఊడ్గుల రాజమల్లు(52) వికలాంగుడు కావడంతో గౌడ వృత్తి చేయలేక కిరాణం షాపు అందులోనే బెల్టుషాపు నడిపిస్తున్నాడు. చెన్నారావుపేటలోని వైన్స్ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకునేవాడు. కోవిడ్ మొదలైనప్పుడు లాక్డౌన్ విధించగా, అధికారులు తనిఖీలు చేపట్టి రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్యాన్ని తిరిగి ఇప్పిస్తానని ఒకరు నమ్మబలికినట్లు తెలుస్తుండగా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమల్లు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమల్లు మృతదేహం అయితే ఆయన చొక్కా జేబులో సూసైట్ నోట్‌ను కుటుంబీకులు గుర్తించారు. నా చావుకు కారణం ఎక్సైజ్ ఎస్సై, సీఐ గారు మరియు చెన్నారావుపేట బ్రాండీ షాప్ యాజమాని కృష్ణారెడ్డి గారు కారణం. వీరి మధ్యల ఇబ్బంది పడ్డాను అని ఉండడంతో ఆయన మృతదేహాన్ని తీసుకుని నర్సంపేటలోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వేసి ధర్నాకు దిగారు. సుమారు ఐదుగంటల పాటు ధర్నా కొనసాగగా, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాజమల్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎస్సై, సీఐ, కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై నర్సంపేట ఎక్సైజ్ సీఐ శశికుమారిని వివరణ కోరగా లాక్డౌన్ సమయంలో రూ.2వేల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామే తప్ప ఆయనను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుపై పోలీసులతో పాటు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. -
మద్యం మత్తులో కొడవలితో వీరంగం
ఉప్పల్: రామంతాపూర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. యజమాని, వాచ్‌మన్‌పై కొడవలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉప్పల్ కళ్యాణపురి ప్రాంతానికి చెందిన పన్నాల అర్జున్ రామంతాపూర్‌లో రాజరాజేశ్వరి పేరు మీద వైన్స్ నడుపుతున్నాడు. రామంతాపూర్ ఇందిరానగర్‌కు చెందిన సురుగు చంద్రశేఖర్(23), అతని బావ కందుకరి సురేష్(23)తో కలిసి రామంతాపూర్‌లో రాజరాజేశ్వరి వైన్స్‌కు వచ్చారు. ఏటిఎం కార్డు ద్వారా మద్యం కొనుగోలు చేశారు. తరువాత ఏటీఎం కార్డును వాడి మరికొంత నగదును ఇవ్వాలని కౌంటర్లో ఉన్న వ్యక్తిని డిమాండ్ చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. కోపంతో వెళ్లిన చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టే కొడవలి తీసుకుని స్నేహితుడు సాయికిరణ్(22), సోదరుడు కార్తీక్(20)తో కలిసి మద్యం షాపు వద్దకు వచ్చారు. మద్యం మత్తులో అక్కడే ఉన్న వాచ్మెన్ బాలు నాయక్‌పై కత్తితో దాడికి తెగపడ్డారు. అడ్డువచ్చిన మద్యం షాపు యజమాని పన్నాల అర్జున్ ముఖంపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన చంద్రశేఖర్, సురేష్, కార్తీక్, సాయికూమార్‌లపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఇంటింటికీ మద్యం!
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రం లోని వైన్ షాపు యజమానులు మండల గ్రామాలు, గిరిజన తండాలలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులకు ట్రాలీ ఆటో ద్వారా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నందుకు వైన్‌షాపు యజమాన్యం బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం బాటిళ్లపై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలను తీసుకుంటున్నారు. వీరికి ఎక్సైజ్, సివిల్ పోలీసుల అండదండలు పుష్క లంగా ఉన్న ట్టు పలువురు గుసగుసలాడుతున్నారు. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లుపడుతుంది. మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న శ్రీ బాలాజీ వైన్స్ యజమాన్యం షాపులో నుంచి రోజూ ట్రాలీ ఆటోలో మద్యం తీసుకుని మండల గ్రామాల్లోకి వెళ్లి అక్రమంగా వ్యాపారం చేస్తున్న బెల్టుషాపుల యజమానులకు క్వార్టర్ ఎమ్మార్పీ ధర కంటే రూ. 5 అధిక ధరలకు విక్రయిస్తారు. సదరు బెల్టుషాపుల యజమానులు ఒక్కో క్వార్టర్‌ను రూ. 10నుంచి రూ. 15ల అదనంగా విక్రయిస్తారు. దీంతో మందుబాబులు ఒక్కో క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ15 నుంచి రూ. 20లు అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదికన ఒక్కో ఫుల్‌బాటిల్‌పై మద్యం ప్రియులకు రూ. 100 వరకు చేతి సమురు వదులుతోంది. ఫిర్యాదులకు జంకుతున్న వినియోగదారులు అధిక ధరలకు మద్యం అమ్మకాలపై అనేకమార్లు వినియోగదారులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్ నెంబర్లు బెల్టుషాపుల యజమానులకు ఇవ్వడంతో గ్రామాల్లో తగాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదు చేయడానికి మద్యం ప్రియులు వెనకాడుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయంటూ ఎస్సై గిరీష్‌కుమార్ మండలంలోని నాగిళ్ల, ఇర్విన్, బ్రాహ్మణపల్లి, నర్సాయిపల్లి, కొల్కులపల్లి, తదితర గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం స్వాధీనపరుచుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గత నెలరోజులుగా దాడుల పరంపర కొనసాగించిన ఎస్సై గిరీష్‌కుమార్ వారం రోజులుగా మిన్నకుండడంలో అంతర్యమేమిటోనని మండల ప్రజలు, మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో దాడులు నిలిపివేసినట్లు సమాచారం. యథేచ్ఛగా డోర్ డెలివరీ.. దీంతో వైన్‌షాపు యజమాన్యం డోర్ డెలీవరీకి తెరలేపడంతో గ్రామాల్లో అక్రమ బెల్టుషాపుల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయం ఆమనగల్లు ఎక్సైజ్ అధికారులకు తెలియదని అనుకంటే పప్పులో కాలేసినట్లే సుమా...మరి ఈ తతంగమంతా వారి కన్నుసన్నల్లోనే జరుగుతుండడంతో వారు జోక్యం చేసుకోవడం లేదు. జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు నడిచేది. మాడ్గుల మండలం రంగారెడ్డి జిల్లాలో కలిసిన తర్వాత బెల్టు షాపులకు మద్యం రవాణా, అధిక ధరలకు మద్యం విక్రయాలను పూర్తిగా కట్టడి చేశామని గొప్పలు చెప్పడం గమనార్హం. బెల్టుషాపులకు అనుమతి లేదు గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకు అనుమతిలేదు. అలాగే వైన్‌షాపు నుంచి మద్యం డోర్ డెలీవరీ చేయకూడదు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ, వాటికి మద్యం రవాణా చేయడం పూర్తిగా అక్రమం. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, ఎక్సైజ్ సీఐ,ఆమనగల్లు -
వైన్ షాపు యజమాని దాష్టీకం
మిర్యాలగూడ: మద్యం కొనుగోలు చేసిన అనంతరం తనకు రావాల్సిన డబ్బులు అడిగిన వ్యక్తిపై వైన్ షాపు యజమాని మద్యం బాటిల్‌తో దాడి చేయడంతో.. బాధితుడి తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు వైన్ షాప్ యజమాని తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. తిమ్మాపురంకు చెందిన రమావత్ మంతు(35) మద్యం కొనుగోలు చేయడానికి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్ షాపుకు వెళ్లాడు. రూ. 200 ఇచ్చి ఒక బీరు కొనుగోలు చేశాడు. అనంతరం తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన వైన్స్ యజమాని అదే బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.