Himmatwala
-
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
వేశ్యావాటికలో పుట్టిన నటుడు
మురికికూపాల్లో కూడా మాటలు పూస్తాయి.కష్టాలు చితక్కొట్టిన వేళ్లు కలాన్ని దృఢంగా పట్టుకోవడానికి చూస్తాయి.‘జిస్కా కోయీ నహీ ఉస్కాతో ఖుదా హై యారో’ (ఎవరూ లేనివారికి భగవంతుడే తోడు) అని‘మొకద్దర్ కా సికిందర్’లో ఒక డైలాగ్.ఖాదర్ ఖాన్‌కి దేవుని తోడు తప్ప మరేతోడూ లేదు. మాటను ఊతంగా చేసుకుని అతడు ఎక్కిన ఎత్తు తలెత్తి చూడతగ్గది! చెట్టు మీద కాయకూ సముద్రంలో ఉప్పుకూ సంబంధం ఉందో లేదో కాని ఖాదర్ ఖాన్‌కూ మన అల్లు రామలింగయ్యకు మాత్రం సంబంధం ఉంది. నిజానికి ఖాదర్ ఖాన్ తన ఇంట్లో ఫొటో పెట్టుకోదగ్గ మేలు అల్లు రామలింగయ్య చేశారనే చెప్పాలి. కథ ఇది. తెలుగులో ‘ఊరికి మొనగాడు’ (1981) సినిమా చాలా పెద్ద హిట్. హిందీలో దానిని ‘హిమ్మత్ వాలా’ (1983)గా రీమేక్ చేశారు. దర్శకుడు తెలుగును తీర్చిదిద్దిన రాఘవేంద్రరావే. అప్పటికి హిందీలో ఖాదర్‌ఖాన్ నటుడుగా, రచయితగా గుర్తింపు పొందాడు. నటుడుగా నెగెటివ్ రోల్స్, అప్రధానమైన రోల్స్ చేస్తున్నాడు. రచయితగా హిట్ సినిమాలు ఇస్తున్నాడు. దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయితే కొత్తగా రాస్తున్న రచయితవైపు చూడటం సహజం. అలా రాఘవేంద్రరావు దృష్టి ఖాదర్ ఖాన్ మీద పడింది. తెలుగు సినిమా చూసి సంభాషణల సారం అర్థం చేసుకొని హిందీ వెర్షన్‌కు డైలాగ్స్ రాశాడు ఖాదర్ ఖాన్. ఆ డైలాగ్స్‌ను క్యాసెట్లో రీడింగ్ ఇచ్చి మద్రాసు పంపాడు. వాటిని విన్న రాఘవేంద్రరావు వెంటనే బాంబేకి (అప్పట్లో అలానే పిలిచేవారు) ఫ్లయిట్ కట్టుకుని వెళ్లి ఖాదర్‌ఖాన్‌ని కలిశారు. ‘డైలాగ్స్ చాలా బాగా రాశావు. హీరో జితేంద్ర కాబట్టి, విలన్ అంజాద్‌ఖాన్ కాబట్టి దిగుల్లేదు. కాని అల్లు రామలింగయ్య పాత్రకు నువ్వు రాసిన డైలాగులు చెప్పే యాక్టర్ హిందీలో ఎవరు? ఆ ఫ్లో, ఆ టైమింగ్ నువ్వు చదువుతుంటే ఆ పాత్ర నీదే అనిపించింది. నువ్వు చెయ్ దానిని’ అన్నారు. ‘నేనా... కామెడీయా’ అన్నాడు ఖాదర్ ఖాన్. ‘నువ్వే... కామెడీవే. నువ్వు చేస్తే హిందీలో అల్లు రామలింగయ్య అంతటివాడివవుతావు’ అన్నారు రాఘవేంద్రరావు. ‘హిమ్మత్వాలా’లో ఖాదర్ ఖాన్ ఆ పాత్ర చేశాడు. ఏ ముహూర్తాన చేశాడో చనిపోయేనాటి వరకు కామెడీ కింగ్‌గానే బతికాడు. అతడికి ఆ హాస్యకిరీటం పెట్టిన చేతులు తెలుగు వారివి అయినందుకు మనం సంతోషపడాలి. ఖాదర్ ఖాన్ తెర జీవితం నవ్వులతో పండింది కాని అతడి బాల్యం కన్నీటి ఉప్పదనంతో బిరుసెక్కిపోయింది. అప్ఘనిస్తాన్‌లో కొండగాలికి పుట్టిన ముగ్గురు కొడుకులు చనిపోతే మిగిలిన నాలుగో కొడుకైనా బతకాలి అని చెప్పి ఆరేడేళ్ల ఖాదర్‌ఖాన్‌ను వెంటబెట్టుకుని అతని తల్లిదండ్రులు కాబూల్ నుంచి బాంబేకి వచ్చిపడ్డారు బిడారుతో కలిసి. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిల్లి లేని గవ్వ కూడా ఆ నగరంలో ఊరికే రాదు. అందుకు కష్టపడాలి. కష్టపడాల్సిన తండ్రి భార్యను, బిడ్డను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. తల్లీకొడుకులకు వేరే దారి లేక వేశ్యవాటికకు ఆసియా ఖండంలోనే పేరుపడ్డ కామాటిపుర మొదటి వీథిలో చిన్నగదిలోకి వచ్చి చేరారు. చుట్టూ వేశ్యలు, విటులు, తార్పుడుగాళ్లు, తాగుబోతులు, తగాదాలు, అల్లర్లు, అలగా జనాల బతుకు ఆక్రందనలు వీటిని వింటూ ఖాదర్ ఖాన్ పెరిగాడు. పెద్దలు తల్లికి మరో పెళ్లి చేస్తే మారుతండ్రి చేతిలో బాధలు పడ్డాడు. చదువు మానేద్దామనుకుంటే తల్లి ఒట్టు వేయించుకుంది– చదవాల్సిందేనని. ఒక పఠాన్ కంఠాన్ని తెగ్గోసుకోగలడుకాని మాట తప్పలేడు. తల్లి మాట కోసం టెక్నికల్ విద్యను పూర్తి చేసిన ఖాదర్‌ఖాన్ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలేజీలో పాఠాలు చెప్తూ ఖాళీ సమయాల్లో నాటకాలు వేస్తూ ముంబై మహానగరంలో ఉనికికి ప్రయత్నించాడు. అతడి దర్శకత్వంలో అప్పటికి పైకి రాని రాజేశ్ ఖన్నా నటించాడు. ఆ పరిచయంతో దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌కు పరిచయం చేశాడు. అలా ‘రోటీ’ (1974) రచయితగా ఖాదర్ ఖాన్‌కు గుర్తింపు తెచ్చిన తొలి సినిమా అయ్యింది. అయితే అసలు కథ ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఆ వెంటనే మన్మోహన్ దేశాయ్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ తలపెట్టాడు. అందులో ఒక మాస్ క్యారెక్టర్ అమితాబ్ చేయాలని ఖాదర్ ఖాన్‌కు చెప్పాడు. అప్పటి వరకు హిందీలో మాస్ క్యారెక్టర్లు వేరే తరహాగా ఉండేవి. ఖాదర్ ఖాన్ ఆ పాత్రను, భాషను మార్చాడు. కామటిపురాలో అలగా జనం మాట్లాడే ‘అపున్’, ‘దారు’, ‘బేవ్డా’ వంటి మాటలు పెట్టాడు. ఆ దిగువ భాష జనానికి పట్టింది. ఒక ట్రెండ్‌గా సెటిల్ అయ్యింది. యాంగ్రి యంగ్‌మేన్ అమితాబ్‌ను మాస్ హీరో అమితాబ్‌గా మార్చిన పెన్ ఖాదర్ ఖాన్‌దే. ఆ తర్వాత వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల కాంబినేషన్లో ‘మొకద్దర్ కా సికిందర్’, ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘యారానా’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ‘లావారిస్’ సినిమాలో అమితాబ్ ఒక ఫైట్‌లో సకల భాషల రౌడీలను కొడతాడు– ఆ భాషలు మాట్లాడుతూ. తెలుగు కూడా మాట్లాడటం తమాషాగా ఉంటుంది. జనం కేరింతలు కొట్టే ఈ తమాషాలు ఖాదర్ ఖాన్‌వే. ఖాదర్ ఖాన్ తెలుగు నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలకు రాశాడు. తెలుగు నటులు పోషించిన పాత్రలను పోషించాడు. ‘జస్టిస్ చౌదరి’ (జస్టిస్ చౌదరి), ‘జాని దోస్త్’ (అడవి సింహాలు), ‘మవ్వాలి’ (చుట్టాలున్నారు జాగ్రత్త), ‘తోఫా’ (దేవత), ‘మక్సద్’ (ముందడుగు), ‘హైసియత్’ (సీతారాములు), ‘ఖైదీ’ (ఖైదీ), ‘సింఘాసన్’ (సింహాసనం) ఇవన్నీ ఖాదర్ ఖాన్ రాసి, నటించిన సినిమాలు. ఖాదర్ ఖాన్ హిందీ సినిమా రంగంలో చాలామందికి సుదీర్ఘమైన కెరీర్ ఇచ్చాడు. డేవిడ్ ధావన్ వంటి దర్శకుడు తయారవడంలో ఖాదర్ ఖాన్ పాత్ర ఉంది. కథల వరుస ఎలా ఉండాలో అని అగమ్యంగా ఉన్న నటుడు గోవిందాని కామెడీ బాట పట్టించినవాడు ఖాదర్ ఖాన్. గోవిందా, ఖాదర్ ఖాన్, శక్తికపూర్లు కలిసి 1990లలో ఒక పదేళ్ల పాటు తెర మీద చాలా సందడి చేశారు. అది టేస్ట్ ఉన్న కామెడీ కాకపోవచ్చు కాని నవ్వొచ్చే కామెడీయే. ఖాదర్ ఖాన్ కోపం మనిషి. పటాటోపాలు నచ్చని మనిషి. అమితాబ్ తన స్టేటస్‌ను పెంచుకోవడంలో భాగంగా తనను అందరూ ‘సర్జీ’ అని పిలవాలని బాలీవుడ్లో ఆదేశాలు జారీ చేసినప్పుడు ‘అతన్ని నేను అమిత్ అని పిలవడం అలవాటు. నా అలవాటును మార్చుకోను. అతనితో పని చేయను’ అని తెగేసి చెప్పి అలాగే ఉన్న నటుడు ఖాదర్ ఖాన్. ‘నా చేతి వాచీ లక్ష రూపాయలు తెలుసా’ అని గోవిందా ఫోజు కొడితే ‘నా చేతివాచీ నూట యాభయ్యే. అది కూడా కరెక్ట్ టైమే చూపిస్తుంది’ అని వాత వేసినవాడు అతను. కాలం మారాక ఖాదర్‌ఖాన్ మెల్లగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఉర్దూ, అరబ్బీలు నేర్పే ఇన్స్టిట్యూషన్ నడిపాడు. పేద ముస్లింలు హజ్ యాత్ర చేయడానికి సాయపడే సంస్థను నిర్వహించాడు. ఆయన పిల్లలు కెనడాలో స్థిరపడ్డారు. అక్కడే ఆయన డిసెంబర్ 31, 2018న 81వ ఏట కన్ను మూశాడు. గట్టి ఎదురుదెబ్బలను, గొప్ప జీవితానుభవాలను సిరా చుక్కలుగా మార్చుకోగలిగినవాడు రచయితగా రాణించగలడని, సులువు తెలిసినవాడు నటుడుగా వెలగగలడని చెప్పినవాడు ఖాదర్ ఖాన్. రాసి రాసి అలసిపోయిన ఆ నట రచయితకు వీడ్కోలు చెప్పి అతడు పూయించిన నవ్వులను పెదాల మీదకు తెచ్చుకోవడమే అతనికి మనం అర్పించగలిగిన నివాళి. – కె. -
‘ఆ సినిమా హిట్టవ్వడం నా దురదృష్టం’
‘హిమ్మత్వాలా’ సినిమా.. అందులోని.. ‘నయినోం మే సప్నా.. సప్నోం మే సజ్నా’ పాట ఎంతగా హిట్టయ్యాయో సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తమన్నా- అజయ్ దేవగణ్ జంటగా ఈ సినిమాను మరోసారి రీమేక్ చేశారు కూడా. ‘ఊరికి మొనగాడు’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే సినీ అభిమానుల గుండెల్లో కొలువైన అందాల నటి శ్రీదేవి మాత్రం.. హిమ్మత్వాలా సినిమా హిట్టవ్వడాన్ని తన దురదృష్టంగా భావించారట. తనకు తొలి విజయాన్ని అందించిన సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా కావడంతో ఆమె కాస్త నిరాశ చెందారట. ఈ విషయాన్ని ‘శ్రీదేవి : క్వీన్ ఆఫ్ హర్ట్స్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీదేవి ‘సోల్వా సావన్’ అనే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో నాలుగేళ్ల పాటు బాలీవుడ్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత 1983లో శ్రీదేవి- జితేంద్ర జంటగా తెరకెక్కిన హిమ్మత్వాలా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ సినిమాతో శ్రీదేవి గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందారు. అయితే కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కావాలని ఆమె అనుకోలేదట. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘ తమిళ ప్రేక్షకులు నా సహజ నటనను ఇష్టపడతారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకుల అబిరుచి వేరు. సద్మా(వసంత కోకిల రీమేక్) ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నన్ను గ్లామరస్ పాత్రల్లో చూడాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హిమ్మత్వాలా సక్సెస్‌ను నా దురదృష్టంగా భావిస్తా. కానీ ఏదో ఒకరోజు నాలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుందని ఆమె అన్నట్లు ‘శ్రీదేవి’ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా హిందీలో శ్రీదేవి తొలి హిట్ హిమ్మత్వాలా 35వ వార్షికోత్సవానికి ఒకరోజు ముందుగానే ఆమె మరణించడం గమనార్హం. -
తొలుత తటపటాయించా
ముంబై : ‘హేట్ 2’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో పాత్ర పోషించే విషయమై తొలుత తటపటాయించానని సుర్వీన్చావ్లా చెప్పింది. ఈ సినిమాతోనే చావ్లా బాలీవుడ్లో అడుగిడింది. సాజిద్‌ఖాన్ నిర్మించిన ‘హిమ్మత్వాలా’ సినిమాలో సుర్వీన్ చిన్న పాత్ర పోషించింది. ‘పెద్ద పెద్ద నటుల సరసన తొలి సినిమా చేయాలని వర్ధమాన నటులు ఆకాంక్షిస్తారు. ఏదిఏమైనప్పటికీ ‘హేట్ 2’ సినిమా కొత్తగా బాలీవుడ్లో అడుగు పెట్టేవారికి సరైనది కాదు. సాధారణంగా ఈ రంగంలోకి అడుగిడినవారెవరైనా భారీ పతాకం కింద చేయాలని ఆశిస్తారు’ అని అంది. కాగా ‘హేట్ 2’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో సుర్వీన్ చావ్లా, టీవీ నటుడు భానుశాలి నటించారు. ఈ సినిమాలో సుశాంత్... ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో హీరో,హీరోయిన్ల మధ్య తీసిన శృంగార దృశ్యాలు బాలీవుడ్లో సంచలనం రేకెత్తించాయి. ఈ విషయమై సుర్వీన్ మాట్లాడుతూ అటువంటి దృశ్యాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. అది వృత్తిలో భాగమని చెప్పింది. ‘సన్నిహిత దృశ్యాలను నేను నిరోధించను. ఎంతో సౌకర్యవంతంగా భావిస్తాను. అయినప్పటికీ రొమాన్స్ అంటే నాకు ఇష్టమే. వాటిని తెర బయటి దృశ్యాలుగా భావించబోను. సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు ఉండాలి. ఇటువంటి దృశ్యాల్లో నటించడం ఎంత సులువో అంతే కష్టం కూడా. ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సీన్లలో నటించడం సమస్యే కాదు’ అని వివరించింది. -
నిరాశపడలేదు..!
ముంబై: దక్షిణాదిన అగ్రస్థానంలో తారగా కొనసాగుతున్న తరుణంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలిప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూసినా తాను నిరాశ పడలేదని అంటోంది తమన్నా. తెలుగు, తమిళ చిత్రాలు చేతినిండా ఉన్నప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అజయ్ దేవ్‌గణ్‌తో ‘హిమ్మత్వాలా’ సినిమా చేసిన విషయం తెలిసిందే. 80వ దశకంలో శ్రీదేవి, జితేంద్ర నటించిన సినిమాను అదే పేరుతో దర్శకుడు సాజిత్‌ఖాన్ రీమేక్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ... ‘రీమేక్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులు ఆదరిస్తున్నప్పటికీ 1980 నాటి చిత్రాలను రీమేక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కూడా అదే రీతిలో సాగడాన్ని ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు. ‘హిమ్మత్వాలా’లో నటించడం ద్వారా ఓ పెద్ద అడుగు వేశానని భావించాను. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా నేను నిరాశపడలేదు. సినిమా ఎంపిక ఎలా ఉండాలనే విషయమై ఓ పాఠం నేర్చుకున్నాననిపించింది. ప్రతి నటుడికి, నటికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. కెరీర్లో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నాను. దీనిని కూడా అదేవిధంగా భావించాన’ని చెప్పింది. మళ్లీ సాజిద్‌ఖాన్ దర్శకత్వంలోనే ‘హమ్షకల్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 20 విడుదల కానుంది. మళ్లీ సాజిద్తోనే ఎందుకు పనిచేస్తున్నారు? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... చేసిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేయడం తప్పేమీ కాదే... ఆయనతో పనిచేయడంలో నాకెలాంటి భయం, ఇబ్బందీ లేద’ని చెప్పింది. జీవితంలో ఎవరైనా ఎత్తుపల్లాలను ఎదుర్కొనక తప్పదని, ఈసారి మా ప్రయత్నం తప్పక సత్ఫలితాలనిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. -
మా బంధంపై బురద చల్లొద్దు!
‘‘ఆయన నాకు అన్నయ్య. జీవితాంతం అన్నగా అండగా ఉంటానని మాటిచ్చారు. అందుకే ఆయనకు రాఖీ కూడా కట్టాను. అలాంటి మా బంధంపై బురద చల్లడం భావ్యం కాదు’’ అని వాపోయారు మిల్కీబ్యూటీ తమన్నా. ‘హిమ్మత్వాలా’ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నా ప్రేమాయణం నడుపుతున్నారని, ఇప్పటికే గృహస్థుడైన సాజిద్, తమన్నాను రెండో వివాహం కూడా చేసుకోవాలనుకుంటున్నాడనే వార్త బాలీవుడ్లో షికార్లు చేస్తోంది. మొదట్లో ఈ రూమర్‌ని తమన్నా కానీ, సాజిద్ కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే... రాను రాను దీనికి మరిన్ని మసాలా దినుసుల్ని జత చేస్తూ... విభిన్న కథనాలను మీడియా ప్రసారం కావడం మొదలైంది. దాంతో ఖంగుతిన్న తమన్నా ఇటీవలే ఈ విషయంపై స్పందించారు. ‘‘సాజిద్ నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ. ఇలాంటి గాలివార్తలు కుటుంబాల్లో కూడా లేనిపోని సమస్యలకు కారణం అవుతాయి. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు’’ అన్నారు తమన్నా. మరోవైపు సాజిద్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇలాంటి వార్తలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. తమన్నా నా చెల్లెలు. అందుకే ఆమెతో నేను సన్నిహితంగా ఉంటున్నా. ఇంతకంటే క్లారిటీగా ఎవరూ చెప్పలేరు. ఇకనైనా ఇలాంటి గాసిప్పులకు తెర వేస్తే మంచిది’’ అని వివరణ ఇచ్చారు సాజిద్. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా, రెండు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు తమన్నా. బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కోసం ఐటమ్ గాళ్ అవతారం కూడా ఎత్తారీ ముద్దుగుమ్మ. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సమంత కథానాయిక. తనకు సాటి, పోటీ అయిన సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రంలో తమన్నా ఐటమ్‌సాంగ్‌లో నర్తించడం నిజంగా విశేషమే. -
ఒక్క ఫ్లాప్‌తో జీవితం అంతం కాదు!
పదేళ్లు... దాదాపు 30కి పైగా సినిమాలు. ఇదీ తమన్నా ట్రాక్ రికార్డ్. దక్షిణాదిన తను స్టార్ హీరోయిన్. కానీ, ఉత్తరాదిన ‘అప్ కమింగ్’ హీరోయిన్. పదేళ్లు ఇక్కడ ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్లో కొత్త హీరోయిన్గా కొనసాగడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మళ్లీ కొత్తగా కెరీర్ మొదలుపెట్టినట్లుగా ఉందంటున్నారు తమన్నా. ప్రస్తుతం హిందీలో హమ్ షకల్స్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్, తెలుగులో ఆగడు, బాహుబలి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ మిల్క్ బ్యూటీ. కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని చెబుతూ... మరిన్ని మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు తమన్నా. బాలీవుడ్లో ‘హిమ్మత్వాలా’ ఒప్పుకున్నప్పుడు ఒక్కసారిగా పదేళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. తెలుగులో ‘శ్రీ’ సినిమా అంగీకరించినప్పుడు, నాకు చాలా భయం భయంగా ఉండేది. తెలుగు తెలియదు. హైదరాబాద్‌కి కొత్త. ఇక్కడి కల్చర్ గురించి అవగాహన లేదు. దాంతో తిరనాళ్లల్లో తప్పిపోయినట్లనిపించింది. లక్కీగా యూనిట్ సభ్యులందరూ సహకరించడంతో త్వరగానే ఇక్కడ ఇమిడిపోగలిగాను. ఇక, బాలీవుడ్‌కి నేను కొత్త అయినా, హిందీ వచ్చు. ఉత్తరాది కల్చర్ తెలుసు. ఆ రంగానికి నేను కొత్త కావచ్చు కానీ నటనకు కాదు కదా. అందుకే, బాలీవుడ్లో ఎంత పోటీ ఉన్నా అభద్రతాభావం లేదు. సౌత్‌లో చాలా సినిమాలు చేశాను కాబట్టి, అక్కడ కెమెరా ఫియర్ లేకుండాపోయింది. కాకపొతే, ఇక్కడ పదేళ్లు అనుభవం సంపాదించుకుని, అక్కడ ‘అప్‌కమింగ్ హీరోయిన్’ జాబితాలో ఉండటం తమాషాగా ఉంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘హిమ్మత్వాలా’ ఫ్లాప్ అయినప్పుడు కొంచెం షాక్ అయ్యాను. ఒకవేళ నటిగా నాకు అదే మొదటి సినిమా అయ్యుంటే నా మానసిక స్థితి వేరే రకంగా ఉండేది. కానీ, పదేళ్ల కెరీర్లో జయాపజయాలకు సమానంగా స్పందించడం అలవాటైంది. ఒక్క ఫ్లాప్‌తో కెరీర్ అంతం అవ్వదు, జీవితం నాశనమయ్యేంత పెను మార్పులేవీ చోటు చేసుకోవు కదా అని నాకు నేను సర్ది చెప్పుకునేంతగా పరిణతి వచ్చింది. నా ఫ్లాప్ సినిమాలోనూ నటిగా నేను ఫెయిల్ కాలేదు. నేను కనుక ఫెయిల్ అయ్యుంటే తదుపరి అవకాశాలు రావు కదా. ప్రస్తుతం హిందీలో ‘హమ్ షకల్స్’, ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ చిత్రాల్లో చేస్తున్నా. మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆ మధ్య ఓ సందర్భంలో నేను ముంబయ్‌లో మాట్లాడిన మాటలను దక్షిణాదివారు అపార్థం చేసుకున్నారు. అందుకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే, నేనిక్కడి అమ్మాయి అనిపించుకోవాలనే తపనతో పట్టుబట్టి తెలుగు, తమిళ భాషలను నేర్చుకున్నాను. దీనికోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డాను. సౌత్ అంటే ప్రేమ లేకపోతే నేను భాష నేర్చుకునేదాన్నే కాదు. సౌత్‌లో సినిమా తారలను దేవుళ్లలా భావిస్తారు. గుళ్లు కట్టి, పూజించడానికి కూడా వెనకాడరు. అంత పిచ్చిగా ఆరాధిస్తారు. సినిమా స్టార్స్‌ని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. విదేశాల్లో ఉండేవాళ్లు కూడా మా గురించి తెలుసుకుంటుంటారు. మేం విదేశాలు వెళ్లినప్పుడు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. అందుకే నాకు సౌత్ అంటే ప్రత్యేకమైన అభిమానం. టీనేజ్‌లో హీరోయిన్ కావడంవల్ల చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాను. ఎవరైనా ఎందుకు చదువుకుంటారు? కెరీర్ కోసమే కదా. అనుకోకుండా నాకు మంచి కెరీర్ సెట్టయ్యింది. అందుకే, ఇక చదువు జోలికి వెళ్లలేదు. చదువు వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. సినిమా ప్రపంచం పెద్దది కాబట్టి, నా జనరల్ నాలెడ్జ్‌కి కొరత లేకుండాపోయింది. అలాగే, చదువు ద్వారా వచ్చే సంస్కారం కూడా సినిమా పరిశ్రమలోనే నేర్చుకున్నాను. అందుకే అంటున్నా.. నాకంతా సినిమానే. నాకు తెలిసింది యాక్టింగ్. దానికి వంద శాతం న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను.