ఆకతాయి వేధింపులకు విద్యార్థిని బలి
ఆకతాయి వేధింపులకు విద్యార్థిని బలి
Published Thu, Jul 21 2016 10:42 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
దుగ్గిరాల : ఆకతాయి వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం పొందింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన దుగ్గిరాలలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కి చెందిన బాణావత్ శివదుర్గాబాయి (19) స్థానిక డిగ్రీ కాలేజిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఉపాధ్యాయుడైన ఆమె తండ్రి సాంబయ్యనాయక్ అయిదేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. కారుణ్య నియామకం కింద శివదుర్గాబాయి తల్లి హైమాబాయికి అటెండరు పోస్టు వచ్చింది. ఉద్యోగరీత్యా ఆమె వివిధ ప్రాంతాల్లో చేస్తూ ఈమధ్యనే సొంతవూరుకు వచ్చారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శివదుర్గాబాయిని ఇక్కడే డిగ్రీలో చేర్పించారు. రోజూ కాలేజీకిS నడిచి వెళ్లివస్తుండే శివ దుర్గాబాయిని సుగాలీ కాలనీకి చెందిన కేతావతు దుర్గానాయక్ అటకాయించి, ప్రేమించాలని గొడవ చేసేవాడని పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌కు తరచూ ఫోను చేస్తూ ప్రేమించాలంటూ వేధించేవాడు. ఇంటర్ చదువుతూ సొంత ఊరికి ఆమె వచ్చిన సమయంలోనూ శివదుర్గాబాయి ఇతని నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఆమె అతడి ప్రేమను వ్యతిరేకించినా వినిపించుకోకుండా వెంట పడుతూ వచ్చాడు. బుధవారం కాలేజీకి వెళుతున్న సమయంలో మార్గమధ్యలో ఎదురైన ఆమెను అడ్డగించాడు. ప్రేమించాలంటూ గొడవపెట్టాడు. మానసిక వత్తిడికి గురైన శివదుర్గాబాయి కాలేజి నుంచి ఇంటికి రోజుకన్నా ముందుగానే వచ్చేసింది. ఇంటిలో ఎవరూలేకపోవడంతో గదిలో సిలింగ్‌కు ఉన్న పైపుకు ఉరివేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఆమె∙చెల్లెలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి అక్క ఉరికి వేలాడుతుండటాన్ని గమనించి కేకలు వేయటంతో స్థానికులు వచ్చి 108కు సమాచారం అందించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించి వెళ్ళిపోయారు. తల్లి హైమాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుగ్గిరాల ఎస్‌ఐ మన్నెం మురళి తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ
విద్యార్థిని ఆత్మహత్య సంఘటను తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకష్ణారెడ్డి బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్మించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అండగా నిలుస్తామని వారికి భరోసా కల్పించారు. ఫోన్‌లో తెనాలి రూరల్ సీఐ యూ రవీచంద్రతో మాట్లాడి శివదుర్గాబాయి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.
Advertisement