herassment
-
మహిళా వైద్యాధికారిని వెంబడించి..
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ముజఫర్‌నగర్‌లోని రాంపురి ప్రాంతంలో మహిళా వైద్యాధికారిని లైంగికంగా వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ నెల ఏడున బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంటాడి లైంగికంగా వేధింపులకు గురిచేశారు. దుండగుల చర్యను ప్రతిఘటించగా వారు తనను తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. మహిళ ఫిర్యాదుపై నిందితులు చందు సింగ్, బిహరి, మరో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. -
మీటూ : నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు
సాక్షి, ముంబై : బాలీవుడ్లో లైంగిక వేధింపులపై బాధితులు బాహాటంగా ముందుకొచ్చి చేపట్టిన మీటూ ఉద్యమం రోజురోజుకూ ప్రబలమవుతోంది. తనుశ్రీ దత్తా, వింటా నందా, సోనా మహాపాత్ర, సంధ్యా మృదుల్ వంటి పలువురు మహిళలు తమకెదురైన లైంగిక వేధింపులను వెల్లడించగా, తాజాగా అలియా భట్ తల్లి ప్రముఖ టీవీ, సినీ నటి సోనీ రజ్దాన్ గతంలో తనకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేశారు. తాను లైంగిక వేధింపులు ఎదుర్కోకపోయినా, లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వ్యక్తి తనపై అత్యాచారం జరిపేందుకు విఫలయత్నం చేశాడని, అదృష్టవశాత్తూ అతని ప్రయత్నం ఫలించలేదని క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దారుణ ఘటన జరిగినప్పటికీ నిందితుడి కుటుంబంపై ప్రభావం పడుతుందనే కారణంతో వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను అతడితో మాట్లాడలేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాధ్ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ అలోక్ నాథ్ ప్రవర్తన అమర్యాదకరంగానే ఉంటుందని, మద్యం సేవిస్తే అలోక్ నాధ్ మరింత రెచ్చిపోతాడన్నారు. అలోక్ తనను చూసే పద్ధతి తనకు నచ్చేది కాదని చెప్పుకొచ్చారు. -
మీటూకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు
ముంబై : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) మద్దతు పలికింది. బాలీవుడ్ దిగ్గజాలు సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, వికాస్ బహల్ సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను దుమారం రేపింది. మీటూ పేరుతో భిన్న రంగాలకు చెందిన మహిళలు తమకెదురైన అనుభవాలను బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. మహిళలకు పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే తగిన చట్టాలను అమలు చేస్తామని సభ్యులంతా తప్పనిసరిగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని స్పష్టం చేసింది. డిక్లరేషన్ సమర్పించని సభ్యుడిని 30 రోజుల అనంతరం సమాఖ్య నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిరూపించబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పనిప్రదేశంలో మహిళల భద్రత కోసం నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలతో వర్క్‌షాపులు నిర్వహిస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. -
మీటూ ప్రకంపనలు : ఆ మంత్రి చేష్టలతో అవాక్కయ్యా..
సాక్షి, న్యూఢిల్లీ : మీటూ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ పెనుదుమారం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ మాజీ చీఫ్‌ను తొలగించగా తాజాగా యూపీఏ వన్ హయాంలో ఓ కేంద్ర మంత్రి తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన తాను గుజరాత్లో ఏషియన్ ఏజ్ పత్రిక మూతపడటంతో 2006లో ఢిల్లీకి బదిలీ అయ్యానని సోనాల్ కెల్లాగ్ అనే మహిళా జర్నలిస్టు చెప్పారు. అక్కడ ఓ కేంద్ర మంత్రి వార్తలను కవర్ చేసే బాధ్యత తనకు అప్పగించారన్నారు. సదరు కేంద్ర మంత్రి న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో చదివిన అనంతరం మాస్టర్స్ డిగ్రీ కోసం ఇంగ్లాండ్ వెళ్లివచ్చారని చెప్పుకొచ్చారు. ఆ మంత్రి తనను కలిసిన ప్రతిసారీ తనను ముద్దు పెట్టుకోవడం చిరాకు తెప్పించేదని కెల్లాగ్ డైలీఓకు తనకెదురైన అనుభవాలను వివరిస్తూ వెల్లడించారు. గుజరాత్లో రాజకీయ నేతలు ఎన్నడూ ముద్దులు, కౌగిలింతలతో పలకరించేవారు కాదని, ఇది ఢిల్లీ సంస్కృతి అని తాను సరిపెట్టుకున్నానని చెప్పారు. ఇక 2014లో ఢిల్లీలోని ఎంపీ బంగళాలో మంత్రి తన పట్ల మరోసారి అమర్యాదకరంగా వ్యవహరించారన్నారు. మంత్రి వాష్‌రూమ్‌కు వెళుతూ అనూహ్యంగా తన ఛాతీపై చేయి వేశారని, తనను టచ్ చేయవద్దని మంత్రిని గట్టిగా మందలిస్తే ఎందుకు అంటూ ప్రశ్నించారని చెప్పారు. ఇక అప్పటినుంచి తాను మంత్రిని ఎన్నడూ కలవలేదని, మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న క్రమంలోనే తాను మౌనం వీడానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరనేది ఆమె వెల్లడించలేదు. -
మీటూ : కైలాష్ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు
-
మీటూ : కైలాష్ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు
ముంబై : పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బాహాటంగా వెల్లడిస్తుండటంతో మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై లైంగిక వేదింపుల ఆరోపణలు రాగా, గాయకుడు కైలాష్ ఖేర్పైనా పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. తాజాగా వర్షాసింగ్ దనోహ అనే గాయని కైలాష్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనకెదురైన అనుభవాలను వివరిస్తూ ఆన్లైన్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. కైలాష్ తనతో గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పారని వర్ష ఆరోపించారు. మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. సబ్రి కారులో తనను రికార్డింగ్‌కు తీసుకువెళుతూ తనకు మద్యం ఆఫర్ చేశాడని, తనపై చేయి వేసి అమర్యాదకరంగా వ్యవహరించాడని ఆరోపించారు. తనకెదురైన అనుభవాలతో ఇక తాను సింగింగ్ కెరీర్ కోసం ఏ డైరెక్టర్‌నూ కలిసే సాహసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
గురుకులంలో దారుణం.. ప్రిన్సిపాల్ భర్త అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. నగరంలోని శేర్లింగంపల్లి గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భర్త తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల నీచంగా ప్రవర్తించాడని ఈ నెల 3న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 354 ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదీని భర్త నాగేశ్వర్ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ ప్రమోదీని సస్సెండ్ చేశారు. అయితే ఈ నీచానికి పాల్పడిన నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
ప్రేమ పేరుతో ఆకతాయి.. పోలీసుల సలహాలు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతా లేకుండాపోయింది. మొన్న దాచేపల్లి, నేడు గుంటూరు.. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఆడపిల్లల ఫిర్యాదులను చాలా తేలికగా తీసుకుంటున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి తమను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇద్దరు అక్కాచెల్లెలు ధర్మవరం పోలీసులను సంప్రదించారు. శాంతినగర్‌కు చెందిన ఓబులేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తమ వెంటపడి వేధిస్తున్నాడని తెలిపారు. అయితే ఆ ఆడపిల్లలకు ధైర్యం చెప్పి, వారి ఫిర్యాదు స్వీకరించకుండా, కేసు నమోదు చేసుకోకుండా పోలీసులు విచిత్రంగా ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ యువకుడు కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ హేళన చేస్తూ.. మాట్లాడారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వైపు ఆడపిల్లలపై రోజుకో దారుణం చోటుచేసుకుంటుంటే, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పు పడుతున్నారు. -
చిత్ర హింసలకు గురైన వృద్ధురాలి మృతి
రాజమహేంద్రవరం క్రైం : మూడు నెలలు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. రాజా నగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో తనకు చిన్నమ్మ కుమార్తె చెల్లెలు వరుసయ్యే మంగాదేవి ఇంట్లో ఉంటోంది. కాళ్లు, చేతులు చచ్చపడిపోవడంతో మంచానికే పరిమితమైన పుష్పవతిని తనకు ఉన్న భూమి కోసం సంతకం చెయ్యాలంటూ మూడు నెలలుగా నిత్యం కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం రేగింది. స్థానికుల సహాయంతో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వం హాస్పటల్లో చేర్చారు. వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో చిత్రహిసలకు గురిచేసిన నిందితురాలు ప్రగడ మంగాదేవిని బొమ్మురు పోలీసులు అరెస్ట్ చేశారు. -
పిచ్చి వేషాలేస్తేడిస్మిస్ అవుతావ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘‘ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్. పద్ధతిగా నడుచుకో. లేదంటే ఏకంగా డిస్మిస్ అయ్యి జైలుకు పోతావు’’ జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్‌ను తెలంగాణకు చెందిన సీఐడీ డీఎస్పీ బెదిరింపుతో అన్న మాటలివి. ఈ బెదిరింపులపై సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు యంత్రాంగం ముందుకు రాకపోగా మూడు రోజుల్లోనే రెండు ప్రాంతాలకు అతన్ని బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. దెందులూరులో తెలుగుదేశం నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్న విషయంపై కానిస్టేబుల్ మధు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులను ఎస్పీ వద్దకు పంపారు. వారి ఫిర్యాదుతో కనీసం విచారణ చేయకుండా కానిస్టేబుల్ మధును వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు. గతంలో ఇతనిపై చింతమనేని ప్రభాకర్ దాడికి దిగారు. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న ఇతనిపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. ప్రభాకర్‌పై పెట్టిన కేసును ఫాల్స్ కేసు కింద తీసేసిన పోలీసులు.. కానిస్టేబుల్‌పై కేసును కొనసాగిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు. 2014లో ఇంటి స్థలం విషయంలో ఇతనికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో వివాదం జరిగింది. అప్పట్లో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దెందులూరులో ఎంపీటీసీ సభ్యుడు ఇరిగేషన్ పంట బోదెలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దానిపై కానిస్టేబుల్ మధు జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌కు మీ కోసంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు కానిస్టేబుల్ మధుపై కక్షసాధింపు చర్యలు ప్రారంభం అయ్యాయి. సదరు తెలుగుదేశం నాయకుని బంధువైన తెలంగాణకు చెందిన డీఎస్పీ రంగంలోకి దిగారు. తెలంగాణ సీఐడీ డీఎస్పీ బెదిరింపులు కానిస్టేబుల్ మధు కథనం ప్రకారం... రెండురోజుల క్రితం ఆంధ్రా సీఐడీ డీఎస్పీని అంటూ ఒక అధికారి ఫోన్ చేశారు. మొదట ఆ వ్యక్తి ఏ స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ నువ్వు అంటూ ప్రస్తావించి తరువాత ఏంటి నీ ఓవర్‌యాక్షన్.. డిస్మిస్ అయ్యి జైలుకి పోతావ్, ఉరిపోసుకుని చస్తావ్ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. నీకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అసలు నీకు ఉద్యోగం లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆఖరికి ఉరిపోసుకుని చస్తావంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైన మధు తనను ఇలా వేధించే బదులు చంపించేయండంటూ బదులిచ్చాడు. మీ ఎస్పీతో మాట్లాడి నీ సంగతి తేలుస్తానంటూ ఫోన్ పెట్టేశారు. అది జరిగిన రోజు సాయంత్రమే దెందులూరుకు చెందిన తెలుగుదేశం నాయకులు, అతని బంధువులు జిల్లా ఎస్పీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. మొబైల్ పోలీస్ నుంచి బదిలీ దీంతో కొంత కాలంగా దెందులూరు జాతీయ రహదారిపై మొబైల్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న మధుని, బీటు మార్చారు. మరుసటి రోజే మళ్లీ ఉన్నతాధికారులు తాడేపల్లిగూడెంలో జాయిన్ అవ్వమని ఆదేశాలు జారీచేశారు. తనను బెదిరించిన అధికారిపై కానిస్టేబుల్ మధు దెందులూరు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ తీసుకోలేదు. సీఐతో మాట్లాడమని చెప్పడంతో ఆయన సీఐకి ఫోన్ చేశారు. సదరు సీఐ కూడా నీ పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ చేసి ఫోన్ పెట్టేశారు. కాని ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో మధు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తన సమస్యను ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని కానిస్టేబుల్ మధు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
వృద్ధులపై హింసను అరికట్టేందుకు చర్యలు
తాడితోట (రాజమహేంద్రవరం): వృద్ధులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. చెల్లెలు(పిన్ని కుమార్తె) ప్రగడ మంగాదేవి చేతిలో చిత్రహింసలకు గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతిని మంగళవారం మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, పీడీ ఎన్.సీతామహాలక్ష్మి, సీడీపీఓ వై.సుశీల కుమారి పరామర్శించారు. వృద్ధురాలి పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు వేధింపులకు గురి కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, ఆర్ఎంఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి పరిస్థితి విషమం.. కాకినాడకు తరలింపు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు పంతం పుష్పవతి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆకతాయి వేధింపులకు విద్యార్థిని బలి
దుగ్గిరాల : ఆకతాయి వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం పొందింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన దుగ్గిరాలలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కి చెందిన బాణావత్ శివదుర్గాబాయి (19) స్థానిక డిగ్రీ కాలేజిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఉపాధ్యాయుడైన ఆమె తండ్రి సాంబయ్యనాయక్ అయిదేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. కారుణ్య నియామకం కింద శివదుర్గాబాయి తల్లి హైమాబాయికి అటెండరు పోస్టు వచ్చింది. ఉద్యోగరీత్యా ఆమె వివిధ ప్రాంతాల్లో చేస్తూ ఈమధ్యనే సొంతవూరుకు వచ్చారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శివదుర్గాబాయిని ఇక్కడే డిగ్రీలో చేర్పించారు. రోజూ కాలేజీకిS నడిచి వెళ్లివస్తుండే శివ దుర్గాబాయిని సుగాలీ కాలనీకి చెందిన కేతావతు దుర్గానాయక్ అటకాయించి, ప్రేమించాలని గొడవ చేసేవాడని పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌కు తరచూ ఫోను చేస్తూ ప్రేమించాలంటూ వేధించేవాడు. ఇంటర్ చదువుతూ సొంత ఊరికి ఆమె వచ్చిన సమయంలోనూ శివదుర్గాబాయి ఇతని నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఆమె అతడి ప్రేమను వ్యతిరేకించినా వినిపించుకోకుండా వెంట పడుతూ వచ్చాడు. బుధవారం కాలేజీకి వెళుతున్న సమయంలో మార్గమధ్యలో ఎదురైన ఆమెను అడ్డగించాడు. ప్రేమించాలంటూ గొడవపెట్టాడు. మానసిక వత్తిడికి గురైన శివదుర్గాబాయి కాలేజి నుంచి ఇంటికి రోజుకన్నా ముందుగానే వచ్చేసింది. ఇంటిలో ఎవరూలేకపోవడంతో గదిలో సిలింగ్‌కు ఉన్న పైపుకు ఉరివేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఆమె∙చెల్లెలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి అక్క ఉరికి వేలాడుతుండటాన్ని గమనించి కేకలు వేయటంతో స్థానికులు వచ్చి 108కు సమాచారం అందించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించి వెళ్ళిపోయారు. తల్లి హైమాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ విద్యార్థిని ఆత్మహత్య సంఘటను తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకష్ణారెడ్డి బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్మించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అండగా నిలుస్తామని వారికి భరోసా కల్పించారు. ఫోన్లో తెనాలి రూరల్ సీఐ యూ రవీచంద్రతో మాట్లాడి శివదుర్గాబాయి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.