suport
-
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో కలిసి పనిచేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాలిబన్లతో కలసి పనిచేసే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అఫ్గాన్ సంక్షోభం పరిష్కారంకోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. కాగా తాలిబన్లతో కలిసి పని చేయటానికి తమకు అభ్యంతరం లేదని తొలుత చైనా ప్రకటించింది. ఆ తరువాత ఇదే బాటలో పాకిస్తాన్, రష్యా దేశాలు తాలిబన్లకు మద్ధతు పలికిన సంగతి తెలిసిందే. చదవండి : తాలిబన్ల చెరలో అఫ్గన్: హృదయ విదారక దృశ్యాలు.. వైరల్ Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
మీటూకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు
ముంబై : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) మద్దతు పలికింది. బాలీవుడ్ దిగ్గజాలు సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, వికాస్ బహల్ సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను దుమారం రేపింది. మీటూ పేరుతో భిన్న రంగాలకు చెందిన మహిళలు తమకెదురైన అనుభవాలను బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. మహిళలకు పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే తగిన చట్టాలను అమలు చేస్తామని సభ్యులంతా తప్పనిసరిగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని స్పష్టం చేసింది. డిక్లరేషన్ సమర్పించని సభ్యుడిని 30 రోజుల అనంతరం సమాఖ్య నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిరూపించబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పనిప్రదేశంలో మహిళల భద్రత కోసం నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలతో వర్క్‌షాపులు నిర్వహిస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. -
మమతకు మద్దతు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని మేం పూర్తిగా స్వాగతిస్తాం. ఇందిరాగాంధీ 17 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఎప్పుడూ మగవాళ్లే ప్రధానులుగా ఉండాలా? మమత లేదా మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) ఎందుకు కాకూడదు?’ అని దేవెగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా విశ్వనాథ్ జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్థానంలో హెచ్.విశ్వనాథ్‌ను దేవెగౌడ ఆదివారం నియమించారు. -
హిమాచల్ సీఎం అభ్యర్థిపై బీజేపీకి తలనొప్పి!
సాక్షి, షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం విషయమై అక్కడికి వెళ్లిన పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నేతలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ కమిటీ సమావేశ భవనం బయటే బీజేపీ సభ్యులు ప్రేమ్ కుమార్ దుమాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. 'ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని చేయాలే తప్ప ఎలాంటి లాబీయింగ్ జరగొద్దు' అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ దుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్తగా ఎవరిని పెట్టాలనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క, కేంద్రమంద్రి జేపీ నడ్డా పేరును సీఎంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. -
మీకు అండగా ఉంటాం
పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ధర్మాన, అంబటి శహపురంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి సత్యనారాయణను ఆత్మహత్యకు పురిగొల్పిన ఎమ్మెల్యే, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ నేతల డిమాండ్ శహపురం (బిక్కవోలు) /కాకినాడ : ఇలాంటి వేధింపులు ఇంకెంతో కాలం సాగవు.... ధైర్యంగా ఉండండి.. పార్టీ తరపున మీకు పూర్తిఅండగా ఉంటాం..అంటూ పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శహపురంలో పార్టీ కార్యకర్త రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. పోలీసులు రౌడీషీట్ తెరవడంతో ఆవేదనకు గురైన శహపురానికి చెందిన రాయుడు సత్యనారాయణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని శుక్రవారం మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, తదితరులు శహపురంలో పరామర్శించారు. ముందుగా గ్రామ శివారులో ఉన్న శివాలయం వద్ద నుంచి వారు కార్యకర్తలతో కలసి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు కన్నబాబు ఘటన జరిగిన తీరును, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను, అధికార పార్టీ ఆగడాలను, పోలీసుల దౌర్జన్య కాండను పార్టీ నేతలకు వివరించారు. ఓ పక్క బాధితులు గోడు చెబుతుంటే మరోపక్క జనంతో పాటు కలిసిపోయి ఓ కానిస్టేబుల్ సంఘటనను వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుమారులు రాయుడు మురళి, లోవరాజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్న తీరును వివరించారు. సుమారు 58 ఏళ్ల మృతుని సోదరునిపై 12ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం కేసు పెట్టారని, కుమారులు, సోదరులు, మేనల్లుళ్లపై రౌడీ షీట్లు తెరిచి, కేసులు పెట్టి తీవ్రంగా వే«ధిస్తున్నారంటూ వాపోయారు. క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి ఓ టీడీపీ నేత ఇంటి అద్దం పగిలిందన్న సాకుతో వైఎస్సార్ సీపీ అభిమాని కుమారుడిని 15రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారని అతని తల్లి వాపోయింది. శహపురం, వేండ్ర తదితర గ్రామాలలో పార్టీ అభిమానులు ఎదుర్కొన్న సమస్యలు విని ధర్మాన, అంబటితో పాటు పార్టీ నేతలంతా నివ్వెరపోయారు. మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరీ దేవి, వివిధ నియోజక వర్గాల కోఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి,రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధానకార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు,మిండగుదిటి మోహన్,వట్టికూటి రాజశేఖర్,చెల్లుబోయిన శ్రీను,రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్రప్రచార కమిటి ప్రచారకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అల్లి రాజబాబు,ఎస్సీసెల్ కార్యదర్శిబత్తుల భీమారావు,రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, మట్టపర్తి మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు,రాజమండ్రి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆరీప్, రాష్ట్రయువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీను, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గాజంగి వెంకటరమణ, వుండ్రు దొరబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రిమ్మలపూడి అబ్బు, జిల్లా కమిటీ సభ్యులు తిబిరిశెట్టి ఆదినారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు చందాల వెంకటరమణ, యువజన అధ్యక్షుడు పేపకాయల వెంకటరమణ, మండల సాంస్కృతికి విభాగం అధ్యక్షుడు బుద్ధాల శ్రీను, వేంద్ర ఎంపీటీసీ సభ్యుడు కూసూరి దత్తుడు, సర్పంచ్ గాజంగి సూర్యకాంతం, ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు కర్రి శ్రీను, రొక్క సత్తిబాబు, తాడాళ మణకంఠ, పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, చీపూరు శ్రీను, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం అందజేత పైన గ్రామానికి చెందిన మండల బీసీ సెల్ కన్వీనర్ గుత్తుల వెంకటరమణ అందచేసిన రూ.10 వేలను రాయుడు సత్యనారాయణ కుటుంబానికి ధర్మాన అందచేశారు. సర్కార్‌పై ధర్మాన మండిపాటు కష్టాల్లో ఉన్న ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఆ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పేయేలా చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. శహపురం లో రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు తెరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాడతామన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తొలుత కేసులు పెట్టడం, తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేను కలవమనడం, అనంతరం పార్టీని ఫిరాయించేలా ఒత్తిడి చేయడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పార్టీ జెండా పట్టుకున్న వారిని స్టేషన్లకు పిలిపించడం గంటల తరబడి వేధించడం, కేసులు పెట్టడం మామూలయిపోయిందన్నారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎక్కడా లేనంత దారుణంగా తమ నియోజకవర్గంలో పోలీసు వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పారు. -
పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ, ఆర్ అండ్ అర్ అధికారి ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను కలిసి నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న భూములకు రైతులు కోరుతున్నట్టు భూమికి భూమి గానీ, నష్టపరిహారం గానీ చెల్లించాలని డిమాండ్ చేశారు. డీ పట్టా భూములు కలిగిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమినే నమ్ముకున్న ఆ కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వకుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందేందుకు ముంపు గ్రామాల్లోని ప్రతి ఒక్కర్ని అర్హులుగా గుర్తించాలన్నారు. కొంత మంది పేర్లు సర్వే లిస్టులో లేవని, ఇలాంటి పొరపాట్లను సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. పోలవరం పునరావాస కాలనీల్లోని నిర్వాసితుల పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. అధికారులు నేరుగా అక్కడికి వెళ్లి చూస్తే వారు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. పునరావాస కాలనీకి వెళ్లిన గిరిజన రైతులకు ఇంకా భూమికి భూమి ఇవ్వలేదని చెప్పారు. కాలనీ ఒకచోట, ఎందుకూ పనికిరాని కొండలు ఒక చోట చూపారన్నారు. ఇచ్చిన ప్యాకేజీ సొమ్ముతో ఇప్పటి వరకూ గడిపారని, తక్షణం వారికి సాగుకు అనుకూలంగా ఉన్న భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో రైతులు కూలీగా మారి పనులు కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన చెందారు. భూమికి భూమి ఇచ్చేందుకు చేపట్టిన భూసేకరణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఎందుకు పనికిరాని కొండలను నిర్వాసితులకు ఇచ్చేందుకు సేకరించి, వాటిని చదును చేసే పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. -
కాపు నేతలకు విశ్వరూప్ సంఘీభావం
అమలాపురం టౌన్ : మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అమలాపురానికి చెందిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా వపన్కుమార్ను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసు బందోబస్తు నడుమ పవన్ ఇంట్లోనే నిర్బంధించారు. ఇప్పటికే పవన్ తండ్రి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తిని గురువారం నుంచి హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమలాపురంలో కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కూడా మూడు రోజులుగా హౌస్ అరెస్ట్‌లోనే ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ఈ ముగ్గురు కాపు నేతలను వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ వారి ఇళ్లకు వెళ్లి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, వాకపల్లి శ్రీను, రంకిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఉన్నా రు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు కూడా ఆ నేతలను కలిసి మద్దతు తెలిపారు. పోలీసుల అనుమతితో కిర్లంపూడికి... గృహ నిర్బంధంలో ఉన్న నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, రావులపాలెం నుంచి కాపు నేత ఆకుల రామకృష్ణ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శుక్రవారం సాయంత్రం కిర్లంపూడికి వెళ్లారు. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వాయిదా పడ్డ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు వెళుతున్నట్టు వారు తెలిపారు.