
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని మేం పూర్తిగా స్వాగతిస్తాం.
ఇందిరాగాంధీ 17 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఎప్పుడూ మగవాళ్లే ప్రధానులుగా ఉండాలా? మమత లేదా మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) ఎందుకు కాకూడదు?’ అని దేవెగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పారు.
జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా విశ్వనాథ్
జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్థానంలో హెచ్.విశ్వనాథ్‌ను దేవెగౌడ ఆదివారం నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment