రాజమల్లు వద్ద లభించిన సూసైడ్ నోట్
సాక్షి, నర్సంపేట రూరల్ : ఎక్సైజ్ పోలీసులు, వైన్స్ యజమాని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జేబులో సూసైడ్ నోట్ లభించడంతో మృతదేహంతో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన ఊడ్గుల రాజమల్లు(52) వికలాంగుడు కావడంతో గౌడ వృత్తి చేయలేక కిరాణం షాపు అందులోనే బెల్టుషాపు నడిపిస్తున్నాడు. చెన్నారావుపేటలోని వైన్స్ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకునేవాడు. కోవిడ్ మొదలైనప్పుడు లాక్‌డౌన్ విధించగా, అధికారులు తనిఖీలు చేపట్టి రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్యాన్ని తిరిగి ఇప్పిస్తానని ఒకరు నమ్మబలికినట్లు తెలుస్తుండగా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమల్లు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజమల్లు మృతదేహం
అయితే ఆయన చొక్కా జేబులో సూసైట్ నోట్‌ను కుటుంబీకులు గుర్తించారు. నా చావుకు కారణం ఎక్సైజ్ ఎస్సై, సీఐ గారు మరియు చెన్నారావుపేట బ్రాండీ షాప్ యాజమాని కృష్ణారెడ్డి గారు కారణం. వీరి మధ్యల ఇబ్బంది పడ్డాను అని ఉండడంతో ఆయన మృతదేహాన్ని తీసుకుని నర్సంపేటలోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వేసి ధర్నాకు దిగారు. సుమారు ఐదుగంటల పాటు ధర్నా కొనసాగగా, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాజమల్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎస్సై, సీఐ, కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై నర్సంపేట ఎక్సైజ్ సీఐ శశికుమారిని వివరణ కోరగా లాక్‌డౌన్ సమయంలో రూ.2వేల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామే తప్ప ఆయనను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుపై పోలీసులతో పాటు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment