ఆర్డినెన్స్‌పై ఆగ్రహం | political leaders are wrath on polavaram ordinance | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌పై ఆగ్రహం

Published Sun, Jun 22 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

ఆర్డినెన్స్‌పై ఆగ్రహం

ఆర్డినెన్స్‌పై ఆగ్రహం

సాక్షి, ఖమ్మం: పోలవరం ముంపు ఆర్డినెన్స్‌న్‌పై ప్రజాత్రినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ఏజెన్సీలోని ఆదివాసీలు, వారి సంస్కృతి సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేలా వ్యవహరించిన కేంద్రం తీరును ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రెండేళ్ల తర్వాత నిర్వహించిన ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఇందుకు వేదికైంది. ఈ ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని, డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించారు.
 
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలకమండలి సమావేశం రెండేళ్ల తర్వాత శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధ్యక్షత వహించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. తెలంగాణ అమరులకు ముందుగా సమావేశంలో రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రారంభమైన సమావేశంలో సభ్యులందరూ ఒక్కొక్కరుగా పోలవరం ఆర్డినెన్స్‌పై ఏకగ్రీవ తీర్మానం చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
 
ఏజెన్సీలో ఆదివాసీలను ముంచే ఈ ఆర్డినెన్స్‌తో వారికి తీవ్ర నష్టం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌పై తీర్మానం చేసిన తర్వాతనే ఎజెండా అంశాల్లోకి వెళ్లాలని వారు పట్టుబట్టడంతో దీనిపైనే గంటపాటు సమావేశంలో చర్చ జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రవేశపెట్టిన పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ, ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలైన పీసా, 1/70 చట్టాలను అమలు చేయాలనే తీర్మానాలను  సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
 
ఆదివాసీల బాధేంటో మాకు తెలుసు..
‘ఆదివాసీలు ఉన్న నియోజకవర్గాలకు మేము బాధ్యులుగా ఉన్నాం.. ఎప్పుడూ వారు ముంపులోనే ఉంటున్నారు.. పోలవరం ఆర్డినెన్స్‌తో వాళ్లను ముంచుతారా..? వారి బాధేంటో మాకు తెలుసు.. కేంద్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఆర్డినెన్స్ ఎలా జారీచేసింది’ అని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడంతో పాటు డిజైన్ మార్చాలని, పీసా, 1/70 చట్టాలు సరిగా అమలయ్యేలా తీర్మానంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరారు. మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జలగం వెంకట్రావ్, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేంద్రం అప్రజాస్వామికంగా ఆర్డినెన్స్ జారీ చేసిందని విమర్శించారు. జిల్లా నుంచి ఒక్క గ్రామం కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి వీల్లేదన్నారు.  
 
హక్కులు కాలరాసే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం..

ఏజెన్సీలో పోలవరం ముంపు పేరుతో జారీ చేసిన ఆర్డినెన్స్ ఆదివాసీల హక్కులను కాలరాస్తుందని, దీన్ని  వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముంపు తగ్గేలా డిజైన్‌ను మార్చితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ జిల్లా ఆదివాసీల గోడు పట్టించుకోకండా కేంద్రం వ్యవహరించిన తీరు ఇక్కడివారికి ఆశనిపాతమైందన్నారు. ఆదివాసీలకు అన్యాయం జరగకుండా జిల్లాలోనే వారికి పునరావాసం కల్పించాలని, కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ ఏజెన్సీలో అటవీ హక్కు చట్టం, నేషనల్ ట్రైబల్ పాలసీ, వంటి చట్టాలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. ఆర్డినెన్స్ జారీకి మీరే కారణమంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఉద్దేశించి అనండంతో వారిరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో మిగితా సభ్యులు జోక్యం చేసుకొని రాజకీయాలకతీంగా సమావేశం జరగాలని సూచించడంతో ఆ తర్వాత పోలవరం ఆర్డినెన్స్‌పైనే చర్చించారు.
 
తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతాం..
పోలవరం ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని, డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. అసెంబ్లీ, శాసనమండలి చేసిన తీర్మానాల కాపీలను తెప్పించుకొని దాని ప్రకారం పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ తీర్మానం తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బానోతు మదన్‌లాల్, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీఓ దివ్య, ఫారెస్టు కన్జర్వేటర్ ఆనంద్‌మోహన్, ఐటీడీఏ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
ముంపు మండలాల్లో పాలన యథాతథం....
ప్రస్తుతానికి ఏజెన్సీలోని పోలవరం ముంపు మండలాల పాలన తెలంగాణ ప్రభుత్వం నుంచే కొనసాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వెల్లడించారు. అంతుకు ముందు జిల్లా నుంచి ఎలా పాలన జరిగిందో ఇప్పుడు కూడా అలానే ఉంటుందని స్పష్టం చేశారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో సభ్యులు లేవెనెత్తిన అంశాలపై ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని యథాతథంగా ముంపు మండలాల్లో అమలు జరపాలని ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. అలాగే ముంపు మండలాల విద్యార్థులకు  భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ బస్ పాస్‌ల జారీ నిలిపివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను జిల్లా అధికారులు పరిచయం చేసుకునేందుకే ఐటీడీఏ సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించామని, ఇక నుంచి ప్రతి పాలకమండలి సమావేశం తప్పకుండా భద్రాచలంలోనే జరుగుతుందని చెప్పారు.
 
సాగర్ ఆయకట్టు రెండో జోన్‌గా మార్చాలి : ఎంపీ పొంగులేటి
సాక్షి, ఖమ్మం :జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద మూడో జోన్ పరిధిలో 10 వేల ఎకరాలు ఉందని, ఇదంతా రెండోజోన్‌గా మార్చాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టర్‌లో జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశం, వర్క్‌షాప్‌లో ఆయన ఇటు ఏజెన్సీ, అటు మైదాన ప్రాంతంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఆయకట్టును రెండోజోన్‌లోకి మార్చడానికి తగిన నిధులను ప్రభుత్వం కేటాయించాలన్నారు. దీనివల్ల జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు కూడా సాగు నీరు అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. నీటి పారుదలశాఖ పరిధిలో మరమ్మతులు లేకుండా ఉన్న మేజర్, మైనర్ చెరువులపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
 
ప్రభుత్వం దుమ్మగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాం డ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని కోరారు. దీనివల్ల ఇల్లెందు, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లోని భూములు సాగులోకి వస్తాయని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తగా ఉండడం పట్ల ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యా శాఖ పరిధిలో 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏజెన్సీలో వైద్యంపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 104, 108 సేవలను జిల్లాలో సమర్థంగా కొనసాగించాలని సూచించారు. అర్హులైందరికీ ఇళ్ల స్థలాలు, ఫించన్లు ఇవ్వాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement