
తమన్నా
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్‌వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు తమన్నా.
సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్‌ఎక్స్‌పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా.