ఒక్క ఫ్లాప్‌తో జీవితం అంతం కాదు! | The flap     Life is not the end! | Sakshi
Sakshi News home page

ఒక్క ఫ్లాప్‌తో జీవితం అంతం కాదు!

Published Fri, Mar 14 2014 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఒక్క ఫ్లాప్‌తో    జీవితం అంతం కాదు! - Sakshi

ఒక్క ఫ్లాప్‌తో జీవితం అంతం కాదు!

పదేళ్లు... దాదాపు 30కి పైగా సినిమాలు. ఇదీ తమన్నా ట్రాక్ రికార్డ్. దక్షిణాదిన తను స్టార్ హీరోయిన్. కానీ, ఉత్తరాదిన ‘అప్ కమింగ్’ హీరోయిన్. పదేళ్లు ఇక్కడ ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌గా కొనసాగడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది.

మళ్లీ కొత్తగా కెరీర్ మొదలుపెట్టినట్లుగా ఉందంటున్నారు తమన్నా. ప్రస్తుతం హిందీలో హమ్ షకల్స్, ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగులో ఆగడు, బాహుబలి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ మిల్క్ బ్యూటీ. కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని చెబుతూ... మరిన్ని మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు తమన్నా.
 
  బాలీవుడ్‌లో ‘హిమ్మత్‌వాలా’ ఒప్పుకున్నప్పుడు ఒక్కసారిగా పదేళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. తెలుగులో ‘శ్రీ’ సినిమా అంగీకరించినప్పుడు, నాకు చాలా భయం భయంగా ఉండేది. తెలుగు తెలియదు. హైదరాబాద్‌కి కొత్త. ఇక్కడి కల్చర్ గురించి అవగాహన లేదు. దాంతో తిరనాళ్లల్లో తప్పిపోయినట్లనిపించింది. లక్కీగా యూనిట్ సభ్యులందరూ సహకరించడంతో త్వరగానే ఇక్కడ ఇమిడిపోగలిగాను. ఇక, బాలీవుడ్‌కి నేను కొత్త అయినా, హిందీ వచ్చు. ఉత్తరాది కల్చర్ తెలుసు.  ఆ రంగానికి నేను కొత్త కావచ్చు కానీ నటనకు కాదు కదా. అందుకే, బాలీవుడ్‌లో ఎంత పోటీ ఉన్నా  అభద్రతాభావం లేదు. సౌత్‌లో చాలా సినిమాలు చేశాను కాబట్టి, అక్కడ కెమెరా ఫియర్ లేకుండాపోయింది. కాకపొతే, ఇక్కడ పదేళ్లు అనుభవం సంపాదించుకుని, అక్కడ ‘అప్‌కమింగ్ హీరోయిన్’ జాబితాలో ఉండటం తమాషాగా ఉంది.
 

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘హిమ్మత్‌వాలా’ ఫ్లాప్ అయినప్పుడు కొంచెం షాక్ అయ్యాను. ఒకవేళ నటిగా నాకు అదే మొదటి సినిమా అయ్యుంటే నా మానసిక స్థితి వేరే రకంగా ఉండేది. కానీ, పదేళ్ల కెరీర్‌లో జయాపజయాలకు సమానంగా స్పందించడం అలవాటైంది. ఒక్క ఫ్లాప్‌తో కెరీర్ అంతం అవ్వదు, జీవితం నాశనమయ్యేంత పెను మార్పులేవీ చోటు చేసుకోవు  కదా అని నాకు నేను సర్ది చెప్పుకునేంతగా పరిణతి వచ్చింది. నా ఫ్లాప్ సినిమాలోనూ నటిగా నేను ఫెయిల్ కాలేదు. నేను కనుక ఫెయిల్ అయ్యుంటే తదుపరి అవకాశాలు రావు కదా. ప్రస్తుతం హిందీలో ‘హమ్ షకల్స్’, ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ చిత్రాల్లో  చేస్తున్నా. మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి.
 

ఆ మధ్య ఓ సందర్భంలో నేను ముంబయ్‌లో మాట్లాడిన మాటలను దక్షిణాదివారు అపార్థం చేసుకున్నారు. అందుకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే, నేనిక్కడి అమ్మాయి అనిపించుకోవాలనే తపనతో పట్టుబట్టి తెలుగు, తమిళ భాషలను నేర్చుకున్నాను. దీనికోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డాను. సౌత్ అంటే ప్రేమ లేకపోతే నేను భాష నేర్చుకునేదాన్నే కాదు.
 

సౌత్‌లో సినిమా తారలను దేవుళ్లలా భావిస్తారు. గుళ్లు కట్టి, పూజించడానికి కూడా వెనకాడరు. అంత పిచ్చిగా ఆరాధిస్తారు. సినిమా స్టార్స్‌ని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. విదేశాల్లో ఉండేవాళ్లు  కూడా మా గురించి తెలుసుకుంటుంటారు. మేం విదేశాలు వెళ్లినప్పుడు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. అందుకే నాకు సౌత్ అంటే ప్రత్యేకమైన అభిమానం.
 

టీనేజ్‌లో హీరోయిన్ కావడంవల్ల చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాను. ఎవరైనా ఎందుకు చదువుకుంటారు? కెరీర్ కోసమే కదా. అనుకోకుండా నాకు మంచి కెరీర్ సెట్టయ్యింది. అందుకే, ఇక చదువు జోలికి వెళ్లలేదు. చదువు వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. సినిమా ప్రపంచం పెద్దది కాబట్టి, నా జనరల్ నాలెడ్జ్‌కి కొరత లేకుండాపోయింది. అలాగే, చదువు ద్వారా వచ్చే సంస్కారం కూడా సినిమా పరిశ్రమలోనే నేర్చుకున్నాను. అందుకే అంటున్నా.. నాకంతా సినిమానే. నాకు తెలిసింది యాక్టింగ్. దానికి వంద శాతం న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement