సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘‘ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్. పద్ధతిగా నడుచుకో. లేదంటే ఏకంగా డిస్‌మిస్ అయ్యి జైలుకు పోతావు’’ జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్‌ను తెలంగాణకు చెందిన సీఐడీ డీఎస్పీ బెదిరింపుతో అన్న మాటలివి. ఈ బెదిరింపులపై సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు యంత్రాంగం ముందుకు రాకపోగా మూడు రోజుల్లోనే రెండు ప్రాంతాలకు అతన్ని బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
దెందులూరులో తెలుగుదేశం నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్న విషయంపై కానిస్టేబుల్ మధు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులను ఎస్పీ వద్దకు పంపారు. వారి ఫిర్యాదుతో కనీసం విచారణ చేయకుండా కానిస్టేబుల్ మధును వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు. గతంలో ఇతనిపై చింతమనేని ప్రభాకర్ దాడికి దిగారు.
అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న ఇతనిపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. ప్రభాకర్‌పై పెట్టిన కేసును ఫాల్స్ కేసు కింద తీసేసిన పోలీసులు.. కానిస్టేబుల్‌పై కేసును కొనసాగిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు. 2014లో ఇంటి స్థలం విషయంలో ఇతనికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో వివాదం జరిగింది. అప్పట్లో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి.
అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దెందులూరులో ఎంపీటీసీ సభ్యుడు ఇరిగేషన్ పంట బోదెలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దానిపై కానిస్టేబుల్ మధు జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌కు మీ కోసంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు కానిస్టేబుల్ మధుపై కక్షసాధింపు చర్యలు ప్రారంభం అయ్యాయి. సదరు తెలుగుదేశం నాయకుని బంధువైన తెలంగాణకు చెందిన డీఎస్పీ రంగంలోకి దిగారు.
తెలంగాణ సీఐడీ డీఎస్పీ బెదిరింపులు
కానిస్టేబుల్ మధు కథనం ప్రకారం... రెండురోజుల క్రితం ఆంధ్రా సీఐడీ డీఎస్పీని అంటూ ఒక అధికారి ఫోన్ చేశారు. మొదట ఆ వ్యక్తి ఏ స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ నువ్వు అంటూ ప్రస్తావించి తరువాత ఏంటి నీ ఓవర్‌యాక్షన్.. డిస్మిస్ అయ్యి జైలుకి పోతావ్, ఉరిపోసుకుని చస్తావ్ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. నీకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అసలు నీకు ఉద్యోగం లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
ఆఖరికి ఉరిపోసుకుని చస్తావంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైన మధు తనను ఇలా వేధించే బదులు చంపించేయండంటూ బదులిచ్చాడు. మీ ఎస్పీతో మాట్లాడి నీ సంగతి తేలుస్తానంటూ ఫోన్ పెట్టేశారు. అది జరిగిన రోజు సాయంత్రమే దెందులూరుకు చెందిన తెలుగుదేశం నాయకులు, అతని బంధువులు జిల్లా ఎస్పీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు.
మొబైల్ పోలీస్ నుంచి బదిలీ
దీంతో కొంత కాలంగా దెందులూరు జాతీయ రహదారిపై మొబైల్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న మధుని, బీటు మార్చారు. మరుసటి రోజే మళ్లీ ఉన్నతాధికారులు తాడేపల్లిగూడెంలో జాయిన్ అవ్వమని ఆదేశాలు జారీచేశారు. తనను బెదిరించిన అధికారిపై కానిస్టేబుల్ మధు దెందులూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్‌ఐ తీసుకోలేదు. సీఐతో మాట్లాడమని చెప్పడంతో ఆయన సీఐకి ఫోన్ చేశారు.
సదరు సీఐ కూడా నీ పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ చేసి ఫోన్ పెట్టేశారు. కాని ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో మధు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తన సమస్యను ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని కానిస్టేబుల్ మధు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment