మంచి కథా చిత్రాల్లో నేనుండాలి
మంచి కథా చిత్రాల్లో నేనుండాలని ఆశిస్తున్నాను. అలాంటి చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాను అంటున్న నటి తమన్న ప్రస్తుతం కథానాయికల్లో గట్టి పోటీ నెలకొందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ బ్యూటీ బాలీవుడ్ ప్రయత్నం అంతగా ఫలించకపోయినా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఉన్నత స్థాయినే అందుకున్నారు. జీవితంలో ఒక్కో నటికి కనీసం ఒకటి రెండు చిత్రాలు మైలురాయిగా నిలిచిపోతాయి. అలా తమన్న నట జీవితంలో తొలి రోజుల్లో విజయబాట పట్టించిన హ్యాపీడేస్, ఇటీవల తెరపైకొచ్చి ప్రపంచ సినిమానే అబ్బుర పరచిన బాహుబలి మరచిపోలేని చిత్రాలుగా నిలిచిపోతాయి.
అలాంటి తమన్న కూడా తన స్థానాన్ని నిలుపుకోవడానికి నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పాత నీరు పోక, కొత్త నీరు రాక సర్వ సాధారణం అన్నట్లు చిత్రపరిశ్రమలో నూతన నటీమణుల దిగుమతి పెరుగుతూనే ఉంది. పారితోషికం, కాల్‌షీట్స్ సమస్య వంటి అంశాల కారణంగా దర్శకనిర్మాతలు వర్ధమాన హీరోయిన్లపై మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. ఇక స్టార్ హీరోలు నవనాయికలతో నటించడానికి ఆసక్తి చూపుతున్నారనే భావన లేకపోలేదు. ఇలాంటి కారణాలతో సీనియర్ హీరోయిన్లు అక్క, వదిన లాంటి పాత్రలకు మారిపోతున్నారనే మాట వినిపిస్తోంది.
నయనతార, త్రిష నటీమణులు దశాబ్దం కాలం దాటినా అగ్ర నాయికలు రాణిస్తున్నారు. వారు కూడా ఇప్పుడు హీరోలతో డ్యూయెట్లు పాడడం తగ్గించి హార్రర్ చిత్రాల బాట పట్టారన్నది గమనార్హం. ఒకప్పటి హీరోయిన్ల పరిస్థితి వేరు. అప్పట్లో వారి సంఖ్య తక్కువ. అందుకే పదికాలాల పాటు తమ స్థానాలను పదిల పరచుకున్నారు. వారి నటనా పఠిమ కూడా అందుకు ఒక కారణం. ఇప్పుడు హీరోయిన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. చాలా మంది ఒకటి రెండు చిత్రాలతోనే కనిపించకుండా పోతున్నారు.
దీని గురించి నటి తమన్న ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్ల మార్కెట్ కొద్దికాలమే. ఇప్పుడు కొత్తవాళ్లు ఎక్కువగా రావడంతో పోటీ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్‌గా ఎక్కువ కాలం రాణించడం అంత సులభం కాదు. అలా రాణించాలంటే తమ నటనా ప్రతిభను దిగుణీకృతం చేసుకుంటూపోవాలి. ఈ కాలానికి తగ్గట్టు తమను మార్చుకోవాలి. బాహుబలి చిత్రంలో నన్ను నేను అలానే కొత్తగా మలచుకున్నాను. అదో అద్భుత చిత్రం అలాంటి చిత్రావకాశాలు చాలా అరుదుగా వస్తాయి. నేనూ అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను.