సాక్షి, ముంబై : బాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై బాధితులు బాహాటంగా ముందుకొచ్చి చేపట్టిన మీటూ ఉద్యమం రోజురోజుకూ ప్రబలమవుతోంది. తనుశ్రీ దత్తా, వింటా నందా, సోనా మహాపాత్ర, సంధ్యా మృదుల్ వంటి పలువురు మహిళలు తమకెదురైన లైంగిక వేధింపులను వెల్లడించగా, తాజాగా అలియా భట్ తల్లి ప్రముఖ టీవీ, సినీ నటి సోనీ రజ్దాన్ గతంలో తనకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేశారు.
తాను లైంగిక వేధింపులు ఎదుర్కోకపోయినా, లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వ్యక్తి తనపై అత్యాచారం జరిపేందుకు విఫలయత్నం చేశాడని, అదృష్టవశాత్తూ అతని ప్రయత్నం ఫలించలేదని క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దారుణ ఘటన జరిగినప్పటికీ నిందితుడి కుటుంబంపై ప్రభావం పడుతుందనే కారణంతో వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను అతడితో మాట్లాడలేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాధ్ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ అలోక్ నాథ్ ప్రవర్తన అమర్యాదకరంగానే ఉంటుందని, మద్యం సేవిస్తే అలోక్ నాధ్ మరింత రెచ్చిపోతాడన్నారు. అలోక్ తనను చూసే పద్ధతి తనకు నచ్చేది కాదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment