- రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
Published Tue, Dec 27 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
రంపచోడవరం :
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ, ఆర్ అండ్ అర్ అధికారి ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను కలిసి నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న భూములకు రైతులు కోరుతున్నట్టు భూమికి భూమి గానీ, నష్టపరిహారం గానీ చెల్లించాలని డిమాండ్ చేశారు. డీ పట్టా భూములు కలిగిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమినే నమ్ముకున్న ఆ కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వకుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందేందుకు ముంపు గ్రామాల్లోని ప్రతి ఒక్కర్ని అర్హులుగా గుర్తించాలన్నారు. కొంత మంది పేర్లు సర్వే లిస్టులో లేవని, ఇలాంటి పొరపాట్లను సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరారు.
పోలవరం పునరావాస కాలనీల్లోని నిర్వాసితుల పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. అధికారులు నేరుగా అక్కడికి వెళ్లి చూస్తే వారు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. పునరావాస కాలనీకి వెళ్లిన గిరిజన రైతులకు ఇంకా భూమికి భూమి ఇవ్వలేదని చెప్పారు. కాలనీ ఒకచోట, ఎందుకూ పనికిరాని కొండలు ఒక చోట చూపారన్నారు. ఇచ్చిన ప్యాకేజీ సొమ్ముతో ఇప్పటి వరకూ గడిపారని, తక్షణం వారికి సాగుకు అనుకూలంగా ఉన్న భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో రైతులు కూలీగా మారి పనులు కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన చెందారు. భూమికి భూమి ఇచ్చేందుకు చేపట్టిన భూసేకరణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఎందుకు పనికిరాని కొండలను నిర్వాసితులకు ఇచ్చేందుకు సేకరించి, వాటిని చదును చేసే పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.
Advertisement