ముంబై : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) మద్దతు పలికింది. బాలీవుడ్ దిగ్గజాలు సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, వికాస్ బహల్ సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను దుమారం రేపింది. మీటూ పేరుతో భిన్న రంగాలకు చెందిన మహిళలు తమకెదురైన అనుభవాలను బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది.
మహిళలకు పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే తగిన చట్టాలను అమలు చేస్తామని సభ్యులంతా తప్పనిసరిగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని స్పష్టం చేసింది. డిక్లరేషన్ సమర్పించని సభ్యుడిని 30 రోజుల అనంతరం సమాఖ్య నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిరూపించబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పనిప్రదేశంలో మహిళల భద్రత కోసం నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలతో వర్క్‌షాపులు నిర్వహిస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment